భద్రత లేని బతుకులు | tobacco workers did nt have security life | Sakshi
Sakshi News home page

భద్రత లేని బతుకులు

Published Fri, Jan 31 2014 6:37 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM

tobacco workers did nt have security life


 ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్:
 పొగాకు ఉత్పత్తిలో ప్రధాన పాత్ర కూలీలదే. అందులోనూ 70 శాతానికిపైగా మహిళా కూలీలే ఉంటారు. పొగాకు పంట సాగు మొదలుకొని బోర్డులో అమ్మకాలకు వెళ్లేదాకా వారే కీలకం. అలాంటి పొగాకు కూలీలకు ఇచ్చే కూలి, కల్పించే సౌకర్యాలు నామమాత్రం. జిల్లాలో గ్రేడింగ్ కూలీలు పడుతున్న ఇక్కట్లపై సమరసాక్షి కథనం.
 
 పొగాకు పనులు చేసే మహిళా కూలీలు వెట్టిచాకిరితో పాటు భద్రత లేని బతుకులు వెళ్లదీస్తున్నారు. పొగాకు సాగులో మొక్కలు వేయటం మొదలు మొక్కల్లో పురుగులు పట్టడం, ఆకుకొట్టడం, మందుల పిచికారీ, పొలం నుంచి కొట్టిన ఆకును బ్యారన్‌ల వద్దకు చేర్చడం, కర్రలకు అల్లటం, కట్టలు కట్టడం, పొగాకు కంపెనీల్లో గ్రేడింగ్‌తో కూలీల పని ముగుస్తుంది.  జిల్లాలో 1.70 వేల ఎకరాల్లో పొగాకు సాగు చేస్తున్నారు. 1.20 లక్షల మంది కూలీలు పని చేస్తున్నారు. వీరి లో 80నుంచి 85 వేల మంది మహిళా కూలీలు. పొగాకు పొలాల్లో, బ్యారన్‌లలో, గ్రేడింగ్ కంపెనీల్లో పనిచేస్తున్నారు. జిల్లాలో 25వేలకుపైగా పొగాకు బ్యారన్‌లున్నాయి.
 
 రేయింబవళ్లు చాకిరీనే...
 బ్యారన్‌ల వద్ద పొగాకు కూలీలు రేయింబవళ్లు పని చేస్తుంటారు. ముఠాలుగా ఏర్పడి తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 10 గంటల వరకు పని చేస్తూనే ఉండాలి. అయినా వారు మాట్లాడుకునే కూలి సరాసరిన చూసుకున్నా రోజుకు *250 కూడా పడదు.  
 
 కుటుంబమంతా వలసలు..
 పొగాకు సీజన్ మొదలైందంటే కుటుంబాలకు కుటుంబాలు వలస వస్తుంటాయి. చంటిబిడ్డలను వెంటేసుకొని పొలాలు, బ్యారన్‌ల వద్దే కాపురాలు ఉంటుంటారు. పురుగు, పుట్రతోటే సహజీవనం చేస్తూ భద్రత లేని బతుకులు వెళ్లదీస్తున్నారు. తాత్కాలిక గుడారాలే వారి ఆవాసాలు. పిల్లలు కూడా వీరితోనే ఉండటంతో వారికి చదువులూ దూరమే. జిల్లా నుంచి వందల కుటుంబాలు నెల్లూరు ప్రాంతానికి పనుల కోసం వలసలు వెళ్తుండగా జిల్లాకు గుంటూరు, నరసరావుపేట, చిలకలూరిపేట, రాజమండ్రి ప్రాంతాల నుంచి పచ్చాకు కూలీలు వస్తున్నారు. వీరికి కనీస వసతులు కల్పించడంలో  అటు రైతులు వ్యాపారులు వైఫల్యం చెందారు.
 
 కనీస వేతనం వీరి దరి చేరదు...
 కనీస వేతన చట్టం పొగాకు పచ్చాకు, గ్రేడింగ్ కూలీల దరిచేరదు. కనీస వేతన చట్టం ప్రకారం 8 గంటలే పని చేయాలి. అలాంటి నిబంధన వీరికి వర్తించదు. ఒక్కొక్క కూలీకి కనీస వేతన చట్టం ప్రకారం రోజుకు పనినిబట్టి, పని నైపుణ్యాన్ని బట్టి *260 నుంచి *330 వరకు ఇవ్వాలి. పచ్చాకు కూలీలకు రోజుకు సరాసరిన *125 పడుతుంటే గ్రేడింగ్ కూలీలకు *120 మాత్రమే ఇస్తున్నారు.  
 
 దళారుల చేతిలో చిక్కి....
 వెట్టిచాకిరీతో ఒక వైపు, దళారుల దోపిడీతో మరోవైపు పచ్చాకు కూలీలు సతమతమవుతున్నారు. దళారులు కొంత మంది చేరి వీరిని ముఠాలుగా మాట్లాడుకొని పనులు చేయించుకొని చివరకు అనుకున్న ప్రకారం కూడా డబ్బులివ్వకుండా ఎగ్గొడుతున్నారు.ఇలాంటి కేసులు గతంలో జిల్లాలో అనేకం చోటు చేసుకున్నాయి.రెవెన్యూ, పోలీస్ అధికారుల దాకా వెళ్లి పరిష్కారం అయిన కేసులున్నాయి. మహిళలు లైంగిక వేధింపులకు గురైన సంఘటనలూ ఉన్నాయి.
 
 అందని వైద్యం..
 కూలీలకు వైద్యం ఓ పెద్ద సమస్య. పచ్చాకును పొలాల నుంచి ట్రాక్టర్లలో బ్యారన్లకు తీసుకొచ్చేటప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి.  కలుషిత నీరు తాగి అనారోగ్యం బారిన పడుతుంటారు. పాములు, తేళ్లు కుట్టి వైద్యమందక మృతి చెందిన కూలీలు కూడా ఉన్నారు.
 
  కందుకూరు ప్రాంతంలో గుంటూరు, రాజమండ్రి ప్రాంతాల నుంచి దాదాపు 500 నుంచి 600 మంది పొగాకు కూలి పనులకు వస్తుంటారు.
 
 తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకొని అభద్రత నడుమ బతుకులు ఈడుస్తున్నారు. రేయింబవళ్లు పని చేస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు.  
 
  గిద్దలూరు నియోజకవర్గంలో బేస్తవారిపేట, అర్థవీడు, గిద్దలూరు మండలాల్లో అత్యధికంగా పొగాకు సాగు చేస్తున్నారు. తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 10 గంటల వరకు కుటుంబాలకు కుటుంబాలే కలిసి గుత్తకు మాట్లాడుకొని పచ్చాకు పనులు చేస్తున్నారు. రేయింబవళ్లు పని చేసినా రోజుకు *125 కూడా కూలి గిట్టడం లేదని ఆరోగ్యపరమైన సమస్యలతో సతమతమవుతున్నామని కూలీలు వాపోతున్నారు.
  అద్దంకి ప్రాంతంలో పొగాకు కూలీలకు కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. రవాణా సౌకర్యాల్లేక తరచూ కిలోమీటర్ల కొద్దీ నడిచి కూలి పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.  
 
 కనిగిరి ప్రాంతంలో 1500 బ్యార్నీల వరకు ఉన్నాయి. గుంటూరు, ఒంగోలు పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడకు వలస కూలీలు వచ్చి పనులు చేస్తున్నారు. రోజు వారి కూలి గిట్టుబాటు కాక, కొన్ని కుటుంబాలు మధ్యలోనే వెళ్లిపోతున్నాయి. దళారులు అనుకున్న ప్రకారం కూలీలు ఇవ్వకుండా ఎగ్గొడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు.
 
  కొండపిలో దాదాపు 8,500 బ్యారన్ల వరకు ఉన్నాయి. ఇక్కడ బాలికలు బాలకార్మికులుగా పనులు చేయటం పరిపాటిగా మారింది. చర్మవ్యాధుల బారిన పడటం సంపాదించుకున్న కూలి డబ్బులు కాస్త వైద్యానికే సరిపోక అల్లాడుతున్నారు. జాతీయ రహదారిపై ఉన్న టంగుటూరులో పొగాకు గ్రేడింగ్ కంపెనీలున్నాయి. కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా వారి చేత పని చేయించుకుంటున్నారు.
 
 రోజంతా పనిచేసినా వందే ..వెంకాయమ్మ
 వెంకాయమ్మ గ్రేడింగ్ కూలీ, నాగులుప్పలపాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసినా  వంద రూపాయల కూలే ఇస్తున్నారు. దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది.
 
 కూలి రేటు పెరగాలి,
 మరియమ్మ, మార్టూరు
 ధరలు పెరిగినా కూలి రేట్లు పెరగడం లేదు. వ్యవసాయ కూలీలకు కూడా రేట్లు పెరిగాయి. కానీ పచ్చాకు కూలీలకు ఎన్నో ఏళ్ల నుంచి అదే కూలి చెల్లిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement