Tobacco Board chairman
-
పొగాకు రైతులను ఆదుకోండి
సాక్షి, ఒంగోలు : ఒంగోలు రెండో పొగాకు వేలం కేంద్రాన్ని పొగాకు బోర్డు చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ బాబు శుక్రవారం సందర్శించారు. వేలం కేంద్రంలో వేలం తీరును పరిశీలించారు. అనంతరం రైతులతో, పొగాకు బోర్డు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రైతులు, పొగాకు రైతు నాయకులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. బోర్డు చైర్మన్‌ను వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కొందరు రైతు నాయకులు చైర్మన్‌ను కలిసి పొగాకు రైతుల కష్టాలు గురించి విపులీకరించారు. ఈ సందర్భంగా వర్జీనియా పొగాకు గ్రోయర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చుంచు శేషయ్య పొగాకు రైతులు గత కొన్నేళ్లుగా నష్టాలతోనే పొగాకు పండిస్తున్నారని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. 1992 నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లు కార్పొరేట్ శక్తులను ఎదుర్కొనే శక్తిని దేశీ పెట్టుబడుల రంగానికి కలిగించాలని కోరారు. స్వచ్ఛందంగా పొగాకు పంటను విరమించుకునే రైతుకు బ్యారన్‌కు రూ.10 లక్షలు సాయం అందించాలని కూడా విజ్ఞప్తి చేశారు. వేలంలో వ్యాపారుల మధ్య పోటీని పెంపొందించాలని కోరారు. వ్యాపారులు విదేశీ ఆర్డర్లు ఖరారు కాలేదని ఆలస్యం చేస్తున్నారని, ఆర్డర్లు ఉన్న వ్యాపారులు పొగాకును కారు చౌకగా కొనుగోలు చేసి రైతులను నిలువునా మోసం చేయటమే కాక తీవ్రంగా రైతును నష్టాల బాటలోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ పొగాకు రైతులు పొగాకు రైతులకు సంబంధించి ఇన్సూరెన్స్ పాలసీని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇన్సూరెన్స్ పాలసీని తీసుకు రావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా ప్రీమియంను రైతుల తరఫున చెల్లిస్తుందని, పొగాకు రైతుల బీమా ప్రీమియంను పొగాకు బోర్డు చేత కట్టించాలని కోరారు. తీవ్ర కరువు పరిస్థితులను జిల్లా రైతాంగం ఎదుర్కొందని, తద్వారా అత్యంత కష్టించి పొగాకును పండిస్తే అదికాస్తా లోగ్రేడ్ ఎక్కువగా వచ్చిందని ఆవేదన వెలిబుచ్చారు. వ్యాపారులు కమ్మక్కై, కూడబలుక్కొని ధరలను తగ్గించి పొగాకు కొనుగోలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. తీరా లోగ్రేడ్ పొగాకుకు వచ్చే సరికి మరీ తగ్గించి కిలో రూ.70 లకు కొనుగోలు చేసి రైతులను నష్టాల పాలు చేస్తున్నారని వివరించారు. దీంతో ప్రతి పొగాకు రైతు ఒక్కో బ్యారన్‌కు రూ.1.50 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు నష్టపోతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. లోగ్రేడ్కు కిలో రూ.100 అయితేనే ప్రయోజనం జిల్లాలో మొత్తం 24 వేల బ్యారన్లు ఉన్నాయని రైతులు చైర్మన్‌కు తెలిపారు. ఆధరైజ్డ్ పొగాకు క్వాంటిటీ అమ్మకం పూర్తయినా లో గ్రేడ్ పొగాకు రైతుకు కిలో పొగాకుకు రూ.100 అయితే కొంతమేర ప్రయోజనం ఉంటుందని వివరించారు. 2015లో ఇదే పరిస్థితి ఏర్పడితే అప్పటి కేంద్ర ప్రభుత్వం కిలో పొగాకుకు రూ.15, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 చొప్పున ప్రోత్సాహకం అందించి ఆదుకున్నాయన్న విషయాన్ని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. అతివృష్టి, అనావృష్టి వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, తద్వారా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వివరించారు. బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకుంటే దానిపై వచ్చే వడ్డీ రాయితీని కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు రద్దు చేయటం ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. తద్వారా రైతులు రూ.3 వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని వివరించారు. వడ్డీ రాయితీని రద్దు చేయటం వలన రైతులు ఎక్కువ వడ్డీలకు బయట తీసుకుంటే ఇంకా నష్టాల బాట పడతారని దానిని కేంద్ర ప్రభుత్వం దృస్టికి తీసుకెళ్లి ఆదుకోవాలని కోరారు. పొగాకు బ్యారన్‌ను ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకోవాల్సి వస్తుందని దానిని ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసేలా విధివిధానాలను మార్చాలని కోరారు. సమస్యలు ఆలకించిన చైర్మన్ రఘునాథ బాబు మాట్లాడుతూ పొగాకు రైతుల సమస్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళతానని భరోసా ఇచ్చారు. అదేవిధంగా కేంద్ర వాణిజ్య మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లి పరిష్కరించేందుకు పూనుకుంటానని హామీ ఇచ్చారు. సమావేశంలో పొగాకు బోర్డు ఆర్ఎం జి.ఉమామహేశ్వరరావు, రెండో వేలం కేంద్రం అధికారిణి వై.ఉమాదేవి, పొగాకు బోర్డు మాజీ వైస్ చైర్మన్ పమ్మి భద్రిరెడ్డి, బోర్డు సభ్యులు శివారెడ్డి, పొగాకు రైతులు చింపరయ్య, పోతుల నరశింహారావు, వడ్డెళ్ల ప్రసాదు, పెనుబోతు సునీల్, అబ్బూరి శేషగిరిరావు, గంగిరెడ్డి, రామాంజనేయులు, బోడపాటి శివరావు, బ్రహ్మయ్య, కొండపి భాస్కరరావు, వేలం కేంద్రాల అధ్యక్షులు, రైతు నాయకులు పాల్గొన్నారు. -
రైతుల పొట్టకొడుతున్నారు
- పొగాకు బోర్డు చైర్మన్ - వ్యాపారుల మధ్య పోరులో అన్నదాతలు నలిగిపోతున్నారు - వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి ఒంగోలు టౌన్ : పొగాకు బోర్డు చైర్మన్, వ్యాపారుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో రైతులు నలిగిపోతూ నష్టపోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాయని విమర్శించారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతు సంఘ జిల్లాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఎల్బీజీ భవన్లో జరిగిన అఖిలపక్ష రైతు సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది వేలం ప్రారంభమై నాలుగు నెలలైనా ఇప్పటివరకు కేవలం 46 మిలియన్ కేజీల పొగాకు మాత్రమే కొనుగోలు చేశారన్నారు. గత ఏడాది ఈ సమయానికి పొగాకు కొనుగోళ్లు పూర్తయిన విషయాన్ని గుర్తు చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన తరువాత వ్యాపారులు పొగాకు ధరలను మరింత తగ్గించేశారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారులకు పోటీగా పొగాకు బోర్డును కొనుగోలు రంగంలోకి దించాలని డిమాండ్ చేశారు. రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపీనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభమై నాలుగు నెలలైనా సగటు ధర కిలో 106 రూపాయలు మాత్రమే వచ్చిందన్నారు. రైతులు వేలం కేంద్రాలకు తీసుకువస్తున్న పొగాకులో 30 నుంచి 40 శాతం నోబిడ్ పేరుతో వ్యాపారులు వెనక్కు పంపుతున్నారన్నారు. ఈ నెల 4వ తేదీ విజయవాడలో కేంద్ర వాణిజ్య శాఖామంత్రి నిర్మలా సీతారామన్ వద్దకు రాయబారం వెళుతున్నామని, పెద్ద సంఖ్యలో రైతులు హాజరు కావాలని ఆయన కోరారు. రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకట్రావు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీ రైతు సంఘ జిల్లా కార్యదర్శి వీ హనుమారెడ్డి, రైతు కూలీ సంఘ జిల్లా నాయకురాలు ఎస్.లలితకుమారి, పొగాకు బోర్డు మాజీ సభ్యుడు మారెళ్ల బంగారుబాబు, కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యదర్శి రావి వెంకటేశ్వర్లు, రైతు కూలీ సంఘ నాయకులు కృష్ణారావు, పి.కోటేశ్వరరావు, ఆత్మ చైర్మన్ మండవ శ్రీనివాసరావు, కౌలు రైతుల సంఘ నాయకుడు పెంట్యాల హనుమంతరావు, రైతు సంఘ నాయకులు కొల్లూరి వెంకటేశ్వర్లు, బెజవాడ శ్రీనివాసరావు, అయినాబత్తిన బ్రహ్మయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
చంద్రబాబును కలవనున్న పొగాకు రైతు ప్రతినిధులు
దేవరపల్లి, న్యూస్‌లైన్ : రుణమాఫీ హామీపై జిల్లాలోని వర్జీనియా పొగాకు రైతులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలవనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్చి 19న దేవరపల్లి వచ్చిన చంద్రబాబు బహిరంగ సభలో పొగాకు పంట రుణాలతో పాటు, వాణిజ్య పంటలకు చెందిన రుణాలను మాఫీ చేస్తానని ప్రకటించారు. ఎన్నికల్లో టీడీపీ గెలుపొంది ప్రభుతాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో జూన్ 2, 3 తేదీల్లో చంద్రబాబును కలవాలని పొగాకు రైతు ప్రతినిధులు నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే పొగాకు రైతుల రుణాలను మాఫీ చేస్తున్నట్లుగా తొలిగా ఫైలుపై సంతకం చేయాలని కోరనున్నట్లు రైతు ప్రతినిధులు తెలిపారు. జిల్లాలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం-1,2 వేలం కేంద్రాల పరిధిలోని రైతు ప్రతినిధులు చంద్రబాబును కలిసేందుకు సమాయత్తమవుతున్నారు. జిల్లాలో ఐదు పొగాకు వేలం కేంద్రాల పరిధిలో సుమారు 14 వేల బ్యారన్లు ఉండగా 12 వేల మంది రైతులు ఉన్నారు. ఒక్కొక్క రైతుకు 2 నుంచి 3 బ్యారన్లు ఉన్నాయి. బ్యారన్‌కు సుమారు రూ.4.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రైతులు రుణాలు తీసుకున్నారు. మొత్తం జిల్లాలోని పొగాకు రైతులు సుమారు రూ.700 కోట్ల రుణాలు తీసుకున్నారు. అంతేకాక బంగారు ఆభరణాలు, ఇతర పంట రుణాలు కూడా తీసుకున్నారు. ఒక్కొక్క రైతు రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు పొందారు. అన్ని వేలం కేంద్రాల పరిధిలో రైతులు సుమారు రూ.1,200 కోట్ల నుంచి రూ.1,400 కోట్లు రుణాలు తీసుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పొగాకు రైతులు ఇప్పటికే 30 శాతం పంటను అమ్ముకోగా, బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు బోర్డు ద్వారా సొమ్ము జమచేశారు. అయితే ఇకపై రైతులు అమ్మిన పొగాకు సొమ్ముకు సంబంధించి చెక్కులను బ్యాంకులకు ఇవ్వవద్దని బోర్డు అధికారులకు రైతులు వివరించినట్లు తెలిసింది. రుణమాఫీ విషయం తేలేవరకు బ్యాంకులకు పొగాకు చెక్కులు ఇవ్వాలా? వద్దా? అనే దానిపై బోర్డు అధికారులు తర్జనబర్జనలు పడుతున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో పొగాకు రైతు ప్రతినిధులు పొగాకు బోర్డు చైర్మన్‌ను కలిసి బ్యాంకులకు చెక్కులు నిలుపుదల చేయాలని కోరనున్నట్లు తెలిసింది. -
పొగాకు ఎగుమతులతో 6 వేల కోట్ల ఆదాయం
పొగాకు బోర్డు చైర్మన్ కె.గోపాల్ గుంటూరు, న్యూస్‌లైన్ : పొగాకు ఎగుమతుల ద్వారా 2013-14 సంవత్సరంలో 6,059.31 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం వచ్చినట్లు పొగాకుబోర్డు చైర్మన్ కె.గోపాల్ చెప్పారు. గుంటూరులోని బోర్డు కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది ఎగుమతుల ద్వారా ఐదువేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం వచ్చినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో పొగాకు ఉత్పత్తులకు లక్ష్యాలను నిర్దేశించామని, ప్రతి సంవత్సరం 270నుంచి 280 మిలియన్ కేజీల పొగాకును ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. లక్షమంది రైతులు ఈ ప్రక్రియలో భాగస్వాములు అయ్యారని, 2.25 లక్షల ెహ క్టార్లలో వర్జీనియా పొగాకు ఉత్పత్తి చేశామన్నారు. వర్జీనియా పొగాకును సిగిరెట్ పొగాకు అని, ప్రీమియం వెరైటీ అని పిలుస్తారని చెప్పారు. ఉత్పత్తి చేసిన వర్జీనియా పొగాకులో 75శాతం ఎగుమతి చేశామని వెల్లడించారు. బోర్డు ఎగుమతి చేసిన పొగాకును 107దేశాల్లో 137 కంపెనీలు దిగుమతి చేసుకున్నాయని, పశ్చిమయూరప్కు 34శాతం, తూర్పు యూరప్‌కు 14శాతం, మధ్యప్రాచ్య దేశాలకు 11శాతం, ఆగ్నేయాసియాకు 20శాతం, ఆఫ్రికాకు 13శాతం, దక్షిణ అమెరికాకు 8శాతం, ఆస్ట్రేలియాకు ఒకశాతం ఎగుమతి చేసినట్లు వెల్లడించారు. మనదేశం నుంచి ఎగుమతి అయ్యే పొగాకు నాణ్యతతోపాటు శుభ్రంగా ఉండాలని ఇంటర్నేషనల్మార్కెట్ ఎదురు చూస్తోందని, రైతులనుంచి క్వాలిటీ ఉన్న పొగాకు వచ్చేలా పొగాకు బోర్డు చర్యలు తీసుకుందనీ చెప్పారు. తద్వారా మంచిరేటు వస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో180 మిలియన్ కేజీలు ఉత్పత్తి అయ్యిందని, 19 వేలం కేంద్రాల ద్వారా 65 రోజుల్లో 75 మిలియన్ కేజీల పొగాకు మార్కెట్ అయ్యిందని చెప్పారు. .జూలై నెలాఖరునాటికి మిగిలిన పొగాకు అమ్మకాలు జరిగేలా చూస్తామని, వేలం కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ సిస్టం అన్ని చోట్లా ఉండటం వల్ల అమ్మకాలు త్వరగా జరుగుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం కిలో పొగాకుకు 171 రూపాయల ధర వచ్చిందని, హైగ్రేడ్ పొగాకు ఉత్పత్తి ఈ ఏడాది బాగా పెరిగి, లో గ్రేడ్ రేషియో తగ్గిందన్నారు. లో అండ్ మినిమమ్ గ్రేడ్‌కు కూడా డిమాండ్ బాగానే ఉన్నట్లు గోపాల్ చెప్పారు.