పొగాకు రైతులను ఆదుకోండి | Tobacco Board Chairman Visits Prakasam District | Sakshi
Sakshi News home page

పొగాకు రైతులను ఆదుకోండి

Published Sat, Aug 10 2019 12:53 PM | Last Updated on Sat, Aug 10 2019 12:54 PM

Tobacco Board Chairman Visits Prakasam District - Sakshi

పొగాకు బోర్డు చైర్మన్‌ రఘునాథబాబుకు రైతు సమస్యలు వివరిస్తున్న వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి

సాక్షి, ఒంగోలు : ఒంగోలు రెండో పొగాకు వేలం కేంద్రాన్ని పొగాకు బోర్డు చైర్మన్‌ ఎడ్లపాటి రఘునాథ బాబు శుక్రవారం సందర్శించారు. వేలం కేంద్రంలో వేలం తీరును పరిశీలించారు. అనంతరం రైతులతో, పొగాకు బోర్డు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రైతులు, పొగాకు రైతు నాయకులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లారు. బోర్డు చైర్మన్‌ను వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కొందరు రైతు నాయకులు చైర్మన్‌ను కలిసి పొగాకు రైతుల కష్టాలు గురించి విపులీకరించారు.

ఈ సందర్భంగా వర్జీనియా పొగాకు గ్రోయర్స్‌ వెల్‌ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చుంచు శేషయ్య పొగాకు రైతులు గత కొన్నేళ్లుగా నష్టాలతోనే పొగాకు పండిస్తున్నారని చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లారు. 1992 నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లు కార్పొరేట్‌ శక్తులను ఎదుర్కొనే శక్తిని దేశీ పెట్టుబడుల రంగానికి కలిగించాలని కోరారు. స్వచ్ఛందంగా పొగాకు పంటను విరమించుకునే రైతుకు బ్యారన్‌కు రూ.10 లక్షలు సాయం అందించాలని కూడా విజ్ఞప్తి చేశారు. వేలంలో వ్యాపారుల మధ్య పోటీని పెంపొందించాలని కోరారు. వ్యాపారులు విదేశీ ఆర్డర్లు ఖరారు కాలేదని ఆలస్యం చేస్తున్నారని, ఆర్డర్లు ఉన్న వ్యాపారులు పొగాకును కారు చౌకగా కొనుగోలు చేసి రైతులను నిలువునా మోసం చేయటమే కాక తీవ్రంగా రైతును నష్టాల బాటలోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ పొగాకు రైతులు పొగాకు రైతులకు సంబంధించి ఇన్సూరెన్స్‌ పాలసీని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకు రావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా ప్రీమియంను రైతుల తరఫున చెల్లిస్తుందని, పొగాకు రైతుల బీమా ప్రీమియంను పొగాకు బోర్డు చేత కట్టించాలని కోరారు. తీవ్ర కరువు పరిస్థితులను జిల్లా రైతాంగం ఎదుర్కొందని, తద్వారా అత్యంత కష్టించి పొగాకును పండిస్తే అదికాస్తా లోగ్రేడ్‌ ఎక్కువగా వచ్చిందని ఆవేదన వెలిబుచ్చారు. వ్యాపారులు కమ్మక్కై, కూడబలుక్కొని ధరలను తగ్గించి పొగాకు కొనుగోలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. తీరా లోగ్రేడ్‌ పొగాకుకు వచ్చే సరికి మరీ తగ్గించి కిలో రూ.70 లకు కొనుగోలు చేసి రైతులను నష్టాల పాలు చేస్తున్నారని వివరించారు. దీంతో ప్రతి పొగాకు రైతు ఒక్కో బ్యారన్‌కు రూ.1.50 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు నష్టపోతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 

లోగ్రేడ్‌కు కిలో రూ.100 అయితేనే ప్రయోజనం 
జిల్లాలో మొత్తం 24 వేల బ్యారన్‌లు ఉన్నాయని రైతులు చైర్మన్‌కు తెలిపారు. ఆధరైజ్డ్‌ పొగాకు క్వాంటిటీ అమ్మకం పూర్తయినా లో గ్రేడ్‌ పొగాకు రైతుకు కిలో పొగాకుకు రూ.100 అయితే కొంతమేర ప్రయోజనం ఉంటుందని  వివరించారు. 2015లో ఇదే పరిస్థితి ఏర్పడితే అప్పటి కేంద్ర ప్రభుత్వం కిలో పొగాకుకు రూ.15, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 చొప్పున ప్రోత్సాహకం అందించి ఆదుకున్నాయన్న విషయాన్ని చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లారు. అతివృష్టి, అనావృష్టి వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, తద్వారా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వివరించారు. బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకుంటే దానిపై వచ్చే వడ్డీ రాయితీని కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు రద్దు చేయటం ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లారు.

తద్వారా రైతులు రూ.3 వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని వివరించారు. వడ్డీ రాయితీని రద్దు చేయటం వలన రైతులు ఎక్కువ వడ్డీలకు బయట తీసుకుంటే ఇంకా నష్టాల బాట పడతారని దానిని కేంద్ర ప్రభుత్వం దృస్టికి తీసుకెళ్లి ఆదుకోవాలని కోరారు. పొగాకు బ్యారన్‌ను ప్రతి సంవత్సరం రెన్యువల్‌ చేయించుకోవాల్సి వస్తుందని దానిని ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్‌ చేసేలా విధివిధానాలను మార్చాలని కోరారు. సమస్యలు ఆలకించిన చైర్మన్‌ రఘునాథ బాబు మాట్లాడుతూ పొగాకు రైతుల సమస్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళతానని భరోసా ఇచ్చారు. అదేవిధంగా కేంద్ర వాణిజ్య మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లి పరిష్కరించేందుకు పూనుకుంటానని హామీ ఇచ్చారు. సమావేశంలో పొగాకు బోర్డు ఆర్‌ఎం జి.ఉమామహేశ్వరరావు, రెండో వేలం కేంద్రం అధికారిణి వై.ఉమాదేవి, పొగాకు బోర్డు మాజీ వైస్‌ చైర్మన్‌ పమ్మి భద్రిరెడ్డి, బోర్డు సభ్యులు శివారెడ్డి, పొగాకు రైతులు చింపరయ్య, పోతుల నరశింహారావు, వడ్డెళ్ల ప్రసాదు, పెనుబోతు సునీల్, అబ్బూరి శేషగిరిరావు, గంగిరెడ్డి, రామాంజనేయులు, బోడపాటి శివరావు, బ్రహ్మయ్య, కొండపి భాస్కరరావు, వేలం కేంద్రాల అధ్యక్షులు, రైతు నాయకులు పాల్గొన్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement