సాక్షి, అమరావతి: ఆర్టీసీలో 60 ఏళ్లకు రిటైర్మెంట్ ఉద్యోగుల్లో చిచ్చు రాజేసింది. అధికారులు రెండు వర్గాలుగా చీలిపోయి పైచేయి కోసం ప్రయత్నాలు ఆరంభించారు. ఓ వర్గం ఈ ఏడాది ప్రారంభం నుంచి పదవీ విరమణ చేసిన వారికి 60 ఏళ్ల వయో పరిమితి నిబంధన వర్తింపచేయాలని లాబీయింగ్ చేస్తుంటే మరో వర్గం ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన వారందరికీ 60 ఏళ్ల ప్రయోజనం కలిగించాలని పట్టుబడుతోంది. ప్రయోజనం అనేది అందరికీ ఒకేలా ఉండాలని, అలా కాకుండా కొందరికే లబ్ధి కలిగేలా వ్యవహరించడం సరికాదని మరో వర్గం అధికారులు అభిప్రాయపడుతున్నారు.
అందరికీ అమలు చేస్తే నోషనల్ ఇంక్రిమెంట్లు
ఆర్టీసీలో 60 ఏళ్ల వయో పరిమితి నిబంధన వర్తింప చేస్తే 2014 జూన్ నుంచి అమలు చేయాలి. 2014 నుంచి ఇప్పటివరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు 8,200 మంది వరకు ఉన్నారని ఆర్టీసీ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అయితే 2014 జూన్ నుంచి 2016 జూన్ లోగా పదవీ విరమణ చేసిన వారికి ప్రయోజనం ఉండదు. అందరికీ 60 ఏళ్ల నిబంధన అమలు చేస్తే నోషనల్ ఇంక్రిమెంట్లు మాత్రం అందుతాయి.
మొత్తం రూ.60 కోట్ల వరకు ఈ భారం ఉంటుందని అంచనా. 2016 జూన్ తర్వాత రిటైర్ అయిన వారు నెలల వ్యవధిలో సర్వీసులో చేరి విధులు నిర్వహిస్తారు. 2016 జూన్ నుంచి ఇప్పటివరకు పదవీ విరమణ చేసిన వారు 4 వేల మంది ఉన్నట్లు అంచనా. వీరు కూడా నెలల వ్యవధి వరకే విధులు నిర్వహించే వీలుంది. గతేడాది పదవీ విరమణ చేసిన వారు మాత్రమే ఏడాది వరకు సర్వీసులో కొనసాగుతారు.
ఆర్టీసీలో 4,500కిపైగా ఖాళీలు
రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీలో ఇంతవరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ట్రాఫిక్ సూపర్ వైజర్లు, గ్యారేజీ సూపర్ వైజర్లు, ఆఫీసు క్లర్లు్కలు, సెక్యూరిటీ గార్డులు ఇలా మొత్తం 4,500కి పైగా ఖాళీలున్నాయి. ఆర్టీసీలో 60 ఏళ్ల వయో పరిమితి అమలు చేస్తే 70 శాతం ఖాళీలు భర్తీ అయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
భారం రూ.వెయ్యి కోట్లన్న యాజమాన్యం
ఇటీవల జరిగిన ఆర్టీసీ బోర్డు సమావేశంలో 60 ఏళ్ల వయో పరిమితి అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆర్టీసీలో 60 ఏళ్ల వయో పరిమితి అంశంపై సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఆర్టీసీ బోర్డులో ఈ అంశంపై చర్చించి న్యాయ సలహా కోరాలని తీర్మానించారు.
వయో పరిమితి భారం ఆర్టీసీయే భరిస్తే తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో ఆర్టీసీ అధికారులు రెండు వర్గాలుగా చీలిపోయారు. అయితే ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందున 60 ఏళ్ల వయో పరిమితి అమలు చేస్తే సంస్థపై రూ.వెయ్యి కోట్ల భారం పడుతుందని ప్రభుత్వానికి యాజమాన్యం నివేదిక ఇచ్చింది. ఈ అంశంపై ఆర్టీసీ ఎండీ శుక్రవారం కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment