తిరుపతి మణిహారంలో ఐటీ హబ్ !
- నిర్ణయించిన రాష్ర్ట మంత్రి వర్గం
- వెయ్యి ఎకరాలను గుర్తించాలని కలెక్టర్ జైన్‌ను ఆదేశించిన ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి మణిహారంలో మరో కలికితురాయి చేరనుందా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం చెబుతోంది మంత్రివర్గ నిర్ణయం. ఐటీ హబ్‌ను తిరుపతిలో ఏర్పాటుచేయాలని శుక్రవారం మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందుకు వెయ్యి ఎకరాల భూమిని సేకరించాలని కలెక్టర్ సిద్ధార్థజైన్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
ఐటీ హబ్ ఏర్పాటైతే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు పేరుతో టీడీపీ నేతలకు రియల్‘భూమ్’ ఇచ్చేలా చేసిన ప్రచారం తరహాలోనే ఐటీ హబ్ ఏర్పాటు ప్రకటన ఉంటుందా? వాస్తవంగా ఐటీ హబ్‌ను ఏర్పాటుచేస్తారా? అన్న అంశంపై నిపుణులు సం దేహాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
సీఎం చంద్రబాబు సారథ్యంలో మంత్రివర్గం శుక్రవారం సమావేశమైంది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల్లో తిరుపతిలో ఐటీ హబ్‌ను ఏర్పాటుచేయాలన్నది ఒకటి. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఐటీ హబ్‌ను ఏర్పాటుచేయడానికి వెయ్యి ఎకరాల భూమిని గుర్తించాలని కలెక్టర్ సిద్ధార్థజైన్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఐటీ హబ్ ఏర్పాటుకు రూ.350 కోట్ల వరకూ ఖర్చు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.
ఐటీ హబ్ ద్వారా రాష్ట్రంలో ఈ-సేవలను విస్తృతం చేయడానికి పెద్దపీట వేస్తామని ప్రకటించింది. కానీ.. మంత్రివర్గ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఎందుకం టే.. జాతీయ విద్యాసంస్థల ఏర్పాటులో ప్రభు త్వం రోజుకో విధానం.. పూటకో మాట మాట్లా డుతోంది. విభజన నేపథ్యంలో రాష్ట్రంలో 11 జాతీయ విద్యా సంస్థలను ఏర్పాటుచేసేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లులోనే కేం ద్రం అంగీకరించింది. కేంద్రం మంజూరు చేసే 11 సంస్థల్లో తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్, సెంట్రల్ యూనివర్సిటీలను నెలకొల్పుతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జూన్ 18న ప్రకటించారు.
ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్, సెంట్రల్ వర్సిటీలను నెలకొల్పాలని తీర్మానించారు. ఆ సంస్థల ఏర్పాటుకు వెయ్యి ఎకరాల భూమిని గుర్తించాలని కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఏర్పేడు-శ్రీకాళహస్తి మండలాలు, చంద్రగిరి, రామచంద్రాపురం మండలాల్లో విద్యా సంస్థల ఏర్పాటుకు భూములను కలెక్టర్ సిద్ధార్థజైన్ గుర్తించారు. ఆ భూములను రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకష్ణారెడ్డిలు కలెక్టర్ సిద్ధార్థజైన్‌తో కలిసి జూలై 17న పరిశీలించారు.
మంత్రి నారాయణ విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్, సెంట్రల్ వర్సిటీలను ఏర్పాటుచేసి.. ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్, సెంట్రల్ వర్సిటీల తరగతులను కూడా ప్రారంభిస్తామని ప్రగల్భాలు పలికారు. తిరుపతిలో పర్యటించి పది రోజులు కూడా పూర్తికాక ముందే మంత్రి నారాయణ మాట మార్చారు.
సెంట్రల్ యూనివర్సిటీనీ తూర్పుగోదావరిజిల్లాలో ఏర్పాటుచేస్తున్నట్లు జూలై 26న మంత్రి నారాయణ హైదరాబాద్‌లో ప్రకటించారు. ఆ యూనివర్సిటీ ఏర్పాటుకు భూమిని కూడా గుర్తించాలని తూర్పుగోదావరిజిల్లా కలెక్టర్‌ను మంత్రి నారాయణ ఆదేశించారు. ఇటీవల ఐఐఎస్‌ఈఆర్‌ను మంత్రి నారాయణ తన సొంత జిల్లా నెల్లూరుకు తరలించేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఐఐఎస్‌ఈఆర్‌కు అంతరిక్ష పరిశోధన కేంద్రానికి అవినాభావ సంబంధం ఉంటుందనే సాకును చూపుతున్నారు.
శ్రీహరికోటలో షార్ ఉన్న నేపథ్యంలో ఐఐఎస్‌ఈఆర్‌ను కూడా అక్కడే ఏర్పాటుచేస్తే అధికంగా ప్రయోజనం ఉంటుందని మంత్రి నారాయణ చెబుతున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఐఐఎస్‌ఈఆర్ కూడా తిరుపతి నుంచి చేజారిపోయినట్లే..! ఇక మిగిలింది ఒక్క ఐఐటీనే. కనీసం ఐఐటీనైనా తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తారా అంటే స్పష్టమైన సమాధానం చెప్పేందుకు ఏ ఒక్క అధికారీ సాహసించడం లేదు.
తిరుపతిని ఎడ్యుకేషనల్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ప్రకటనలు మీద ప్రకటనలు గుప్పించి.. టీడీపీ నేతల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రభుత్వం ఊతమిచ్చందనే విమర్శలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఐటీ హబ్ ఏర్పాటుపై కూడా మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఆ కోవలోకే వస్తుందా..? లేదా అన్నది తేలాలంటే కొంత కాలం ఆగక తప్పుదు.