Sadak bandh
-
హోరెత్తిన ‘పోడు’ పోరు
సాక్షి నెట్వర్క్: పోడుభూముల పోరు తీవ్రతరమైంది. వెంటనే పట్టాలివ్వాలని మంగళవారం గిరిజన రైతులు రోడ్డెక్కారు. అటవీ అధికారుల దాడులు ఆపాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల్లోనూ సడక్‌బంద్ నిర్వహించారు. కదంతొక్కారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాగా, పోడుభూముల కోసం పోరాడే గిరిజనులను జైళ్లలో పెట్టడం ఏమిటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోడుసాగుదారులకు పట్టాలివ్వాలనే డిమాండ్‌తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చేపట్టిన రాస్తారోకోలో సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో కలసి ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బోయిన నర్సింహులు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, టేకులపల్లి, గుండాల, లక్ష్మీదేవిపల్లి, చంద్రుగొండ, ములకలపల్లి, పాల్వంచల్లో కూడా రాస్తారోకో చేశారు. ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు, కారేపల్లి, కొణిజర్ల, సత్తుపల్లి, పెనుబల్లిల్లోనూ వివిధ పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పేద గిరిజన రైతులకు వెంటనే పట్టాలివ్వాలి పోడు భూములు గిరిజనుల హక్కు అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం పరిధిలోని హైదరాబాద్–శ్రీశైలం హైవేపైనున్న హాజీపూర్ చౌరస్తాలో నల్లమల సడక్‌బంద్ నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు చిన్నారెడ్డి, మల్లు రవి, వంశీకృష్ణ, సీపీఎం రాష్ట్ర నేతలు నంద్యాల నర్సింహారెడ్డి, జాన్‌వెస్లీ హాజరయ్యారు. అంతకుముందు నారాయణ హైదరాబాద్ నుంచి హజీపూర్ వెళ్తూ డిండిలో మీడియాతో మాట్లాడా రు. కేసీఆర్ గిరిజనుల వైపు ఉంటారా, బీజేపీ వైపు ఉంటారా అని ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేయాలి ఉమ్మడి వరంగల్‌లో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యాన మంగళవారం చేపట్టిన ‘సడక్ బంద్’విజయవంతమైంది. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, తెలంగాణ ఆదివాసీ గిరిజన, ఎమ్మార్పీఎస్ తదితర సంఘాలు రాస్తారోకోలు నిర్వహించారు. పోడు భూములపై హక్కులు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూములపై ఆందోళన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, నల్లగొండ నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో సడక్ బంద్ నిర్వహించారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని మిర్యాలగూడలో గృహ నిర్బంధం చేశారు. దీంతో ఆయన ఇంట్లోనే ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు. సూర్యాపేటలో పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిలోమీటర్ మేర నిలిచిన వాహనాలు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఐ(ఎంఎల్), న్యూ డెమోక్రసీ, ఏఐకేఎంఎస్ నాయకులు నిజామాబాద్ జిల్లా గన్నారం వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై గంటపాటు బైఠాయించారు. దీంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి, కిసాన్ ఖేత్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టేక్రియాల్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై, బాన్సువాడ, గాంధారిలో రాస్తారోకో నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎక్స్‌రోడ్డు, నిర్మల్ జిల్లా ఖానాపూర్, సత్తెనపల్లి, కడెంలోని పాండ్వపూర్, దస్తురాబాద్, కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్, రెబ్బెన, కౌటాల, దహెగాం, సిర్పూర్(టి) మండల కేంద్రాల్లో సడక్ బంద్ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా జన్నారం, బెల్లంపల్లి, నెన్నెల, లక్సెట్టిపేట, కోటపల్లి, చెన్నూర్‌లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అం దజేశారు. ఉట్నూర్ ఎక్స్‌రోడ్డు వద్ద సడక్‌బంద్‌లో టీజేఎస్ అధినేత కోదండరాం పాల్గొన్నారు. -
సమ్మె విరమణపై నేడు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : నెలన్నరగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. కార్మిక న్యాయస్థానం పరిధిలోకి ఈ అంశం వెళ్లిన నేపథ్యంలో సమ్మె కొనసాగించాలా.. వద్దా? అనే విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ మంగళవారం అత్యవసర సమా వేశం ఏర్పాటు చేసింది. ఇందులో సమ్మె కొనసాగింపునకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. జేఏసీ సమావేశానికి ముందు.. అందులో భాగంగా ఉన్న కార్మిక సంఘాల నేతలు అంతర్గతంగా చర్చించనున్నారు. అనంతరం జేఏసీ భేటీలో ఉమ్మడి నిర్ణయం తీసుకోనున్నారు. సమ్మె కార్యాచరణలో భాగంగా మంగళవారం నిర్వహించ తలపెట్టిన సడక్ బంద్ నిర్ణయాన్ని ఇప్పటికే ఉపసంహరించుకున్నారు. సోమవారం హైకోర్టులో జరిగిన వాదనల్లో సమ్మె విరమణ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. కార్మిక సంఘాలకు సమ్మె విరమణ విషయంలో సూచనలు చేస్తానంటూ జేఏసీ తరపు న్యాయవాది పేర్కొన్నారు. సమ్మె వల్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు రెండు నెలలుగా వేతనాలు లేక కార్మికుల కుటుంబాలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం నాటి జేఏసీ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. సోమవారం వాదనల అనంతరం ధర్మాసనం పేర్కొన్న అంశాలకు సంబంధించిన పూర్తి వివరాల ప్రతి వెంటనే అందనందున సమ్మె విషయంలో సోమవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ ప్రతిని పరిశీలించిన మీదట మంగళవారం భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించే వరకు నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించి, మూడు రోజులు దీక్ష కొనసాగించిన జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్లు రాజిరెడ్డి, లింగమూర్తిలు సోమవారం సాయంత్రం దీక్ష విరమించారు. వీరిని ఆదివారమే పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్సకోసం ఆస్పత్రికి తరలించినా దీక్ష కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు, పలువురు ప్రజా సంఘాల నేతలు ఉస్మానియా ఆస్పత్రికి చేరుకుని నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. హైకోర్టులో జరిగిన వాదనల్లో కీలక పరిణామాల నేపథ్యంలో అత్యవసర భేటీ ఏర్పాటు చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. తమ సమ్మె కొనసాగుతుందని, మంగళవారం నిర్వహించ తలపెట్టిన సడక్ బంద్‌ను వాయిదా వేస్తున్నామని, సాయంత్రం జేఏసీ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. 72.49 శాతం బస్సులు తిప్పాం – ఆర్టీసీ యాజమాన్యం రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 72.49 శాతం బస్సులు నడిపినట్లు ఆర్టీసీ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. 1,912 అద్దె బస్సులు సహా 6,487 బస్సులను తిప్పినట్లు పేర్కొంది. 4,575 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,487 మంది తాత్కాలిక కండక్టర్లు విధులకు హాజరయ్యారని వెల్లడించింది. 44వ రోజూ కొనసాగిన కార్మికుల సమ్మె అక్టోబర్ ఐదోతేదీన మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగుతూ సోమవారంతో 44 రోజులు పూర్తి చేసుకుంది. సమ్మె విరమించి విధుల్లోకి రావాలంటూ ప్రభుత్వం మూడు దఫాలు చేసిన సూచనలను కూడా కార్మికులు బేఖాతరు చేస్తూ నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. నిరాహార దీక్షలో ఉన్న జేఏసీ నేతలకు సంఘీభావంగా అన్ని బస్ డిపోల వద్ద కార్మికులు సంఘీభావ దీక్షలు కొనసాగించారు. -
సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. మంగళవారం తలపెట్టనున్న సడక్ బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ రేపటి సడక్ బంద్‌ను వాయిదా వేస్తున్నామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. జడ్జిమెంట్ కాపీ చూసి రేపు సాయంత్రం సమ్మెపై తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. కేవలం సడక్ బంద్‌నే వాయిదా వేస్తున్నామని నిరసన దీక్షలు మాత్ర రేపు యధాతదంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. దీక్ష విరమించిన జేఏసీ నేతలు మూడు రోజులుగా ఆర్టీసీ జేఏసీ ముఖ్యనేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి చేస్తున్న నిరవదిక నిరాహారదీక్షను సోమవారం సాయంత్రం విరమించారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలకు అఖిలపక్ష నాయకులు కోదండరాం, చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం,మందకృష్ణ మాదిగలు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం ఆస్పత్రిలోనే జేఏసీ నాయకులతో అఖిలపక్ష నాయకులు సమావేశమయ్యారు. -
రైతు సమస్యలపై నిరంతరపోరు: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: రైతు ల సమస్యలను పరిష్కరించేదాకా నిరంతరం పోరాడతామని టీజేఎస్ అధినేత ఎం.కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్య దర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రకటించారు. సడక్ బంద్ విజయవంతమైన నేపథ్యంలో లెఫ్ట్‌పార్టీల నేతలతో కలిసి సీపీఐ కార్యాలయంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. పోలీసులు అడ్డంకులు కల్పించినా పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారన్నారు. రైతుబంధు పథకం ద్వారా పేద రైతులకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులకే మేలు జరుగుతుందని ఆరోపించారు. రైతు బంధు పథకంలో చెక్కుల పంపిణీలో, పాసు పుస్తకాల్లో అనేక తప్పులున్నాయని విమర్శించారు. చెక్కుల పంపిణీ కంటే ఎక్కువగా భూమి లో వచ్చిన తప్పులకు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేత కె.గోవర్ధన్ మాట్లాడుతూ.. ప్రజాస్వామిక నిరసనలకు అవకాశం లేకుండా చేయడం దారుణమన్నారు. -
సడక్ బంద్‌లో ఉద్రిక్తత
భీమదేవరపల్లి/హసన్‌పర్తి/ఖమ్మం మయూరిసెంటర్ : రైతు సమస్యలపై టీజేఎస్, వామపక్షాలు, రైతు సంఘాల పిలుపు మేరకు గురువారం వరంగల్–కరీంనగర్ రహదారిలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో సడక్‌బంద్ చేపట్టారు. ఈ కార్యక్రమం మూడు గంటల పాటు కొనసాగింది. రోడ్డుకు ఇరువైపులా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఇతర రైతు సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరగింది. ఉద్రిక్తత నెలకొంది. కోదండరాం, చాడ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతులతోనే పతనం ప్రారంభమైందన్నారు. రైతు బంధు పథకం రాబందు పథకంగా మారిందని విమర్శించారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే అవినీతిని నిరూపిస్తామని స్పష్టం చేశారు. పంటలకు గిట్టుబాటు ధర చెల్లించకుండా రైతులను మోసం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అసలు పెట్టుబడి పథకంతో రైతులకు ప్రయోజనం లేదన్నారు. పోడు, కౌలు, అటవీ భూములకు సైతం రైతు బంధు పథకాన్ని అమలు చేయాలని, తప్పులు దొర్లిన రికార్డులను వారం రోజుల్లో సరి చేసి పథకాన్ని అమలు చేయాలని, రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలని వారు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని రాపర్తినగర్ బైపాస్ రోడ్డును ఆందోళనకారులు దిగ్బంధనం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ, భద్రాచలం, ఇల్లెందు తదితర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ‘ఈటల’ వాహనాన్ని అడ్డుకున్న నిరసనకారులు గీసుకొండ మండలం మచ్చాపూర్ వద్ద వరంగల్–నర్సంపేట రహదారిపై మంత్రి ఈటల రాజేందర్ వెళ్తున్న కారుతో పాటు కాన్వాయ్‌ని ఆందోళన కారులు అడ్డుకున్నారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
నేడు, రేపు సడక్ బంద్
సాక్షి, ఏలూరు : సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం.. తెలుగు తల్లిని ముక్కలు చేసే కుట్రలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమరభేరి మోగిస్తోంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు బుధవారం నుంచి 48 గంటల పాటు పార్టీ శ్రేణులు జాతీయ రహదారులను దిగ్బంధించనున్నారు. వైసీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పార్టీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్తలు మద్దాల రాజేష్, కర్రా రాజారావుల ఆధ్వర్యంలో జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం వద్ద రహదారులను దిగ్బంధించి వంటావార్పూ నిర్వహించనున్నారు. ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఆళ్లనాని, పార్టీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్తలు చలుమోలు అశోక్‌గౌడ్, పీవీ రావు, కొఠారు రామచంద్రరావుల ఆధ్వర్యంలో ఏలూరు ఆశ్రం కళాశాల వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించనున్నారు. రోడ్డుమీదే దేశభక్తి గేయాల పోటీలు, నృత్య పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. పార్టీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రకాశం చౌక్ వద్ద ఆకివీడు-పాలకొల్లు రహదారిని, నరసాపురం నియోజకవర్గ సమన్వయకర్త ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద అంబేద్కర్ సెంటర్లో జాతీయరహదారిని, ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో ఉండి సెంటర్లో రహదారిని దిగ్బంధనం చేయనున్నారు. కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త మోషేన్‌రాజు ఆధ్వర్యంలో మెరకవీధి వద్ద కొవ్వూరు - గుండుగొలను రాష్ట్ర రహదారిని, నిడదవోలు నియోజకవర్గ సమన్వయకర్త రాజీవ్‌కృష్ణ ఆధ్వర్యంలో పెరవలి మండలం సమిశ్రగూడెం వద్ద నిడదవోలు-రాజమండ్రి రహదారిపైఆందోళన చేపట్టనున్నారు. పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్తలు శేషుబాబు, అల్లు వెంకటసత్యనారాయణ ఆధ్వర్యంలో పాలకొల్లులో కత్తిపూడి - పామర్రు రాష్ట్ర రహదారిని దిగ్బంధించనున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపి ఆధ్వర్యంలో పెంటపాడు మండలం ప్రత్తిపాడు వద్ద జాతీయరహదారిని దిగ్బంధించి రాస్తారోకో చేయడంతో పాటు రోడ్డుపైనే వంటావార్పూ చేయనున్నారు. తణుకు నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆధ్వర్యంలో తేతలి వైజంక్షన్ వద్ద, ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ఉంగుటూరు వద్ద జాతీయరహదారిని దిగ్బంధించి ఆటాపాటా, వంటావార్పు నిర్వహించనున్నారు. గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్తలు తానేటి వనిత, తలారి వెంకట్రావు, దొడ్డిగర్ల సువర్ణరాజుల ఆధ్వర్యంలో బుధవారం దేవరపల్లిలో, గురువారం నల్లజర్లలో రాష్ర్ట్ర రహదారులను దిగ్బంధించనున్నారు. దేవరపల్లిలో రోడ్డుపై వంటా వార్పు నిర్వహించనున్నారు. సమైక్యవాదులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నారు.