కడుపు మండిన రైతులు రోడ్డెక్కి సరిగ్గా 50 రోజులైంది. అప్పట్లో ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలతో ఐదు రోజుల పాటు ఎన్‌సీఎస్ ఫ్యాక్టరీ ఆవరణ అట్టుడికిపోయింది. అర్ధరాత్రి రైతు సంఘం నేతల అరెస్ట్‌లతో పోరు తీవ్ర తరమైంది. మా కష్టాన్ని కాజేసిన ఫ్యాక్టరీ యాజమాన్యానికి కాపలా కాస్తారా అంటూ పోలీసులు, అధికారులపై రైతులు విరుచుకుపడ్డారు. బకాయిలు, తమకు తెలియకుండా తమపేరుమీద తీసుకున్న రుణాలు చెల్లించాలని పట్టుబట్టారు. ఆస్తులు జప్తుచేసి, అప్పులు తీరుస్తామని అధికారులు ఇచ్చిన హామీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఇంకా రూ.10 కోట్ల వరకూ ఫ్యాక్టరీ చెల్లించవలసి ఉంది. ఈ నేపథ్యంలో చెరుకు మద్దతు ధర నిర్ణయించడానికి ఫ్యాక్టరీ ఆవరణలో శనివారం సమావేశం నిర్వహించనున్నారు. దీంతో ఇటు రైతులు, అటు అధికారులు, పోలీసుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
సర్వత్రా ఉత్కంఠ !
* నేడు చెరుకు రైతులతో ఎన్‌సీఎస్ యాజమాన్యం సమావేశం
* క్రషింగ్ ముందు రోజు చర్చలు నిర్వహించడంపై సందేహాలు
* ఇప్పటివరకూ జరగని చెల్లింపులు
బొబ్బిలి: ఎన్‌సీఎస్ చక్కెర కర్మాగారంలో శనివారం నిర్వహించనున్న సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు వెలువడతాయో, రైతుల డిమాండ్లకు యాజమాన్యం ఎలా స్పందిస్తుందో, రైతులు, ఆయా సంఘాలు నాయకుల దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది ఉత్కంఠగా మారింది. ఫ్యాక్టరీలో క్రషింగ్ నాటికి రైతులందరికీ పూర్తిగా చెల్లింపులు చేయాలన్నది రైతు సంఘాల డిమాండ్. రాష్ట్రంలోని ఎక్కువ సామర్థ్యం గల ఫ్యాక్టరీ చెల్లించ ధర ప్రకారమే ఇక్కడ రైతులకు చెల్లించాలని, ఈ ఏడాది చెరుకును సరఫరా చేసిన 15 రోజుల్లోగా చెల్లింపులు చేయాలని, దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఇప్పటివరకూ రైతు సంఘం రైతుల తరఫున పోరాటాలు చేసి డిమాండ్లు పెట్టింది.
అయితే వీటిపై ఎప్పటికప్పుడు యాజమాన్యం.... అధికారుల దగ్గర తలూపి చివరకు అమలు దగ్గరకు వచ్చేసరికి చుక్కలు చూపిస్తోంది. లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం పరిధిలో 17 మండలాలకు చెందిన రైతులు చెరకును సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 16 వేల మంది రైతులు సుమారు ఏడు వేల హెక్టార్లలో చెరుకు పండించారు. ప్రతీ ఏటా నవంబర్‌లో క్రషింగ్ చేస్తుంటారు. క్రషింగ్‌కు ముందు రైతులు, ప్రజాప్రతినిధులతో యాజమాన్యం సమావేశం ఏర్పాటు చేయడం, దానిలో ధరను నిర్ణయించడం, 15 రోజులకు ఒక సారి చెల్లింపులు చేస్తామని హామీ ఇవ్వడం అనావాయితీగా వస్తోంది. అయితే గత మూడేళ్లుగా చెల్లింపులు సక్రమంగా లేకపోవడం, రైతుల పేరుతో ఎన్‌సీఎస్ కర్మాగారం బినామీ రుణాలు వాడేయడం వంటివి ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఈ ఏడాది జనవరి నుంచి అసలు చెల్లింపులు చేయలేదు. దాదాపు రూ.22 కోట్ల మేర ఫ్యాక్టరీ రైతులకు చెల్లించకుండా నేడూరేపూ అంటూ వాయిదా వేసింది. దీంతో అక్టోబరు 2న ఫ్యాక్టరీ దగ్గర రైతులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఈ ఆందోళన అయిదు రోజుల పాటు కొనసాగింది. తమకు తెలియకుండా తమ పేరుమీద ఫ్యాక్టరీ యాజమాన్యం బ్యాంకులో రుణం తీసుకుందని పోలీసులకు రైతులు ఫిర్యాదు చేయడంతో ఎండీతో సహా ఇద్దరు డెరైక్టర్లను అరెస్టు చేశారు. డిసెంబరు నెలాఖరునాటికి చెల్లింపులు పూర్తిగా చేయాలని హైకోర్టు కూడా ఆదేశించింది. దానిపై కూడా రైతులు మళ్లీ పోరాటాలకు దిగి తక్షణమే చెల్లింపులు చేసే విధంగా కౌంటర్ ఫైల్ కూడా దాఖలు అయ్యేలా ఒత్తిడి తెచ్చారు.
ఈ నెల 9న సుగర్ కేన్ కార్యాలయంలో రైతులు, యాజమాన్యంతో జేసీ రామారావు సమావేశం నిర్వహించారు. దానిలో 23వ తేదీన క్రషింగ్ ప్రారంభం నాటికి పూర్తిగా చెల్లింపులు చేస్తామని డెరైక్టరు శ్రీనివాస్ హామీ ఇచ్చారు. అయితే అది ఇంత వరకూ కార్యరూపం దాల్చలేదు.. సరికదా క్రషింగ్‌కు వారం రోజుల ముందే సమావేశం పెడతామని చెప్పి, విస్మరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. క్రషింగ్‌కు ఒక రోజు ముందు సమావేశం పెట్టి మళ్లీ తమను మోసం చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వమే ఫ్యాక్టరీని నడి పించాలని, టన్నుకు రూ 2,700 మద్దతు ధర చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఫ్యాక్టరీ వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎటువంటి నిర్ణయాలను యాజమాన్యం ప్రకటిస్తుందో, దానిని అమలు చేయడానికి అధికారులు ఎటువంటి భరోసా ఇస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. సమావేశం దగ్గర ఎటువంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తుకు సిద్ధమవుతున్నారు.
ఏం చేస్తారో.. ఏమో..!
Published Sat, Nov 22 2014 4:45 AM | Last Updated on Mon, Oct 1 2018 4:26 PM
Advertisement
Advertisement