ప్రజా ప్రస్థానం 12వ వార్షికోత్సవం నేడు
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో సాహసోపేతమైన పాదయాత్రకు శ్రీకారం చుట్టి గురువారం నాటికి సరిగ్గా పన్నెండేళ్లు. కరవు కాటకాలతో ప్రజలు అల్లాడుతున్నప్పుడు... నిరాశ,నిస్పృహలతో రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పుడు... తమను ఆదుకునే వారేరని ప్రజలు ఎదురుచూస్తున్న దయనీయ పరిస్థితుల్లో నేనున్నానంటూ ప్రతిపక్ష నేతగా రాజశేఖరరెడ్డి 2003 ఏప్రిల్ 9న సాహసోపేతమైన పాదయాత్రకు నడుం బిగించారు.రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభించి జూన్ 15 న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు అప్రతిహతంగా కొనసాగించారు.
నడి వేసవిలో 40 డిగ్రీల ఎండను సైతం లెక్కచేయకుండా 11 జిల్లాల్లో 56 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకొచ్చే 690 గ్రామాల ప్రజలను పలకరిస్తూ ఇచ్చాపురం వరకు 1475 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేశారు. ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర లక్ష్యాలను స్మరించుకోవడానికి పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం 12 వ వార్షికోత్సవ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొంటారు.