grocery shop
-
జనసేన నాయకుడి మోసానికి కిరాణా వ్యాపారి బలి
పొందూరు: శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బురిడి కంచరాం గ్రామానికి చెందిన జనసేన నాయకుడు గురివిందల అసిరినాయుడు చేసిన మోసానికి ఓ కిరాణా వ్యాపారి బలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... విజయనగరం జిల్లా రాజాం మండలం పెనుబాకకు చెందిన బుడ్డెపు రామకృష్ణ (43) తమ గ్రామంలోనే కిరాణా వ్యాపారం నిర్వహిస్తుంటారు. ఆయన ఇద్దరు పిల్లలకు 2020లో సైనిక్ స్కూల్లో సీట్లు ఇప్పిస్తానని జనసేన నాయకుడు గురివిందల అసిరినాయుడు నమ్మించాడు. ఇందుకోసం అసిరినాయుడుకు రామకృష్ణ రూ.16లక్షలు ఇచ్చాడు. అయితే రామకృష్ణ పిల్లలకు సైనిక్ స్కూల్లో సీట్లు రాలేదు. తన పిల్లల భవిష్యత్ బాగుంటుందనే ఆశతో అప్పు చేసి రూ.16లక్షలు ఇచ్చానని, ఆ డబ్బులను తిరిగివ్వాలని అనేకసార్లు రామకృష్ణ అడిగినా... అసిరినాయుడు పట్టించుకోలేదు. ఈ ఏడాది మార్చి 31న మరోసారి అసిరినాయుడు ఇంటికి రామకృష్ణ తన భార్యతో కలిసి వచ్చి అప్పులు పెరిగిపోయాయని, డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. ‘నీకు నచ్చినట్లు చేసుకో...’ అని అసిరినాయుడు రెచ్చిపోయాడు. దీంతో రామకృష్ణ తన వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగాడు. ఆయనను శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, మూడు రోజులకే రూ.3.50 లక్షలు ఖర్చు అయ్యింది. ఆ తర్వాత డబ్బులు లేకపోవడంతో కుటుంబ సభ్యులు రామకృష్ణను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. ఈ ఘటనపై పొందూరు పోలీస్‌స్టేషన్‌లో రామకృష్ణ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఉద్యోగాల పేరుతోనూ డబ్బులు వసూలు! జనసేన నాయకుడు గురివిందల అసిరినాయుడు ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి జల్సాలు చేస్తుంటాడని కంచరాం గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో నరసన్నపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.10 లక్షలు తీసుకున్నాడని, అతనికి ఉద్యోగం రాకపోవడంతో రూ. 5 లక్షలు తిరిగి ఇచ్చాడని తెలిపారు. ఇదే తరహాలో కొత్తూరుకు చెందిన వ్యక్తి నుంచి రూ.3 లక్షలు, శ్రీకాకుళానికి చెందిన వ్యక్తి నుంచి రూ.15 లక్షలు తీసుకుని మోసం చేయడంతో దేహశుద్ధి కూడా చేశారని గ్రామస్తులు చెప్పారు. -
సోడా, చిప్స్ కోసం వెళ్లాను.. అంతలోనే ఘోరం..
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. సోమవారం కొలరాడోలోని ఓ సూపర్ మార్కెట్లోకి ప్రవేశించిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి సహా 10 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరుపుతున్న వ్యక్తిని పట్టుకునే క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ లోపలికి వెళ్లారు. ఈ క్రమంలో దుండగుడు అతనిపై కూడా కాల్పులు జరపగా, పోలీసు అధికారి అక్కడికక్కడే మరణించారు.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అర్ధ నగ్నంగా సూపర్మార్కెట్లోకి ప్రవేశించిన దుండగుడు కాల్పులకు తెగబడినట్టు జరిపినట్లు సమాచారం. ఇక ఈ ఘటనలో ఉన్మాదికి సైతం గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిగిన సూపర్ మార్కెట్ ప్రాంతాన్ని భద్రత సిబ్బంది ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. కాల్పుల నుంచి బయటపడ్డ ప్రత్యక్షసాక్షి ఒకరు మాట్లాడుతూ...'సోడా, చిప్స్ తీసుకోవడానికి సూపర్ మార్కెట్‌కి వెళ్లాను. దుండగుడు 8 రౌండ్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో నేను దాదాపు చనిపోతాననుకున్నా. ఒకరికొకరం సహాయం చేసుకుంటూ సూపర్ మార్కెట్ బయటకు పరుగెత్తుకొచ్చాం. కానీ దురదృష్టవశాత్తూ కొందరు షాక్‌లోనే ఉండిపోయారు' అని పేర్కొన్నాడు. కాల్పుల ఘటనపై కొలరాడో గవర్నర్ జారెడ్ పోలిస్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బౌల్టర్లో చోటుచేసుకున్న ఘటన తీరని విషాదాన్ని కలిగిస్తుంది. దీనిపై మాట్లాడటానికి మాటలు రావడం లేదు. ఈ ఘటన నన్ను కలిచివేస్తుంది అని ట్వీట్ చేశారు. -
కిరాణ షాపులో అగ్నిప్రమాదం
సాక్షి,గార్ల(ఇల్లందు): దీపావళి పండుగ వేడుకలు ఆనందంగా జరుపుకుని రాత్రి ఇంట్లో నిద్రించగా ముందున్న కిరాణ షాపులో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలకేంద్రంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... గార్ల మండలకేంద్రంలోని మెయిన్ బజార్లో ఉన్న గోదా మహావీర్‌జైన్ కిరాణం షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. దుకాణం వెనుకభాగంలో నివసిస్తున్న యజమాని లేని చూసి కేకలు వేయగా ఇరుగుపొరుగు వారు వచ్చి నీళ్లు తెచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మహబూబాబాద్ నుంచి ఫైరింజిన్ వచ్చి మంటలు ఆర్పేసింది. అప్పటికే దుకాణంలోని సరుకులు మొత్తం కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.10లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. భవనం సైతం పూర్తిగా దెబ్బతిన్నది. ఫైరింజిన్ మరో 15 నిమిషాల ఆలస్యమై ఉంటే పక్క దుకాణాలకు సైతం మంటలు అంటుకుని పెనుప్రమాదం సంభవించేదని స్థానికులు పేర్కొంటున్నారు. -
కిరాణా షాపులో చోరీ
నిజామాబాద్ క్రైం : నగరంలోని రెండో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల గాజుల్‌పేట్‌లో శంకర్ కిరాణ షాపులో సోమవారం చోరీ జరిగింది. తెలిసిన వారే చోరీ చేసినట్లు షాపు నిర్వాహకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాజు ల్పేట్కు చెందిన శంకర్ తన ఇంట్లో ముందు భాగంలో కిరాణం నడుపుతూ వెనుక గదిలో భార్య లలితతో కలిసి నివాసం ఉంటాడు. ఆయ న ఇంట్లో ప్రవీణ్ ఏడాది క్రితం అద్దెకు దిగాడు. మొదట్లో ప్రవీణ్ శంకర్ కుటుంబంతో బాగానే ఉండడంతో అతడిని నమ్మి స్వేచ్ఛనిచ్చారు. ఇదే అదునుగా భావించి రెన్నెళ్ల క్రితం లలితకు చెందిన రెండు మాసాల బం గారాన్ని చోరీ చేశాడు. దీనిని చూసిన శంకర్ అతడిని ఇంట్లోనుంచి వెళ్లగొట్టారు. దీనిని మనస్సులో పెట్టుకున్న ప్రవీణ్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి సోమవారం తెల్లవారుజామున 2.30 గంటలకు దుకాణంలో చొరబడి కౌంటర్లో ఉన్న రూ.8 వేల నగదు, రిచార్జీ కూపన్లు, బీరువాలో దాచిపెట్టిన రెండు తులాల బంగారు నగలు(కమ్మలు, చైన్), ఐదు తులాల వెండి, పట్టు చీరలు, రూ.80వేల నగ దు, షాపులోని సామగ్రి ఎత్తుకుపోయాడు. ఉదయం 5 గంటలకు కిరాణ షాపు తెరిచే శంకర్ తలుపులు తెరిచి ఉండడం చూసి అవాక్కయ్యాడు. వెంట నే విషయాన్ని రెండో టౌన్ పోలీసులకు తెలియజేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అక్కడే ఓ నైటి పడి ఉండడం అది ప్రవీణ్ భార్యకు చెందినదిగా లలిత గుర్తుపట్టింది. చోరీ అతడే చేసి ఉంటాడని అనుమానించారు. పోలీసులు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బోస్ కిరణ్ తెలిపారు. -
కిరాణా కొట్టు నుంచి రూ 251 కే స్మార్ట్‌ఫోన్ వరకూ..
మీరట్: ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ. అదే 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్. అమ్మకాలు మొదలెట్టగానే సర్వర్లు క్రాష్ అయ్యేంత రష్. ఇంతలా భారీగా హైప్ క్రియేట్ చేసిన రింగింగ్ బెల్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మోహిత్ గోయల్ ప్రస్థానం మాత్రం అతిసాధారణంగా ఉంది. ఉత్తరప్రదేశ్ లోని షమ్లీ జిల్లాలో గర్హిపుక్త అనే చిన్న పట్టణంలో కిరాణా కొట్టు నిర్వహించే కుటుంబానికి చెందిన మోహిత్ గోయల్ ఎవరో నిన్నటి వరకు ఆపట్టణంలోని వారికే సరిగా తెలియదు. అయితే ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా చర్చంతా గోయల్ గురించే. పెద్ద పెద్ద వ్యాపార దిగ్గజాలకు సైతం సాధ్యం కాని ధరకు స్మార్ట్ ఫోన్‌ను అందించేందుకు పూనుకున్న మోహిత్ గోయల్ తండ్రి రాజేష్ గోయల్ గర్హిపుక్తలో 'రామ్ జీ' పేరుతో చిన్న కిరాణం కొట్టును నడిపిస్తున్నాడు. మోహిత్ చిన్నతనంలో తండ్రికి కిరాణా దుకాణం నిర్వహణలో సహకరించేవాడు. గర్హిపుక్తలోనే ఓ కాన్వెంట్ పాఠశాలలో చదువు పూర్తి చేసిన మోహిత్.. నోయిడాలోని అమితి యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఇటీవల మోహిత్ గర్హిపుత్ర వెల్లినప్పుడు ఓ కంపెనీని ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పాడని, అయితే అప్పుడు అది ఇంతగా ప్రజల్లోకి వెళ్లేదని అనుకోలేదని అక్కడి వారు చెబుతున్నారు. బీజేపీ సీనియర్ లీడర్ మురళీ మనోహర్ జోషీ చేతుల మీదుగా జరిగిన ఫ్రీడమ్ 251 మొబైల్‌ను లాంచ్ కార్యక్రమానికి మేం కూడా వెళ్లామని చెబుతూ కొందరు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
పెన్ను కావాలని వచ్చి ....
కాటేదాన్: పెన్ను కొనే నెపంతో కిరాణా షాపునకు వచ్చిన ఇద్దరు దుండగులు షాపు నిర్వాహకురాలి పుస్తెలతాడును తెంచుకొని పారిపోయారు. మైలార్‌దేవ్‌పల్లి క్రైం ఎస్సై వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక్‌నగర్ బస్తీలో గౌలికర్ ప్రమీలా, బన్సీలాల్ దంపతులు కిరాణాషాపు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో వీరి షాపు వద్దకు గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు నెంబర్ ప్లేట్‌లేని పల్సర్ బైక్‌పై వచ్చారు. పెన్ను కావాలని వారు అడగడంతో షాపులో ఉన్న ప్రమీల వారికి పెన్ను అందించి వెనుకకు తిరిగేసరికి ఆమె మెడలోని 3.5 తులాల పుస్తెలతాడును తెంచుకొని బైక్‌పై పారిపోయారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కిరాణా దుకాణంపై విజిలెన్స్ దాడులు
తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : అక్రమంగా నిల్వ చేసిన పప్పు ధాన్యాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన తాడేపల్లిగూడెంలో శుక్రవారం జరిగింది. తాడేపల్లిగూడెంకు చెందిన ఓ కిరాణ షాపులో కంది పప్పు, మినపప్పు అక్రమంగా నిల్వ చేశారు. విషయం తెలుసుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆ షాపుపై దాడి చేసి 23లక్షల 15వేల 700 ల రూపాయల విలువ చేసే కంది పప్పు, మినపప్పు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో డీఎస్పీ అనిల్, సీఐ వెంకటేశ్వరరావు, ఏజీపీవో సత్యనారాయణ, డీసీపీ శేషుకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్రమంగా ఆహారధాన్యాలు నిలువ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పక్కోడి దుకాణానికి నిప్పు పెట్టించాడు!
మల్కాజిగిరి (హైదరాబాద్) :వ్యాపారంలో ఎదగటానికి సవాలక్ష మార్గాలున్నాయి. కానీ ఓ ప్రబుద్ధుడు అలా ఎదగడం చేతకాక.. తనకు పోటీగా ఉన్న ఓ దుకాణానికి ఏకంగా నిప్పు పెట్టించాడు. ఈ ఘటన హైదరాబాద్ మల్కాజ్గిరి పరిధిలోని ఆర్టీసీ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజస్థాన్‌కు చెందిన భక్రీచా దేవారాం(29) అనే వ్యక్తి ఏడాదిన్నరగా స్థానికంగా ఓ కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతంలో అంజాద్పాషా అనే వ్యక్తి ఆరు నెలల కిత్రం ఓ దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. దీంతో దేవారాం వ్యాపారం క్షీణించింది. ఇది సహించలేని దేవారాం ఓ పథకం పన్నాడు. తన దగ్గర పనిచేసే విజయ్కుమార్సింగ్(20)కు పెట్రోల్ ఇచ్చి అంజాద్ దుకాణాన్ని తగులబెట్టమని చెప్పాడు. శుక్రవారం రాత్రి విజయ్‌సింగ్ అంజాద్ దుకాణంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అయితే ఇది గమనించిన స్థానికుడు విజయ్ మరికొందరితో కలసి విజయ్‌సింగ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పగా అప్పటికే షాపు కొంతమేర దగ్ధమైంది. -
ఇంతలో ఎంత ఘోరం
ప్రయోజకుడవుతాడ నుకుంటే విగతజీవిగా కనిపించాడు ట్రిపుల్ ఐటీ విద్యార్థి నవీన్ తండ్రి ఆవేదన విజయవాడ, న్యూస్‌లైన్ : ‘నాన్నా.. కోర్సు పూర్తయిన వెంటనే మంచి ఉద్యోగం వస్తుంది.. నువ్వేమీ కష్టపడక్కర్లేదు అనేవాడు.. మరో నాలుగు నెలల్లో ప్రయోజకుడు అవుతాడనుకున్నా.. ఇప్పుడు విగతజీవిగా చూడాల్సి వస్తోంది..’ అంటూ నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన గజ్జల నవీన్ (21) తండ్రి కొండయ్య కన్నీరుమున్నీరయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం పుప్పాలవారిగూడెం గ్రామానికి చెందిన గజ్జల కొండయ్య చిన్నపాటి కిరాణా షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయన ఇద్దరు కుమారులూ చదువులో మెరికలే. ప్రస్తుతం మృతిచెందిన పెద్ద కొడుకు నవీన్ స్వగ్రామం పక్కన ఉన్న కె.గోకవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో పదోతరగతి చదివి 562 మార్కులు సాధించాడు. నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాడు. అతని తమ్ముడు సత్యనారాయణ కూడా అదే పాఠశాలలో చదివి పదవ తరగతిలో 554 మార్కులు సాధించడంతో నూజివీడు ట్రిపుల్ ఐటీలోనే సీటు సాధించి ప్రస్తుతం నాలుగో సంవత్సరం చదువుతున్నారు. కుమారులిద్దరూ ట్రిపుల్ ఐటీలో సీటు సాధించడం, మరో నాలుగు నెలలు గడిస్తే పెద్ద కొడుకు కోర్సు పూర్తవనుండటంతో ప్రయోజకుడిగా చూస్తానని కొండయ్య ఆశ పడ్డారు. ఇంతలోనే విధి వెక్కిరించింది. వేకువ జామునే వేకువ జాయునే నాలుగు గంటలకు సహచర విద్యార్థులందరితో కలిసి నిద్రలేచిన నవీన్ అనుమానాస్పద స్థితిలో భవనం పైనుంచి కిందపడ్డాడు. తీవ్రగాయాలపాలైన అతన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. ఆస్పత్రికి వచ్చేవరకు మృతి విషయం తెలియని వైనం... తన కొడుక్కి దెబ్బ తగిలిందని సోదరుని కుమారుడు చెప్పితే అందరం కలిసి వచ్చామని, ఇక్కడికొచ్చిన తర్వాత చూస్తే విగతజీవిగా పడివున్నాడంటూ తండ్రి కొండయ్య భోరున విలపించారు. ఈ విషయం ఇంటి వద్ద ఉన్న తన భార్య లక్ష్మీ సరస్వతికి ఎలా చెప్పాలో తెలియదం లేదంటూ కుమారుని మృతదేహంపై పడి రోదించారు. అదే సమయంలో వందలాది మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అక్కడికి చేరడంతో ‘నా కొడుకు ఎలా పడ్డాడు’ అంటూ ఆవేదనతో ప్రశ్నించారు. ఈ దృశ్యం పలువురిని కంటతడి పెట్టించింది. నూజివీడు పోలీసులు అక్కడకు చేరుకుని బంధువుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
భక్తితో ఆర్థిక విముక్తి!
మావారికి చిన్న కిరాణా షాపు ఉంది. షాపు పెట్టుబడికి, అనారోగ్య కారణాలకి డైలీ ఫైనాన్స్ తీసుకుంటారు. పదివేలరూపాయల అప్పుకి తొమ్మిది వేల రూపాయలే చేతికిస్తారు. రోజుకి వంద రూపాయలు వాళ్లకి కట్టాలి. వంద రోజుల్లో అప్పు తీరిపోతుంది. కానీ... ఎప్పుడు చూసినా ఆ అప్పు అప్పుగానే ఉండిపోతోంది. బతుకంతా బ్యాంకు చుట్టే తిరుగుతోంది. దీని నుండి బయటపడటానికి నేను చేయగలిగింది ఏమైనా ఉందా? - సురక్ష కంతేటి, నిజామాబాద్ జవాబు: శ్రీమతి అంటే సిరిని కల్పించే మతి ఉన్నవారని మిమ్మల్ని చూసి అనుకోవచ్చు. కేవలం ఇంటి పని, వంట పని చూసుకుని ఊరుకోకుండా... ఆర్థికభారం నుంచి మీ భర్తను తప్పించాలని చూడటం అభినందనీయం. మహిళలందరూ ఇలా ఆర్థిక అంశాల మీద దృష్టిపెట్టినప్పుడే, కుటుంబం పదికాలాల పాటు పచ్చగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇక మీవారిని అప్పుల నుండి బయటపడవేసే మార్గం చెప్తాను. ముందుగా మీవారు కట్టే డైలీ ఫైనాన్స్ లో ఎంత వడ్డీ కడుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన అక్షరాలా నూటికి ఏడు రూపాయల వడ్డీ కడుతున్నారు. 84 శాతం వడ్డీ కట్టేవాళ్లు ఎప్పటికీ కోలుకోరు. అది ముమ్మాటికీ నిజం. ముందు మీరేం చేస్తారంటే... వెంటనే ఒక మట్టి ముంత (కిడ్డీ బ్యాంక్) కొనండి. డైలీ ఫైనాన్స్ తీరేవరకూ రోజూ 50 రూపాయలు అందులో వేసుకోండి. ప్రస్తుత ఫైనాన్స్ తీరాక, రోజూ వేసుకొనే మొత్తాన్ని పెంచండి. కొద్ది రోజుల్లోనే మీరే మీవారికి వేల రూపాయలు ఇవ్వవచ్చు. ఆ కిడ్డీ బ్యాంక్‌ను దేవుడి పటం ముందు పెట్టి రోజూ డబ్బు వేస్తూ వెళ్లండి. అలా ఎందుకంటే... ఆర్థిక భారానికి భక్తి తోడైతే, మీ సిరిసంపదలు త్వరగా పెరుగుతాయి. - వంగా రాజేంద్రప్రసాద్, ఆర్థిక వ్యవహారాల నిపుణులు