సాక్షి, ముంబై: రైలు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడినవారిని వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు హెలికాప్టర్లు అందుబాటులో ఉంచాలని రైల్వే పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. అందుకు నగరంలోని ప్రముఖ లోకల్ రైల్వేస్టేషన్ల సమీపంలో హెలిపాడ్లు నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం అధికారులు 14 లోకల్ రైల్వే స్టేషన్ల సమీపంలో స్థలాలను ఎంపిక చేశారు. అధ్యయనం పనులు పూర్తికాగానే హెలిపాడ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. రైలు ప్రమాదంలో అవయవాలు పొగొట్టుకున్న ప్రయాణికులకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తే ప్రాణ నష్టం జరగదని రైల్వే భావించింది.
దీంతో ఈ బృహత్తర నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. నగరం, శివారు ప్రాంతాల్లో ప్రతీరోజు పట్టాలు దాటుతూ, అదుపుతప్పి కిందపడిపోవడం, ప్లాట్‌ఫారం-రైలు మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో నుంచి కిందపడిపోవడం ఇలా సరాసరి 15-20 ప్రమాదాలు జరుగుతున్నాయి.
అందులో సరాసరి ఎనిమిది మంది చనిపోతున్నారు. మిగతావారు తీవ్రంగా గాయపడడమో లేదా అవయవాలు కోల్పోవడమో జరుగుతోంది. ఇలా గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించాలంటే అంబులెన్స్‌లపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇవి ఎక్కడో పార్కింగ్ చేసి ఉంటాయి. అక్కడి నుంచి స్టేషన్ వరకు రావాలి. ఆ తర్వాత బాధితుడిని ఆస్పత్రికి తరలించాలి. కాని నగరంలో ఎప్పుడు, ఏ రహదారిపై చూసినా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. ఇలాంటి సందర్భంలో అత్యవసర వాహనాలు కూడా ముందుకు కదలలేని పరిస్థితి ఉంటోంది. ఫలితంగా కొనఊపిరితో ఉన్న వారు ప్రాణాలు వదిలే పరిస్థితి ఉంటుంది.
దీంతో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు అన్ని రైల్వే స్టేషన్ల ఆవరణలలో హెలిపాడ్లు నిర్మించాలని రైల్వే శాఖ యోచించింది. కాని అన్ని స్టేషన్ల వద్ద అనుకూలమైన స్థలం అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం 14 కీలకమైన స్టేషన్ల సమీపంలో ఈ హెలిపాడ్లు ఏర్పాటు చేయాలని రైల్వే పరిపాలన విభాగం నిర్ణయించింది.
ఎక్కడైనా ప్రమాదం జరిగినట్లు తెలియగానే అక్కడికి సమీపంలో ఉన్న హెలిపాడ్‌లో ఈ హెలికాప్టర్లు ల్యాండ్ అవుతాయి. అక్కడి నుంచి నేరుగా సమీప ఆస్పత్రికి బాధితులను చేరవేస్తాయి. ఇదిలా ఉండగా, హెలిపాడ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సమకూర్చి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి రైల్వేశాఖ విజ్ఞప్తి చేసింది. కాని పట్టించుకోకపోవడంతో స్వయంగా రైల్వే పరిపాలన విభాగం చొరవ తీసుకుంది.
హెలిపాడ్ల నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలాలివే...
ఆజాద్‌మైదాన్, మాటుంగా జింఖానా, కుర్లా రైల్వే కాలనీ గ్రౌండ్, ఠాణేలోని దాదోజీ కొండ్‌దేవ్ స్టేడియం, కల్యాణ్ రైల్వే స్కూల్, అంబర్‌నాథ్ ఎంఐడీసీ, బద్లాపూర్ ఆదర్శ్ విద్యామందిర్ గ్రౌండ్, భీవ్‌పూరి రోడ్‌లోని నందకుమార్ ఇన్‌స్టిట్యూట్, టిట్వాలాలోని గణేశ్ మందిరం, లోనావాలా హెలిపాడ్, జగత్‌పురి రైల్వే గ్రౌండ్, పన్వేల్ హెలిపాడ్, వసయిరోడ్‌లోని వైఎంసీఏ గ్రౌండ్.
రైల్వే ఎమర్జెన్సీకి హెలికాప్టర్లు
Published Fri, Jul 4 2014 10:55 PM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM
Advertisement
Advertisement