సాక్షి, తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామిని కనులారా క్షణంపాటు దర్శించినా భక్తులు పరవశించిపోతుంటారు. ఆ స్వామికి తమ చేతులమీదుగా సమర్పించే మేల్‌ఛాట్ వస్త్రాన్ని (మూలమూర్తికి 12 గజాల పొడవు రెండుగజాల వెడల్పు కలిగిన ధోవతి) అలంకరింప చేస్తే.. అలాంటి మధురానుభూతి పొందే అవకాశాన్ని తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మకర్తల మండలి కల్పించింది.
తిరుమల ఆలయంలో ప్రతి శుక్రవారం శ్రీవారికి బహూకరించే మేల్‌ఛాట్ వస్త్రాన్ని ఇకపై భక్తులు ఇస్తే స్వీకరించాలని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో గిరిధర్ గోపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశం తీర్మానించింది. భారీగా మార్కెటింగ్ కొనుగోళ్లకు అవసరమైన అనుమతులకు ఆమోదం తెలిపింది. అలాగే, టీటీడీ మార్కెటింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్ల అసోసియేషన్ నుంచి కేజీ రూ.42 చొప్పున ఆరునెలలకు సరిపడా రూ.12.85కోట్లతో బియ్యం కొనుగోలు చేయనున్నారు. రూ.9కోట్లతో 22లక్షల కిలోల బెంగాల్ దాల్(పప్పు), రూ.1.35 కోట్లతో 1.5 లక్షల కిలోల పెసరపప్పు, రూ.1.67 కోట్లతో 440 టన్నుల బెల్లం కొనుగోలు చేయనున్నారు.
ముంబైలోని మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎంఎంటీసీ) లిమిటెడ్ సంస్థ నుంచి 2 గ్రాములు, 5 గ్రాముల వెండి డాలర్లు 30 వేలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. శ్రీవారి భక్తులకు లడ్డూల కొరత లేకుండా చూసేందుకు ఆలయంలో ప్రధాన పోటులో 332మంది, అదనపు పోటులో 140మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని 2016వ సంవత్సరం వరకు కొనసాగించనున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 32 కంపార్ట్‌మెంట్లలో దర్శనం కోసం వేచి ఉండే భక్తులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు తిలకించేలా రూ.2.70 కోట్లతో 108 అంగుళాల ప్లాస్మా టీవీలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు.
మేల్‌ఛాట్ వస్త్రాలు భక్తులూ ఇవ్వొచ్చు
Published Sat, May 31 2014 1:03 AM | Last Updated on Fri, Nov 9 2018 6:29 PM
Advertisement
Advertisement