సాక్షి, విజయవాడ :
సమైక్య రాష్ట్రం కోసం, విభజన బిల్లును అడ్డుకునేందుకు బుధవారం నుంచి వచ్చేనెల 25వ తేదీ వరకు ఉద్యమాలు నిర్వహించనున్నట్లు సమైక్యాంధ్ర జేఏసీ జిల్లా కన్వీనర్ ఎ.విద్యాసాగర్, విద్యార్థి జేఏసీ నేత దేవినేని అవినాష్ వెల్లడించారు. వివిధ ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. విద్యాసాగర్ మాట్లాడుతూ బుధవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు బెంజిసర్కిల్ నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు ర్యాలీ, 30వ తేదీన బెంజిసర్కిల్ నుంచి పిల్లలు, విద్యార్థులు, మహిళలతో ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. 31 ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలే దీక్షలు చేపడతామన్నారు. దీనికి రాష్ట్ర జేఏసీ నేతలు హాజరవుతారన్నారు. వచ్చేనెల రెండో తేదీన జాగరణ కార్యక్రమం ఉంటుందని, 9న పీడబ్ల్యూడీ గ్రౌండ్ నుంచి సమైక్య పరుగు నిర్వహిస్తామన్నారు.
11, 12, 13 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం జరుగుతుందని, జిల్లా నుంచి ఐదు వేల మంది ఢిల్లీ వెళతారని చెప్పారు. ఇందుకోసం రెండు రైళ్లను బుక్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలూ పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మూడో తేదీన సమావేశమై తదుపరి కార్యక్రమాన్ని నిర్ణయిస్తామని చెప్పారు. సీమాంధ్రకు న్యాయం జరిగే వరకు విభజనకు మద్దతు ఇవ్వబోమని బీజేపీ చెబుతోందని, పార్లమెంట్‌లో ఇదే వైఖరి చూపాలని హితవు పలికారు.
నేటి నుంచి సమైక్య ఉద్యమాలు
Published Wed, Jan 29 2014 2:33 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
Advertisement