ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్‌లైన్: ఐటీసీ విస్తరణ కోసం బూర్గంపాడు మండలంలో 1/70 చట్టానికి విరుద్ధంగా చేసిన భూ కేటాయింపులను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు డిమాండ్ చేశారు. మంగళవారం సుంవరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆధ్వర్యంలో అక్కడ పరిశ్రమ నెలకొల్పాలని కోరారు. భూముల కేటాయింపు నిర్ణయాన్ని వెనుకకు తీసుకోకుంటే ప్రజలను సమీకరించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఐటీసీకి 837 ఎకరాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. గతంలో ఇచ్చిన భూమి కంటే ఐటీసీ అదనంగా భూమి కబ్జాచేసి వినిమోగించుకుంటోందని ఆరోపించారు. కనీసం పంచాయతీకి పన్ను కూడా చెల్లించడం లేదన్నారు.
ఒప్పందం ప్రకారం స్థానికులకు, గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని చెప్పారు. 1500 మంది కార్మికులుంటే అందులో గిరిజనులు 1 శాతం కుడా లేరన్నారు. కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న వారికి కనీస వేతన చట్టం అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం అమలు చేయాలని కోరితే వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ఐటీసీ నుంచి వెలువడే కాలుష్యంతో బూర్గంపాడు, కుక్కునూరు, భద్రాచలం మండలాల్లో అత్యధిక మంది మహిళలు గర్భకోశ, క్యాన్సర్ వ్యాధులతో బాధ పడుతున్నారని చెప్పారు. కాలుష్య నివారణ విషయంలో ఐటీసీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఐటీసీకి భూముల కేటాయింపు రద్దు చేయాలి
Published Wed, Sep 25 2013 4:39 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
Advertisement