ఇప్పుడు కాదు! | Tirupati Corporation election process | Sakshi
Sakshi News home page

ఇప్పుడు కాదు!

Published Sun, Nov 2 2014 3:53 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

ఇప్పుడు కాదు! - Sakshi

ఇప్పుడు కాదు!

  • తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలకూ టీటీడీ పాలక మండలి ఏర్పాటుకు లింకు
  •  ఎన్నికల తర్వాత బోర్డు నియామకమని సీఎం తేల్చడంతో డీలాపడ్డ ఆశావహులు
  • సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాకనే తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలిని నియమిస్తామని సీఎం చంద్రబాబు తేల్చిచెప్పడంతో ఆశావహులు డీలాపడ్డారు. ఎన్నికలు టీడీపీ విజయానికి పాలక మండలిలో స్థానానికి ముడిపెట్టడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. దేవాలయ పాలక మండళ్లను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేయడంతో టీటీడీ బోర్డు ఖాళీ అయిన విషయం విదితమే. ప్రస్తుతం స్పెసిఫైడ్ అథారిటీ నేతృత్వంలో టీటీడీ పాలనా వ్యవహారాలు సాగుతున్నాయి.

    ఇటీవల దేవాలయాల పాలక మండలి నియామకాలకు ప్రభుత్వం తెరతీసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు చైర్మన్ పదవిపై పలువురు ఆశలు పెంచుకున్నారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, రాజమండ్రి, నరసరావుపేట ఎంపీలు మాగంటి మురళీమోహన్, రాయపాటి సాంబశివరావు, మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడు పోటీ పడుతున్నారు. ఈ రేసులో చదలవాడ కృష్ణమూర్తి ముందున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

    సార్వత్రిక ఎన్నికల సమయంలో చదలవాడ కృష్ణమూర్తి తిరుపతి శాసనసభ స్థానం టీడీపీ అభ్యర్థిత్వాన్ని ఆశించారు. కానీ.. చివరి నిముషంలో సైకిలెక్కిన ఎం.వెంకటరమణకు చంద్రబాబు అప్పట్లో టికెట్ ఇచ్చారు. చదలవాడ అలకబూనడంతో.. తిరుపతిలో వెంకటరమణను గెలిపిస్తే- టీటీడీ బోర్డు చైర్మన్‌పదవిని ఇస్తానని ఆయనకు మాట ఇచ్చారు. ఇదే అంశాన్ని రాతపూర్వకంగా కూడా చంద్రబాబు హామీ ఇచ్చినట్లు చదలవాడ వర్గీయులు
     
    అప్పట్లో మీడియాకు లేఖలు విడుదల చేశారు. ఇది పసిగట్టిన వెంకటరమణ.. గెలుపోటములతో నిమిత్తం లేకుండా తనను తుడా చైర్మన్‌గా కొనసాగించాలని చంద్రబాబుకు అప్పట్లోనే షరతు పెట్టారు. ఆ మేరకు తుడా చైర్మన్‌గా వెంకటరమణను కొనసాగిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే తనకు ఇచ్చిన హామీని నిలుపుకోవాలని సీఎం చంద్రబాబును చదలవాడ కోరారు. టీటీడీ బోర్డు చైర్మన్ పదవికి తీవ్రంగా పోటీ పడుతున్న నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన సంస్థకు పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కింది.

    నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థకు భారీ ఎత్తున మొబిలైజేషన్ అడ్వాన్సు ముట్టజెప్పి, టీటీడీ చైర్మన్ రేసు నుంచి రాయపాటిని తప్పుకునేలా చేశారని టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు తాను టీటీడీ చైర్మన్ రేసులో లేనని రాయపాటి ప్రకటించడం గమనార్హం. టీటీడీ చైర్మన్ పదవి కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. ఇందుకు గాలి అంగీకరించలేదని సమాచారం.

    ఎమ్మెల్సీ పదవితోపాటూ మంత్రి పదవి ఇవ్వాలని.. లేని పక్షంలో టీటీడీ చైర్మన్ పదవిని తనకు ఇవ్వాలని పట్టుబట్టినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఒకానొక దశలో చదలవాడను టీటీడీ బోర్డు చైర్మన్‌గా నియమించడానికి రంగం సిద్ధం చేసిన సీఎం చంద్రబాబు.. గాలి పట్టుబట్టడం, తిరుపతి టీడీపీలో వర్గ విభేదాలు.. కార్పొరేషన్ ఎన్నికలు ముంచుకొస్తోన్న నేపథ్యంలో వెనక్కి తగ్గారు. తిరుపతి టీడీపీలో నెలకొన్న వర్గ విభేదాల నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు.

    ఈ నేపథ్యంలో తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాకనే టీటీడీ బోర్డును నియమిస్తామని ఇటీవల జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, కీలక నేతలతో చంద్రబాబు తెగేసిచెప్పడంతో ఆశావహులు డీలాపడ్డారు. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంపైనే చదలవాడకు టీటీడీ బోర్డు చైర్మన్ పదవి దక్కడం ఆధారపడి ఉంటుందని ఆపార్టీ వర్గాలు అభిప్రాయపడుతుండడం కొసమెరుపు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement