ఖరీఫ్ లక్ష్యం 5.50 లక్షల ఎకరాలు
ఖరీఫ్ లక్ష్యం 5.50 లక్షల ఎకరాలు
Published Tue, May 2 2017 7:37 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
ఆకివీడు: రాబోయే ఖరీఫ్‌లో జిల్లాలో 5.50 లక్షల ఎకరాల్లో వరిసాగు లక్ష్యమని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు వై.సాయిలక్ష్మీశ్వరి తెలిపారు. ఆకివీడులోని సమతానగర్ రోడ్డులో రైతు జూపూడి శ్రీనివాస్‌కు చెందిన పంట భూమిలో మంగళవారం దాళ్వా దిగుబడి అంచనా వేశారు. ఎకరాకు 38.50 బస్తాలు దిగుబడి వచ్చింది. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఖరీఫ్ సాగుకు వేసవిలోనే మెట్ట దుక్కులు చేపట్టాలని సూచించారు. జూన్ మొదటి వారంలో నారుమళ్లు పోసుకుని జూలై మొదటి వారానికి నాట్లు పూర్తిచేయాలన్నారు. సకాలంలో నాట్లు వేయడంతో దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని చెప్పారు.
మెట్టలో మొలకెత్తని అపరాల విత్తనాలు
జిల్లాలో 12 వేల క్వింటాళ్ల అçపరాల విత్తనాలు పంపిణీ చేయగా మెట్ట ప్రాంతంలో నాటిన విత్తనాలు మొలకెత్తలేదని చెప్పారు. అక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువుగా ఉండటమే కారణమన్నారు. డెల్టాలో మూడో పంట ఆశాజనకంగా ఉందన్నారు.
9 వేల ఎకరాల్లో ప్రకృతి సాగు
జిల్లాలో వచ్చే ఖరీఫ్‌లో 9 వేల ఎకరాల్లో ప్రకృతి సాగుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఆమె చెప్పారు. 4 వేల ఎకరాల్లో వరి, మిగిలినది వాణిజ్య పంటల సాగు ఉంటుందన్నారు. గతేడాది 3 వేల ఎకరాల్లో ప్రకృతి సాగు చేశామన్నారు. గోమూత్రం, మలంతో తయారు చేసిన ఎరువుల్ని ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. దీనికి అవసరమైన ఆవులను రైతులు పెంచుకునేందుకు సబ్సిడీపై కొనుగోలు చేస్తామన్నారు. జీవ ఎరువుల సాగుకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
వంగడాల మినీకిట్లు సిద్ధం
ఖరీఫ్‌లో సాగుచేసేందుకు కొత్త వంగడాల మినీ కిట్లు సిద్ధం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. స్వర్ణకు ప్రత్యామ్నాయంగా ఎంటీయూ 1229, సాంబ మసూరీకి ప్రత్యామ్నాయంగా ఉన్న ఎంటీయూ 1224, 1010కి ప్రత్యామ్నాయంగా 1224 వంగడాన్ని రైతులు సాగు చేయాలని సూచించారు.
యంత్రం.. రైతు ఇష్టం
వ్యవసాయ పనిముట్లను రైతుల ఇష్టానుసారం కొనుగోలు చేసుకోవచ్చని ఆమె చెప్పారు. రైతుకు నచ్చిన కంపెనీ యంత్రాన్ని కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. 20 శాతం సబ్సిడీ, 30 శాతం రైతు పెట్టుబడి, 50 శాతం రుణం బ్యాంకులు అందజేస్తాయన్నారు. వ్యవసాయాధికారి నిమ్మల శ్రీనివాస్, గంణాంకాధికారి గంగయ్య, వీఆర్‌ఓ చైతన్య, ఎంపీఈఓలు ఆమె వెంట ఉన్నారు.
Advertisement
Advertisement