సాక్షి, ఏలూరు : సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం.. తెలుగు తల్లిని ముక్కలు చేసే కుట్రలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమరభేరి మోగిస్తోంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు బుధవారం నుంచి 48 గంటల పాటు పార్టీ శ్రేణులు జాతీయ రహదారులను దిగ్బంధించనున్నారు. వైసీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పార్టీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్తలు మద్దాల రాజేష్, కర్రా రాజారావుల ఆధ్వర్యంలో జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం వద్ద రహదారులను దిగ్బంధించి వంటావార్పూ నిర్వహించనున్నారు. ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఆళ్లనాని, పార్టీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్తలు చలుమోలు అశోక్‌గౌడ్, పీవీ రావు, కొఠారు రామచంద్రరావుల ఆధ్వర్యంలో ఏలూరు ఆశ్రం కళాశాల వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించనున్నారు.
రోడ్డుమీదే దేశభక్తి గేయాల పోటీలు, నృత్య పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. పార్టీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రకాశం చౌక్ వద్ద ఆకివీడు-పాలకొల్లు రహదారిని, నరసాపురం నియోజకవర్గ సమన్వయకర్త ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద అంబేద్కర్ సెంటర్‌లో జాతీయరహదారిని, ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో ఉండి సెంటర్‌లో రహదారిని దిగ్బంధనం చేయనున్నారు. కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త మోషేన్‌రాజు ఆధ్వర్యంలో మెరకవీధి వద్ద కొవ్వూరు - గుండుగొలను రాష్ట్ర రహదారిని, నిడదవోలు నియోజకవర్గ సమన్వయకర్త రాజీవ్‌కృష్ణ ఆధ్వర్యంలో పెరవలి మండలం సమిశ్రగూడెం వద్ద నిడదవోలు-రాజమండ్రి రహదారిపైఆందోళన చేపట్టనున్నారు. పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్తలు శేషుబాబు, అల్లు వెంకటసత్యనారాయణ ఆధ్వర్యంలో పాలకొల్లులో కత్తిపూడి - పామర్రు రాష్ట్ర రహదారిని దిగ్బంధించనున్నారు.
తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపి ఆధ్వర్యంలో పెంటపాడు మండలం ప్రత్తిపాడు వద్ద జాతీయరహదారిని దిగ్బంధించి రాస్తారోకో చేయడంతో పాటు రోడ్డుపైనే వంటావార్పూ చేయనున్నారు. తణుకు నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆధ్వర్యంలో తేతలి వైజంక్షన్ వద్ద, ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ఉంగుటూరు వద్ద జాతీయరహదారిని దిగ్బంధించి ఆటాపాటా, వంటావార్పు నిర్వహించనున్నారు. గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్తలు తానేటి వనిత, తలారి వెంకట్రావు, దొడ్డిగర్ల సువర్ణరాజుల ఆధ్వర్యంలో బుధవారం దేవరపల్లిలో, గురువారం నల్లజర్లలో రాష్ర్ట్ర రహదారులను దిగ్బంధించనున్నారు. దేవరపల్లిలో రోడ్డుపై వంటా వార్పు నిర్వహించనున్నారు. సమైక్యవాదులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నారు.
నేడు, రేపు సడక్ బంద్
Published Wed, Nov 6 2013 2:36 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement