![Today is the Last date for filing nominations - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/25/ELECTION-COMMISSION.jpg.webp?itok=UUUVqrJW)
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారంతో ముగుస్తోంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్లను స్వీకరిస్తారు. మధ్యాహ్నం 3 గంటలు దాటిన తరువాత నామినేషన్లను స్వీకరించరు. మంగళవారం నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఈ పరిశీలనలో నిబంధనల మేరకు దాఖలైన నామినేషన్లను ఆమోదిస్తారు. నిబంధనల మేరకు లేని నామినేషన్లను తిరస్కరిస్తారు. ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. కాగా, నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారం ముగుస్తుండడంతో కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ నియోజక వర్గాలకు 50 మంది సాధారణ పరిశీలకులను, పార్లమెంట్ స్థానాలకు ఒకరు చొప్పున పరిశీలకులను నియమించింది. మరోవైపు రాష్ట్రంలో పోలింగ్ నిర్వహణకు 45,920 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు మూడు లక్షల మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. భద్రతా చర్యల కోసం పెద్ద ఎత్తున కేంద్ర సాయుధ బలగాలనూ మోహరించనున్నారు.
బరిలో నిలిచిన పార్టీల పరిస్థితి ఇదీ..
ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగింది. ఆ పార్టీ అన్ని స్థానాల్లో అభ్యర్థులను రంగంలోకి దింపింది. ప్రచార పర్వంలో ముందుకు దూసుకుపోతోంది. ఇక అధికారపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా అన్ని స్థానాల్లో పోటీ పడుతోంది. అయితే గెలుపుకోసం అన్ని రకాల అడ్డదారి ప్రయత్నాలు చేస్తోంది. ఒకవైపు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌తోను, మరోవైపు పవన్ కల్యాణ్ జనసేన పార్టీతోనూ లోపాయికారీ అవగాహన కుదుర్చుకుంది. ఆ మేరకే ఆయా పార్టీలు అభ్యర్థులను బరిలో నిలుపుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులకు, అలాగే పవన్ కల్యాణ్ అభ్యర్థులకు కూడా ఎన్నికల ఇం‘ధనాన్ని’ చంద్రబాబే సమకూరుస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీతో కలసి పనిచేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు విడిగా పోటీ చేస్తున్నప్పటికీ అధికార టీడీపీతో లోపాయికారీగా అవగాహనతోనే ఎన్నికల బరిలో అభ్యర్థులను నిలబెట్టారు. మరోవైపు కేఏ పాల్ చేత కూడా ప్రజాశాంతి పార్టీ పేరుతో అన్ని స్థానాల్లో అభ్యర్థులను చంద్రబాబు పోటీ చేయిస్తుండడం గమనార్హం. తద్వారా వైఎస్సార్‌సీపీ ఓట్లను చీల్చాలనే ఎత్తుగడ వేశారు. ఇదిలా ఉంటే.. మరో జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కూడా ఒంటరిగానే బరిలో నిలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment