దేవరపల్లి, న్యూస్‌లైన్ : రుణమాఫీ హామీపై జిల్లాలోని వర్జీనియా పొగాకు రైతులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలవనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్చి 19న దేవరపల్లి వచ్చిన చంద్రబాబు బహిరంగ సభలో పొగాకు పంట రుణాలతో పాటు, వాణిజ్య పంటలకు చెందిన రుణాలను మాఫీ చేస్తానని ప్రకటించారు. ఎన్నికల్లో టీడీపీ గెలుపొంది ప్రభుతాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో జూన్ 2, 3 తేదీల్లో చంద్రబాబును కలవాలని పొగాకు రైతు ప్రతినిధులు నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే పొగాకు రైతుల రుణాలను మాఫీ చేస్తున్నట్లుగా తొలిగా ఫైలుపై సంతకం చేయాలని కోరనున్నట్లు రైతు ప్రతినిధులు తెలిపారు.
జిల్లాలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం-1,2 వేలం కేంద్రాల పరిధిలోని రైతు ప్రతినిధులు చంద్రబాబును కలిసేందుకు సమాయత్తమవుతున్నారు. జిల్లాలో ఐదు పొగాకు వేలం కేంద్రాల పరిధిలో సుమారు 14 వేల బ్యారన్లు ఉండగా 12 వేల మంది రైతులు ఉన్నారు. ఒక్కొక్క రైతుకు 2 నుంచి 3 బ్యారన్‌లు ఉన్నాయి. బ్యారన్‌కు సుమారు రూ.4.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రైతులు రుణాలు తీసుకున్నారు. మొత్తం జిల్లాలోని పొగాకు రైతులు సుమారు రూ.700 కోట్ల రుణాలు తీసుకున్నారు. అంతేకాక బంగారు ఆభరణాలు, ఇతర పంట రుణాలు కూడా తీసుకున్నారు. ఒక్కొక్క రైతు రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు పొందారు.
అన్ని వేలం కేంద్రాల పరిధిలో రైతులు సుమారు రూ.1,200 కోట్ల నుంచి రూ.1,400 కోట్లు రుణాలు తీసుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పొగాకు రైతులు ఇప్పటికే 30 శాతం పంటను అమ్ముకోగా, బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు బోర్డు ద్వారా సొమ్ము జమచేశారు. అయితే ఇకపై రైతులు అమ్మిన పొగాకు సొమ్ముకు సంబంధించి చెక్కులను బ్యాంకులకు ఇవ్వవద్దని బోర్డు అధికారులకు రైతులు వివరించినట్లు తెలిసింది. రుణమాఫీ విషయం తేలేవరకు బ్యాంకులకు పొగాకు చెక్కులు ఇవ్వాలా? వద్దా? అనే దానిపై బోర్డు అధికారులు తర్జనబర్జనలు పడుతున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో పొగాకు రైతు ప్రతినిధులు పొగాకు బోర్డు చైర్మన్‌ను కలిసి బ్యాంకులకు చెక్కులు నిలుపుదల చేయాలని కోరనున్నట్లు తెలిసింది.
చంద్రబాబును కలవనున్న పొగాకు రైతు ప్రతినిధులు
Published Sat, May 24 2014 1:04 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement