నామినేషన్ వేసిన బాపిరాజు
నామినేషన్ వేసిన బాపిరాజు
Published Sun, Apr 13 2014 1:24 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
నరసాపురం అర్బన్, న్యూస్‌లైన్ : నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎంపీ, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు శనివారం నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలతో ఊరేగింపుగా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయానికి మధ్యాహ్నం 2.20 గంటలకు చేరుకున్న ఆయన ఒక సెట్టు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ టి.బాబూరావు నాయుడుకు అందజేశారు. బాపిరాజు వెంట ఆయన సతీమణి అన్నపూర్ణ, డీసీసీ అధ్యక్షుడు వెంకటరత్నం ఉన్నారు. బాపిరాజు నరసాపురం నుంచి నాలుగోసారి పోటీ పడుతున్నారు.
కోడ్ ఉల్లంఘించిన కేంద్ర మంత్రి శీలం, బాపిరాజు
పోలీసుల అనుమతి లేకుండా బహిరంగ సభ నిర్వహించి కేంద్రం మంత్రి జేడీ శీలం, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. బాపిరాజు నామినేషన్ దాఖలు చేసేందుకు శనివారం స్థానిక అంబేద్కర్ సెంటర్ నుంచి ఊరేగింపుగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి బయలు దేరారు. ఇదే సమయంలో స్థానిక కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి జేడీ శీలం పట్టణంలో రోడ్‌షో నిర్వహించి థామస్ బ్రిడ్జి వద్ద బహిరంగ సభ నిర్వహించారు. కేవలం రోడ్‌షో నిర్వహించడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ అనుమతి తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా సభ నిర్వహించడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే సభను నిలిపివేయాలని సీఐ భాస్కరరావు కోరారు. కానీ వారు పట్టించుకోకుండానే సభ నిర్వహించారు. దీనిపై ఇంకా కేసు నమోదు కాలేదు.
Advertisement