‘రాజు’గారూ..! మీ సేవలు ఇక చాలు!
సాక్షి, తిరుమల: ‘‘నాకు నేనుగా రాజీనామా చేయను?’’ అని టీటీడీ చైర్మన్ పదవిని అంటిపెట్టుకున్న కనుమూరి బాపిరాజుకు సోమవారం గట్టి ఎదురు దెబ్బతగిలింది. ‘మీ సేవలు ఇక చాలు’ అంటూ టీటీడీ బోర్డును రద్దు చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు సోమవారం దేవస్థానం బోర్డు సెల్ కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి.
కేంద్ర కేబినెట్ మంత్రి స్థాయి కంటే ఎక్కువ హోదా కలిగిన టీటీడీ చైర్మన్ పదవిలో ఢిల్లీ పెద్దల అండదండలు, తన రాజకీయ పలుకుబడితో కనుమూరి బాపిరాజు ఏకధాటిగా మూడేళ్లపాటు కొనసాగారు. ప్రభుత్వం మారినా పదవిని మాత్రం వదులుకునేందుకు ఆయన ససేమిరా అన్నారు. ఈయన హయాంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు జరిగింది అంతంతమాత్రమే. అభివృద్ధి కార్యక్రమాల మాట ఎటున్నా విమర్శలు మాత్రం మూటకట్టుకున్నారు. అధికారాన్ని తన కుటుంబీకులకు పంచారన్న ఆరోపణలు ఉన్నాయి. తనకంటే తన కుటుంబీకులే మహద్వారం గుండా మందీమార్బలంతో ప్రవేశిస్తూ అయినవారికి యథేచ్ఛగా దర్శనాలు చేయించటంలో బిజీగా గడిపారన్న విమర్శలున్నాయి.
రోజుకు కనీసం రూ.40 వేలు అద్దె వచ్చే అధునాత వసతులతో తొమ్మిది గదులున్న అతిథిగృహాన్ని పూర్తిగా మూడేళ్లపాటు తన ఆధీనంలో ఉంచుకుని శ్రీవారి ఖజానాకు భారీగా గండికొట్టారన్న ఆరోపణలు మూటకట్టుకున్నారు. చైర్మన్ హోదాలో ఉన్న బాపిరాజు కేంద్ర మంత్రి నుంచి గుమాస్తా వరకూ, కార్పొరేట్ దిగ్గజం నుంచి చిల్లర వర్తకుడి స్థాయి వరకు అవసరమనుకున్న వారందరికీ తానే సాగిలపడుతూ దగ్గరుండి దర్శనాలు చేయించారన్న అపవాదు మిగుల్చుకున్నారు. తిరుమలలోని చైర్మన్‌క్యాంపు కార్యాలయాన్ని గంపగుత్తగా తన వారికి అప్పగించి చోద్యం చూశారన్న విమర్శలు కూడా బాహాటంగానే ఎదురవటం గమనార్హం. ఇక పార్లమెంట్ సభ్యుడిగా సీమాంధ్ర నుంచి ప్రాతినిథ్యం వహించిన ఆయన విభజన ఉద్యమానికి ఏ మాత్రం ఎదురుతిరిగి మాట్లాడకపోవడంపై ప్రజలు తీవ్ర నినసనలు వ్యక్తం చేసినా బాపిరాజు పట్టించుకోలేదు.
విభజన మంటపెట్టిన కాంగ్రెస్ అధిష్టానంపై పల్లెత్తు మాట మాట్లాడలేదు. ఆఖరకు ప్రభుత్వం మారినా తన పదవిని వదులుకునేందుకు సిద్ధపడకపోగా మరోసారి కొనసాగేందుకు తన బంధుగణంతో కాళ్లబేరానికి దిగినట్టు ప్రచారం సాగింది. ఈనెల ఒకటవ తేదీన కేబినెట్ తీర్మానంలో టీటీడీ బోర్డును కూడా రద్దు చేశామని ప్రభుత్వం ప్రకటించింది. అయినా నవ్విపోదురుకాని.. నాకేమిటన్నట్టు దేవస్థానం పదవి కాలాన్ని ఒక్క సెకను కూడా వదులుకోబోనని మీడియా సమావేశంపెట్టి మరీ తెగేసి చెప్పేశారు. ఆయన పదవీ కాలం మరో 13 రోజులు ఉండగానే ప్రభుత్వం ఆర్డినెన్స్ ఉత్తర్వులు ఇచ్చి రాజుగారి సేవలకు సెలవు ప్రకటించింది.
చైర్మన్ కార్యాలయం ఖాళీ.. భక్తులకు గదుల కేటాయింపు
మూడేళ్లుగా తన సొంత కార్యాలయానికి వాడుకున్న 9 గదులున్న పద్మావతి నిలయం అతిథిగృహాన్ని సోమవారం నుంచి భక్తులకు కేటాయించారు. ఇక్కడున్న చైర్మన్ కార్యాలయాన్ని రిసెప్షన్ అధికారులు సోమవారం ఖాళీ చేయించారు.