మద్దిపాడు: తాను పండించిన పంటకు మద్దతు ధర సరిగ్గా రావడం లేదని, దీంతో తెచ్చిన అప్పులు తీర్చే దారి కనపడక ఓ పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఎనమనమెల్లూరు గ్రామంలో శనివారం ఉదయం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన వాకా రమణా రెడ్డి(46) రెండు బ్యారెన్లకు (ఒక బ్యారెన్ అంటే ఎడు ఎకరాలలో సాగు చేసిన పొగాకు నుంచి వచ్చే దిగుబడి) పొగాకు వేశాడు.
కానీ ప్రస్తుతం ధరలు పడిపోవడంతో తీవ్రంగా నష్టాల పాలయ్యాడు. ఇప్పటి వరకు పంట కోసం తెచ్చిన అప్పులను ఒక చీటీలో రాసుకొని పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.