ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: అంగన్‌వాడీలంతా విధులకు హాజరయ్యేలా చూడాలని మహిళా శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నీలం సహాని ఆదేశించారు. కమిషనర్ చిరంజీచౌదరితో కలిసి అన్ని జిల్లాల రీజనల్ డిప్యూటీ డెరైక్టర్లు, ప్రాజెక్టు డెరైక్టర్లు, సీడీపీఓలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం సహాని మాట్లాడుతూ 12 రోజుల నుంచి అంగన్‌వాడీలు నిరవధిక సమ్మెకు దిగడంతో కార్యకలాపాలు కుంటుపడ్డాయన్నారు.
ఐసీడీఎస్ ప్రాజెక్టుల వారీగా అంగన్‌వాడీ సిబ్బందితో మాట్లాడి విధులకు హాజరయ్యేలా చూడాలన్నారు. వారి డిమాండ్ల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకునే అధికారం లేకుండా పోయింద ని, రాష్ట్రంలో ప్రభుత్వం లేని విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాజెక్టుల వారీగా ఎన్ని అంగన్‌వాడీ కేంద్రాలు మంజూరయ్యాయి, వాటిలో ఎన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి, మిగిలినవి ఏ దిశలో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థలకు కేటాయించే బడ్జెట్‌లో ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు, ఎంత మిగులు ఉంది, ఎప్పటిలోపు ఖర్చు చేస్తారో నీలం సహాని తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రీజనల్ డిప్యూటీ డెరైక్టర్ కామేశ్వరమ్మ, ప్రాజెక్టు డెరైక్టర్ విద్యావతి, జిల్లాకు చెందిన సీడీపీఓలు పాల్గొన్నారు.
పీడీ సమీక్ష : జిల్లాలోని సీడీపీఓలతో ప్రాజెక్టు డెరైక్టర్ విద్యావతి తన చాంబర్‌లో సమీక్షించారు. రెండు ప్రాజెక్టులు మినహా మిగిలిన ప్రాజెక్టుల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలన్నీ మూతపడిన నేపథ్యంలో అక్కడి పరిస్థితులను ఆమె సీడీపీఓలను అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీలను పిలిపించి కేంద్రాల నిర్వహించే విధంగా చూడాలన్నారు.
అంగన్‌వాడీలు విధులకు హాజరయ్యేలా చూడాలి
Published Sat, Mar 1 2014 3:04 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
Advertisement
Advertisement