- నేడు శాసనభలో బడ్జెట్‌ను
- ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి
- పంట రుణాల మాఫీకి నిధుల కేటాయింపు జరిగేనా?
- హంద్రీ-నీవాకు రూ.750 కోట్లు, గాలేరు-నగరికి రూ.550 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు
- తెలుగుగంగకు రూ.334 కోట్లు, స్వర్ణముఖి-సోమశిల కాలువకు రూ.150 కోట్లు ఇవ్వాలని నివేదన
సాక్షి ప్రతినిధి, తిరుపతి: శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టనున్న 2014-15 బడ్జెట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పంట రుణాల మాఫీ, డ్వాక్రా మహిళలకు మూలధనం చెల్లింపులకు నిధుల కేటాయింపుపై అటు రైతులు, మహిళలు.. ఇటు బ్యాంకర్లు ఆశలు పెంచుకున్నారు. జిల్లా ప్రగతికి దిశానిర్దేశం చేసే సాగునీటి ప్రాజెక్టులు, ఐటీఐఆర్, యూనివర్శిటీలకు నిధుల కేటాయింపుపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది నేడు వెల్లడికానుంది. వివరాల్లోకి వెళితే..
జిల్లాలో రూ.11,180.25 కోట్లను బ్యాంకర్లకు పంట రుణాల రూపంలో రైతులూ.. 55,602 సంఘాల్లోని 5.65 లక్షల మంది మహిళలు రూ.1611.03 కోట్లను మార్చి 31, 2014 నాటికి బ్యాంకులకు బకాయిపడ్డారు. చంద్రబాబు హామీ ఇచ్చిన విధంగా జిల్లాలోనే రూ.12,791.28 కోట్లను మాఫీ చేయాలి. కానీ.. ఒక్కో కుటుంబానికి రూ.1.50 లక్షల వంతున రుణ మాఫీ చేస్తానని జూన్ 10న.. డ్వాక్రా రుణాల మాఫీ చేయలేమని తేల్చిచెబుతూ ఈనెల 2న ఉత్తర్వులు జారీచేశారు.
డ్వాక్రా మహిళలకు ఒక్కో సంఘానికి రూ.లక్ష వంతున మూలధనంగా ఇస్తామని చెప్పారు. ఒక్కో కుటుంబానికి రూ.1.50 లక్షలు, ఒక్కో సంఘానికి రూ.లక్ష ఇచ్చేందుకైనా నిధులు కేటాయిస్తారా అన్న అంశంపై అధికారవర్గాలు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయిస్తేనే రుణమాఫీ చేస్తామని బ్యాంకర్లు తెగేసి చెబుతోండటం గమనార్హం.
ఈ నేపథ్యంలో నిధుల కేటాయింపుపై రైతులు, మహిళలు ఆశలు పెంచుకున్నారు. ఇక దుర్భిక్ష జిల్లాను సస్యశ్యామలం చేయడానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ-నీవా, గాలేరు-నగరి, సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ ప్రాజెక్టులతోపాటు తెలుగుగంగ ద్వారా ఆయకట్టుకు నీళ్లందించే పనులనూ ప్రారంభించారు. వైఎస్ హయాంలో శరవేగంగా సాగిన ప్రాజెక్టుల పనులు ఇప్పుడు పడకేశాయి. ఆ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు కోసం రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు
జిల్లాలో 1.40 లక్షల ఎకరాలకు నీళ్లందించే హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలంటే రూ.1750 కోట్లు అవసరం. ఈ ప్రాజెక్టుకు 2014-15 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.416 కోట్లను కిరణ్ సర్కారు కేటాయించింది. పూర్తిస్థాయి బడ్జెట్లో రూ.750 కోట్లను కేటాయించాలని అధికారులు పంపిన ప్రతిపాదనపై ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తుందా? తిరస్కరిస్తుందా అన్నది నేడు వెల్లడికానుంది.
జిల్లాలో 1.03 లక్షల ఎకరాలకు నీళ్లందించే గాలేరు-నగరి ప్రాజెక్టుకు కిరణ్ సర్కారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.321.50 కోట్లు కేటాయించింది. ఇప్పుడు కనీసం రూ.550 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రతిపాదించారు.
జిల్లాలో 49 వేల ఎకరాలకు నీళ్లందించే తెలుగుగంగ ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలంటే రూ.700 కోట్లు అవసరం. ఈ ఏడాది రూ.334 కోట్లు కేటాయించాలని అధికారులు పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
జిల్లాలో 87,734 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు కొత్తగా 23,666 ఎకరాలకు నీళ్లందించే సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్‌ను పూర్తిచేయాలంటే రూ.300 కోట్లు అవసరం. అటవీ అనుమతులు జాప్యం కావడం వల్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఏడాది కనీసం రూ.150 కోట్లు నిధులు కేటాయించాలని అధికారులు ప్రతిపాదించారు.
తిరుపతిలో ఐటీఐఆర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్) ఏర్పాటుచేసి.. ఐటీ హబ్‌గా మార్చి, వేలాది మందికి ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు భారీగా కేటాయిస్తేనే ఐటీ హబ్ సాకారమయ్యే అవకాశం ఉంది.
ఎస్వీ యూనివర్శిటీకి రూ.160 కోట్లు, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి రూ.40 కోట్లు విడుదల చేయాలని ఆ వర్శిటీల యాజమాన్యాలు ప్రతిపాదనలు పంపాయి.