
నేడు టీడీఎల్పీ నేత ఎన్నిక
- ముస్తాబైన ఎస్వీయూ ప్రాంగణం
- పోలీసుల ఆధీనంలో వర్సిటీ
- ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ బాలకృష్ణ
సాక్షి, తిరుపతి: టీడీఎల్పీ నేత ఎన్నికకు శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ ఆడిటోరియం ముస్తాబవుతోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును బుధవారం రాత్రి ఏడు గంటలకు ఇక్కడ జరిగే సమావేశంలో శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు పర్యవేక్షిస్తున్నారు. సమావేశ మందిరాన్ని అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ మంగళవారం పరిశీలించారు. ఆడిటోరియం పరిసరాలను పోలీసులు స్వాధీనంలోకి తీసుకున్నారు. బందోబస్తు ఏర్పాట్లను అర్బన్ జిల్లా ఎస్పీ ఎస్వీ.రాజశేఖర్‌బాబు పర్యవేక్షిస్తున్నారు.
అందంగా ముస్తాబవుతున్న వేదిక
టీడీఎల్పీ నేత ఎన్నికకు యూనివర్సిటీ ప్రాంగణాన్ని అరటి తోరణాలతో అందంగా ముస్తాబు చేస్తున్నారు. గోల్డెన్ జూబ్లీ ఆర్చి నుంచి సమావేశ మందిరం వరకు తోరణాలు ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ ఆడిటోరియంలో పాత కుర్చీల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో చంద్రబాబు కాన్వాయ్ ప్రయాణించే మార్గంలో టీడీపీ శ్రేణులు స్వాగత ఫ్లెక్లీలు ఏర్పాటు చేస్తున్నాయి.
టీడీఎల్పీ సమావేశం వేదికను పదేపదే మార్చడంతో అధికారులు ఇబ్బందులు పడ్డారు. తొలుత యూనివర్సిటీ సెనేట్ హాల్ లేదా మహతి ఆడిటోరియంను పరిశీలించారు. ఆ తర్వాత పద్మావతి మహిళా యూనివర్సిటీలోని సావేరి అతిథిగృహం సమావేశ మందిరంలోనూ ఏర్పాట్లు ప్రారంభించారు. చివ రకు సోమవారం రాత్రికి ఎస్వీయూ ఆడిటోరియంను వేదికగా నిర్ణయించారు.
మధ్యాహ్నం 3.30 గంటలకు చంద్రబాబు రాక
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విమానంలో రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా నగరంలోని ఒక స్టార్ హోటల్‌కు చేరుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీఎల్పీ సమావేశం రాజకీయ కార్యక్రమం కావడంతో విమర్శలు రాకుండా స్టార్ హోటల్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం.
ఆ పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం ఉదయమే తిరుపతికి చేరుకుని అవకాశం ఉండడంతో వారి కోసం వివిధ హోటళ్లలో గదులు రిజర్వు చేశారు. సమావేశం తర్వాత వారికి అక్కడే భోజన సౌకర్యం కల్పించారు. ఎమ్మెల్యేల వసతి సౌకర్యాలను స్థానిక ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ చూస్తున్నారు. సమావేశం ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీనాయుడు చూస్తున్నారు. ఎస్వీయూ వీసీ రాజేంద్ర, రిజిస్ట్రార్ సత్యవేలురెడ్డి, ప్రొఫెసర్ ఎం.సురేష్‌బాబు, యూనివర్సిటీ ఇంజనీరు అజయ్‌బాబు తదితరులు సహ కరించారు.