తిరుపతి కల్చరల్: నవీ ముంబైలోని ఉల్వేలో మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల స్థలంలో శ్రీవేంకటేశ్వర స్వామి (బాలాజీ) ఆలయ నిర్మాణానికి బుధవారం శాస్త్రోక్తం గా భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేతో పాటు డిప్యూటీ సీఎం దేవేందర్ ఫడ్నవీస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘వేంకటరమణా గోవిందా’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం.. నవీ ముంబైలో తిరుపతి బాలాజీ మందిర నిర్మాణానికి శంకుస్థాపన జరగడం మహారాష్ట్రకు మరుపురాని రోజు అని చెప్పారు.
మహారాష్ట్ర ప్రజల చిరకాల కోరికను నెరవేర్చి మనల్ని ఆశీర్వదించడానికి తిరుమల బాలాజీ నవీ ముంబైలో కొలువుదీరబోతున్నారని తెలిపారు. ముంబై ట్రాన్స్‌హార్బర్ లింక్‌లోని 22 కిలోమీటర్ల పొడవైన సింగిల్ బ్రిడ్జిని త్వరలో మహాలక్ష్మి ఆలయానికి అనుసంధానించనున్నట్లు తెలిపారు. ఆలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయడానికి ప్రభుత్వం పూర్తిసహకారం అందిస్తుందని ఆయన చెప్పారు. టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ అయిన బాలాజీ ఆలయాన్ని తిరుమల ఆలయం తరహాలో నిర్మించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సూచించారని తెలిపారు.
ఆలయ నిర్మాణ ఖర్చును రేమండ్ గ్రూప్ సీఎండీ గౌతమ్ హరి సింఘానియా భరిస్తున్నారని చెప్పారు. రెండేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. గౌతమ్ సింఘానియా మాట్లాడుతూ అందరి సహకారంతో ఆలయాన్ని అత్యంత వేగంగా నిర్మిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యుడు మిలిందర్ నర్వేకర్, ఆమోల్ కాలే, రాజేష్శర్మ, సౌరభ్ బోరా, సిడ్కో వీసీ డాక్టర్ సంజయ్ ముఖర్జీ, టీటీడీ ఎస్‌ఈ జగదీశ్వర్‌రెడ్డి, మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment