సాక్షి, తిరుమల : శ్రీవారి భక్తులకు కోరినన్ని అదనపు లడ్డూలు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఉచిత లడ్డూ, సబ్సిడీ లడ్డూలు కొనసాగిస్తూనే పెంచిన లడ్డూ ప్రసాదాల రాబడితో లోటు భారాన్ని పూడ్చు కోవాలని ధార్మిక సంస్థ కసరత్తు చేస్తోంది. ఇటీవల టీటీడీ రూ.25 ధరతో విక్రయించే చిన్నలడ్డూ (175 గ్రాములు) రూ.50, కల్యాణోత్సవం లడ్డూ రూ.100 నుండి రూ.200, వడ ప్రసాదం రూ.25 నుండి రూ.100కి పెంచిన విషయం తెలిసిందే. దీంతో బ్లాక్‌లో లడ్డూల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. అయినా, డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా జరగడంలేదు. రూ.50 ధర ఉన్న లడ్డూకు డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో అదనపు లడ్డూల 30 వేల సంఖ్యను 50వేలకు పెంచాలని టీటీడీ యోచిస్తోంది.
తగ్గనున్న ఆర్థిక భారం
2017–2018 వార్షిక లెక్కల ప్రకారం.. లడ్డూ తయారీ ఖర్చు రూ.37కి చేరింది. టీటీడీ ఉచిత లడ్డూ, రూ.10 చొప్పున రెండు సబ్సిడీ లడ్డూలు, రూ.25 ధరతో రెండు లడ్డూల సరఫరా కొనసాగిస్తోంది. దీని వల్ల ఏటా టీటీడీపై రూ.250 నుండి రూ.300 కోట్ల మేర అదనపు భారం పడుతోంది. పెంచిన ధరలతో రోజూ అదనంగా 30వేల లడ్డూలు విక్రయిస్తున్నారు. ఈ సంఖ్యను 50వేలకు పెంచడంతోపాటు వడ ప్రసాదం, కల్యాణోత్సవం లడ్డూల విక్రయాలు కూడా పెంచాలని అధికారులు యోచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment