నేడే ఎంసెట్
- హాజరుకానున్న విద్యార్థులు 2.32 లక్షలు
- ఏపీ విద్యార్థులు 43,169 మంది, ఇతర రాష్ట్రాల నుంచి 9,458 మంది
- ఉదయం ఇంజనీరింగ్, మధ్యాహ్నం మెడిసిన్ పరీక్ష
- నిమిషం ఆలస్యమైనా అనుమతించరు
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో ఎంసెట్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 10 గంటలకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ కోసం పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకోసం సకల ఏర్పాట్లు చేసినట్లు రాష్ర్ట ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణారావు తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని, విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష సమయానికి గంట ముందుగానే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని వివరించారు. ఈ పరీక్షలకు 2,32,045 మంది హాజరుకానున్నారు. ఇంజనీరింగ్ విభాగానికి 1,39,677 మంది, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ కోసం 92,368 దరఖాస్తు చేసుకున్నారు. మెడిసిన్ విభాగంలో పరీక్ష రాసే వారిలో బాలుర కంటే బాలికలే ఎక్కువగా ఉన్నారు. అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ రాసేందుకు మొత్తంగా 92,368 దరఖాస్తు చేసుకోగా అందులో బాలురు 33,309 మంది ఉంటే బాలికలు 59,329 మంది ఉన్నారు. దాదాపు రెట్టింపు సంఖ్యలో బాలికలు దరఖాస్తు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా దరఖాస్తులు
తెలంగాణలో తొలి ఎంసెట్‌కు ఏపీ నుంచి అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఆంధ్రా యూనివర్సిటీ పరిధి నుంచి 26,241 మంది, శ్రీవేంకటేశ్వర వర్సిటీ పరిధి నుంచి 16,928 మంది కలిపి మొత్తంగా 43,169 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మెడిసిన్ కోసం 26,894 మంది, ఇంజనీరింగ్‌కు 16,275 మంది హాజరవుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా 9,458 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఫిట్‌మెంట్‌పై ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించడం విద్యార్థులకు ఊరట కలిగించింది. పరీక్ష కేంద్రాలకు చేరుకోడానికి ఇబ్బందులు తప్పుతాయని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక విద్యార్థుల కోసం ప్రభుత్వం చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా విద్యార్థులు వినియోగించుకోవాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ రమణారావు తెలిపారు. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం మూడంచెల ఏర్పాట్లు చేసిందని, అయితే సమ్మె విరమణతో చాలా వరకు ఇబ్బందులు తప్పినట్లేనని పేర్కొన్నారు.
======================
ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థులు
కేటగిరీ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ మొత్తం
బాలురు 88,206 33,039 1,21,245
బాలికలు 51,471 59,329 1,10,800
మొత్తం 1,39,677 92,368 2,32,045