ఉదయం 9 గంటలు దాటితే అనుమతి నిరాకరణ
8.45 గంటలలోపే పరీక్ష హాలుకు చేరుకోవాలి
రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు కఠిన నిబంధన
ఈ సారీ తప్పని నేల రాతలు.. అరకొర సౌకర్యాలు
సాక్షి, అనంతపురం : పరీక్ష తొమ్మిది గంటలకు కదా.. తీరిగ్గా వెళ్దాం అనుకుంటే ఇంటర్ విద్యార్థులు పరీక్ష కోల్పోవాల్సిందే. పరీక్ష నిర్వహణలో ఇంటర్మీడియట్ బోర్డు చేపట్టిన సంస్కరణలు విద్యార్థుల పాలిట శాపంగా మారనున్నాయి. ఈ నెల 12 (బుధవారం) నుంచి జరగనున్న పరీక్షలకు విద్యార్థులను ఉదయం 8.30 గంటల నుంచి 8.45 గంటల లోపు పరీక్ష హాలులోకి అనుమతిస్తారు. ఆపై 9 గంటల వరకు విద్యార్థులకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకుంటారు. 9 గంటల తరువాత ఒక నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షకు అనుమతించరు. గతంలో 9 గంటలకు పరీక్ష ప్రారంభమైనప్పటికి ఉదయం 9.15 గంటల వరకు విద్యార్థులకు అనుమతి లభించేది. పరీక్షల్లో అక్రమాలను అరికట్టడంలో భాగంగా ఇంటర్మీడియట్ బోర్డు తాజా సంస్కరణలు చేపట్టింది.
ఎంసెట్‌కు నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు. ఈ విధానాన్ని విద్యార్థులకు ఇంటర్ పరీక్షల నుంచే అలవాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో కొన్ని పరీక్ష కేంద్రాల నుంచి ప్రశ్నపత్రాలు బండిల్ విప్పగానే సెల్‌ఫోన్ల ద్వారా ప్రశ్నలను బయటకు చేరవేసి, వాటికి సమాధానాలు చదువుకుని 15 నిమిషాలు పరీక్షకు ఆలస్యంగా వెళ్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రశ్నపత్రం బండిల్ విప్పకముందే విద్యార్థులను పరీక్ష గదిలో ఉంచాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. కొత్త పద్దతి ప్రకారం ఇలాంటి అక్రమాలను అడ్డుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 8.55 గంటలకు ప్రశ్నపత్రాల బండిల్ విప్పాలని, అప్పటికే విద్యార్థులు పరీక్ష కేంద్రంలో ఉండడంతో ప్రశ్నల చేరవేత వీలుకాదని ఆర్‌ఐఓ చె బుతున్నారు.
97 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు
జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 31,722 మంది విద్యార్థులు, రెండో సంంవత్సరంలో 35,578 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 97 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 15 గ్రామీణ ప్రాంతాల్లోని కళాశాలల్లో పరీక్ష కేంద్రాలకు అనుమతించారు. నల్లమాడ, చిలమత్తూరు, రొద్దం, గుడిబండ, అమరాపురం, తలుపుల మండలాల్లో ఏర్పా టు చేసిన పరీక్ష కేంద్రాలకు పెద్దగా బస్సు సర్వీసులు లేవు. విద్యార్థులు నిర్ణీత సమయంలో అక్కడికి చేరుకునేందుకు బస్సు సౌకర్యాలు పెద్దగా లేవు. అత్యధిక పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలంటే ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిందే. ఉదయం వేళ రవాణా సౌకర్యాలతో అనేక మంది విద్యార్థులు ఇక్కట్లకు లోనయ్యే అవకాశం ఉంది. తాజా నిర్ణయం విద్యార్థుల పాలిట శాపంగా మారనుంది. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు ఇప్పటికే జీపీఆర్‌సీ (గ్లోబల్ పొజిషన్ రీడింగ్ సిస్టం) వినియోగిస్తున్నారు. దీంతో పరీక్ష కేంద్రంలో వినియోగించే సెల్‌ఫోన్లపై దృష్టి పెడతారు. ప్రతి ఫోను సంభాషణలు ఆయా నెట్‌వర్క్ కంపెనీల్లో నమోదౌతాయి. పరీక్ష కేంద్రంలో ఏవైనా అవకతవకలు జరిగాయనే విషయం అధికారుల దృష్టికి రాగానే సెల్‌ఫోన్‌కు సంబంధించిన రికార్డులను పరిశీలించేందుకు ఏర్పాట్లు చేశారు.
తప్పని నేల రాతలు
విద్యార్థులకు ఈ ఏడాది కూడా నేల రాతలు తప్పడం లేదు. నల్లమాడ, ఆత్మకూరు, చిలమత్తూరు, తాడిమర్రి, రొద్దం, పెద్దపప్పూరు, పామిడి, అమరాపురం, గుడిబండ తదితర మండలాల్లోని పరీక్షా కేంద్రాలైన ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు సరిపడా బల్లలు లేవు. కొంత మంది విద్యార్థులు డెస్కులపై, మరికొంత మంది విద్యార్థులు నేలపై కూర్చుని పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఇక ప్రతి ఏడాది బత్తలపల్లిలో ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరీక్ష కేంద్రంగా ఏర్పాటు చేసేవారు. అయితే ఈ ఏడాది ప్రైవేటు జూనియర్ కళాశాలలో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కళాశాలకు పై కప్పు పూర్తిగా రేకులతో ఉండడంతో ఎండకు విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇలా అసౌకర్యాల మధ్య తమ పిల్లలు పరీక్షలు ఎలా రాయగలరని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ఒక్క నిమిషం ఆలస్యమైతే నో ఎంట్రీ
Published Tue, Mar 11 2014 4:23 AM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM
Advertisement
Advertisement