ఇంతలో ఎంత ఘోరం
- ప్రయోజకుడవుతాడ నుకుంటే విగతజీవిగా కనిపించాడు
- ట్రిపుల్ ఐటీ విద్యార్థి నవీన్ తండ్రి ఆవేదన
విజయవాడ, న్యూస్‌లైన్ : ‘నాన్నా.. కోర్సు పూర్తయిన వెంటనే మంచి ఉద్యోగం వస్తుంది.. నువ్వేమీ కష్టపడక్కర్లేదు అనేవాడు.. మరో నాలుగు నెలల్లో ప్రయోజకుడు అవుతాడనుకున్నా.. ఇప్పుడు విగతజీవిగా చూడాల్సి వస్తోంది..’ అంటూ నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన గజ్జల నవీన్ (21) తండ్రి కొండయ్య కన్నీరుమున్నీరయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం పుప్పాలవారిగూడెం గ్రామానికి చెందిన గజ్జల కొండయ్య చిన్నపాటి కిరాణా షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు.
ఆయన ఇద్దరు కుమారులూ చదువులో మెరికలే. ప్రస్తుతం మృతిచెందిన పెద్ద కొడుకు నవీన్ స్వగ్రామం పక్కన ఉన్న కె.గోకవరం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో పదోతరగతి చదివి 562 మార్కులు సాధించాడు. నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాడు. అతని తమ్ముడు సత్యనారాయణ కూడా అదే పాఠశాలలో చదివి పదవ తరగతిలో 554 మార్కులు సాధించడంతో నూజివీడు ట్రిపుల్ ఐటీలోనే సీటు సాధించి ప్రస్తుతం నాలుగో సంవత్సరం చదువుతున్నారు.
కుమారులిద్దరూ ట్రిపుల్ ఐటీలో సీటు సాధించడం, మరో నాలుగు నెలలు గడిస్తే పెద్ద కొడుకు కోర్సు పూర్తవనుండటంతో ప్రయోజకుడిగా చూస్తానని కొండయ్య ఆశ పడ్డారు. ఇంతలోనే విధి వెక్కిరించింది. వేకువ జామునే వేకువ జాయునే నాలుగు గంటలకు సహచర విద్యార్థులందరితో కలిసి నిద్రలేచిన నవీన్ అనుమానాస్పద స్థితిలో భవనం పైనుంచి కిందపడ్డాడు. తీవ్రగాయాలపాలైన అతన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు.
ఆస్పత్రికి వచ్చేవరకు మృతి విషయం తెలియని వైనం...
తన కొడుక్కి దెబ్బ తగిలిందని సోదరుని కుమారుడు చెప్పితే అందరం కలిసి వచ్చామని, ఇక్కడికొచ్చిన తర్వాత చూస్తే విగతజీవిగా పడివున్నాడంటూ తండ్రి కొండయ్య భోరున విలపించారు. ఈ విషయం ఇంటి వద్ద ఉన్న తన భార్య లక్ష్మీ సరస్వతికి ఎలా చెప్పాలో తెలియదం లేదంటూ కుమారుని మృతదేహంపై పడి రోదించారు. అదే సమయంలో వందలాది మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అక్కడికి చేరడంతో ‘నా కొడుకు ఎలా పడ్డాడు’ అంటూ ఆవేదనతో ప్రశ్నించారు. ఈ దృశ్యం పలువురిని కంటతడి పెట్టించింది. నూజివీడు పోలీసులు అక్కడకు చేరుకుని బంధువుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.