వైఎస్‌ఆర్‌సీపీకి పట్టం కట్టండి | to be crowned ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌సీపీకి పట్టం కట్టండి

Published Tue, Mar 25 2014 2:43 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

to be crowned ysrcp

ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కై ఎన్నో ఇబ్బందులకు గురిచేశాయని..  ప్రస్తుతం మనం ఇన్నాళ్లు ఎదురుచూస్తున్న అవకాశం వచ్చింది. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టాలని పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. స్థానిక గాంధీరోడ్డులోని పోసిన కాంపౌండ్‌లో సోమవారం  వేలాది మంది మహిళలతో నిర్వహించిన  సభలో ఆయన మాట్లాడారు. ‘ ఫ్యాన్ గాలికి కుమ్మక్కు రాజకీయాలు  లేచిపోవాలి. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఎమ్మెల్యే లింగారెడ్డిల వల్లే పట్టణానికి తాగునీటి సమస్య ఏర్పడింది.  

తాగునీటి సమస్య పరిష్కారం కోసం  వైఎస్ కుందూ-పెన్నా నీటి పథకాన్ని మంజూరు చేయగా.. వీరి వలనే పనులు ఆగిపోయాయి.   ప్రస్తుతం తాగునీటి సమస్యకు వీరే ముఖ్య కారణం’ అని అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ ప్రొద్దుటూరు అసెంబ్లీ అభ్యర్థి రాచమల్లు ప్రసాదరెడ్డి మాట్లాడుతూ  వైఎస్ హయాంలో వేటి ధరలు పెరగలేదని.. ఆయన మరణం తర్వాత నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు.  9 ఏళ్ల హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పదేళ్లకు ఉపయోగపడే ఏ ఒక్క పని చేయలేదన్నారు.  వైఎస్ హయాంలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, పింఛన్, పావలావడ్డీ, 108, జలయజ్ఞం లాంటి వాటిని అమలు చేశారని గుర్తుచేశారు. వైఎస్ పాలన జగన్‌తోనే సాధ్యమన్నారు.
 
 వరద 25 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్నా  మీ వద్దకు కనీసం 25 మార్లు అయినా వచ్చాడా అని  ఎద్దేవా చేశారు. ఐదేళ్లపాటు లింగారెడ్డికి అధికారం ఇస్తే  నాలుగు బిందెలు నీరు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.  దోమలు, పారిశుద్ధ్యం, తాగునీరు, ట్రాఫిక్, ఇలా ఏ సమస్యనైనా పరిష్కరించారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం వీరిద్దరు తాము కలిసిపోయామంటూ పత్రికల్లో ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారని మండిపడ్డారు.    ప్రజా సేవ చేయాలన్న తపనతోఉన్న తమకు అవకాశం ఇస్తే మెరుగైన పాలన అందిస్తామన్నారు. ప్రధానంగా కుందూ-పెన్నా వరదకాలువ పనులు పూర్తి చేయించి తాగునీటి సమస్య పరిష్కరిస్తామన్నారు.

  పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వీఎస్ ముక్తియార్ మాట్లాడుతూ  కూరగాయల మార్కెట్‌ను ఆధునీకరణ పేరుతో వరద  కూల్చే యత్నం చేశాడన్నారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని... బంగారంగళ్ల వీధులలో  సొంత డబ్బుతో  పార్కింగ్ ఏర్పాటు చేస్తానన్నారు. ఈవీ సుధాకర్‌రెడ్డి,   కేవీ రమణారెడ్డి మాట్లాడుతూ   వైఎస్‌ఆర్‌సీపీకి  అఖండ మెజారిటీ కట్టబెట్టాలని కోరారు.  

 సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ కల్లూరు నాగేంద్రారెడ్డి, ఖాదీబోర్డు మాజీ డైరక్టర్ దొంతిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ కౌన్సిలర్ పోరెడ్డి నరసింహారెడ్డి, పాణ్యం సుబ్బరాయుడు, లాయర్ సుబ్బయ్య, సోములవారిపల్లె సర్పంచ్ ప్రశాంతి శేఖర్, పెద్దశెట్టిపల్లె సుధాకర్‌రెడ్డితోపాటు మున్సిపాలిటీ పరిధిలోని 40 మంది వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement