
ఇంజక్షన్‌కి ముందు ఆరోగ్యంగా ఉన్న కార్తీక్, ప్రైవేటు ఆస్పత్రి ఐసీయూలో చిన్నారి
సాక్షి, గండేపల్లి (తూర్పు గోదావరి): పసిపిల్లలకు అంటువ్యాధులు సోకకుండా ఉండేందుకు వేసే టీకా వికటించడంతో ఐదు నెలల పసిబాలుడు అపస్మారకస్థితికి చేరుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని నీలాద్రిరావుపేటకు చెందిన నల్లమిల్లి రమేష్, సుశీల దంపతులకు ఐదు నెలల క్రితం బాలుడు (కార్తీక్) జన్మించాడు. ప్రతినెలా ఆరోగ్య కార్యకర్తల సూచనల మేరకు పోలియో చుక్కలు, వ్యాధినిరోధక టీకాలు వేయిస్తున్నారు. ఈనెల 17న గ్రామీణ ప్రాంత సబ్‌సెంటర్‌కు బాలుడుని తీసుకువెళ్లగా ఆరోగ్య కార్యకర్తలు యథావిధిగా ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేసిన అర్ధగంటలో పసిబాలుడులో మార్పుచోటు చేసుకుని ఏడుపు మానకపోవడంతో తల్లిదండ్రులు ఆరోగ్య కార్యకర్తలను నిలదీశారు. ఇంజక్షన్ సరిగా చేయలేదని అడగడంతో ఎప్పటిలానే చేశామని సర్దిచెప్పారు.
బాలుడు ఆరోగ్య పరిస్థితి సాయంత్రానికి క్షీణించడంతో బంధువులు, చుట్టు పక్కలవారు ఆక్రందనతో ఆందోళన చెందారు. పరిస్థితి విషమించడంతో జగ్గంపేట ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడి వైద్యులు బాలుడు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం తీసుకువెళ్లాలని చెప్పడంతో హుటాహుటిన బాలుడిని రాజమహేంద్రవరం వైద్య నిమిత్తం తరలించారు. అక్కడి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ఐసీయూలో ఉంచారు. నాలుగు రోజుల అనంతరం ఆదివారం సాధారణ గదికి తరలించి వైద్యం అందిస్తున్నారని ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నట్టు బంధువులు తెలిపారు. ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యంతోనే బాలుడు ఆస్పత్రి పాలయ్యాడని గ్రామస్తులు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇంజక్షన్ వల్ల ఇలా జరగలేదని బాలుడుకి ఇన్‌ఫెక్షన్ ఉండటవల్ల ఇలా అయ్యిందని వైద్య సిబ్బంది చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment