పొందూరు: శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బురిడి కంచరాం గ్రామానికి చెందిన జనసేన నాయకుడు గురివిందల అసిరినాయుడు చేసిన మోసానికి ఓ కిరాణా వ్యాపారి బలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... విజయనగరం జిల్లా రాజాం మండలం పెనుబాకకు చెందిన బుడ్డెపు రామకృష్ణ (43) తమ గ్రామంలోనే కిరాణా వ్యాపారం నిర్వహిస్తుంటారు. ఆయన ఇద్దరు పిల్లలకు 2020లో సైనిక్ స్కూల్‌లో సీట్లు ఇప్పిస్తానని జనసేన నాయకుడు గురివిందల అసిరినాయుడు నమ్మించాడు. ఇందుకోసం అసిరినాయుడుకు రామకృష్ణ రూ.16లక్షలు ఇచ్చాడు.
అయితే రామకృష్ణ పిల్లలకు సైనిక్ స్కూల్‌లో సీట్లు రాలేదు. తన పిల్లల భవిష్యత్ బాగుంటుందనే ఆశతో అప్పు చేసి రూ.16లక్షలు ఇచ్చానని, ఆ డబ్బులను తిరిగివ్వాలని అనేకసార్లు రామకృష్ణ అడిగినా... అసిరినాయుడు పట్టించుకోలేదు. ఈ ఏడాది మార్చి 31న మరోసారి అసిరినాయుడు ఇంటికి రామకృష్ణ తన భార్యతో కలిసి వచ్చి అప్పులు పెరిగిపోయాయని, డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. ‘నీకు నచ్చినట్లు చేసుకో...’ అని అసిరినాయుడు రెచ్చిపోయాడు. దీంతో రామకృష్ణ తన వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగాడు. ఆయనను శ్రీకాకుళంలోని
ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, మూడు రోజులకే రూ.3.50 లక్షలు ఖర్చు అయ్యింది. ఆ తర్వాత డబ్బులు లేకపోవడంతో కుటుంబ సభ్యులు రామకృష్ణను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. ఈ ఘటనపై పొందూరు పోలీస్‌స్టేషన్‌లో రామకృష్ణ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఉద్యోగాల పేరుతోనూ డబ్బులు వసూలు!
జనసేన నాయకుడు గురివిందల అసిరినాయుడు ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి జల్సాలు చేస్తుంటాడని కంచరాం గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో నరసన్నపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.10 లక్షలు తీసుకున్నాడని, అతనికి ఉద్యోగం రాకపోవడంతో రూ. 5 లక్షలు తిరిగి ఇచ్చాడని తెలిపారు. ఇదే తరహాలో కొత్తూరుకు చెందిన వ్యక్తి నుంచి రూ.3 లక్షలు, శ్రీకాకుళానికి చెందిన వ్యక్తి నుంచి రూ.15 లక్షలు తీసుకుని మోసం చేయడంతో దేహశుద్ధి కూడా చేశారని గ్రామస్తులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment