తిరుమల: అయోధ్యలో సోమవారం జరుగనున్న బాల రాముని విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరయ్యే భక్తులకు పంపిణీ చేయడానికి తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి ప్రసాదం అయిన లక్ష లడ్డూలను రామ మందిర ట్రస్టు ప్రతినిధులకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆదివారం అందజేశారు. తొలుత రామ మందిరానికి చేరుకున్న కరుణాకరరెడ్డికి రామ మందిర ట్రస్టు ప్రతినిధి సాధ్వి రితంబరి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన రామాలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
తర్వాత ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులతో మాట్లాడారు. కలియుగంలో తిరుమలలో స్వయంభువుగా వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారే త్రేతాయుగంలో శ్రీరామచంద్ర మూర్తి అని చెప్పారు. శ్రీవారి ప్రథమ సేవకుడిగా ఉన్న తనకు రామ మందిర ప్రారంభ మహోత్సవంలో పాల్గొనే అదృష్టం దక్కడం పూర్వజన్మ సుకృతమని ఆనందం వ్యక్తం చేశారు.
రసరమ్యంగా అయోధ్యకాండ అఖండ పారాయణం
లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం జరిగిన 6వ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం భక్తిసాగరంలో ముంచెత్తింది. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. అయోధ్యకాండలోని 18 నుంచి 21వ సర్గ వరకు మొత్తం నాలుగు సర్గల్లో 199 శ్లోకాలు, యోగవాశిష్టం, ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలు కలిపి మొత్తం 224 శ్లోకాలను పారాయణం చేశారు. ధర్మగిరి వేద పాఠశాల పండితులు కె.రామానుజాచార్యులు, అనంత గోపాలకృష్ణ, మారుతి శ్లోక పారాయణం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment