సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
గుంటూరు: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ అన్యాయం చేసిందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. గుంటూరులో ఆదివారం రామకృష్ణ విలేకరులతో మాట్లాడారు. ఏపీ పట్ల కేంద్రం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని వ్యాఖ్యానించారు. విభజన సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని తెలిపారు. ఈ నెల 12వ తేదీన ఏపీ వ్యాప్తంగా యూనివర్సిటీలలో సభలు పెడతామని, హోదా సాధన సమితి ఆధ్వర్యంలో అంతిమ పోరాటం చేస్తామని వెల్లడించారు. అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
బాబు ఢిల్లీలో ధర్మపోరాటాలు చేయాలి
చంద్రబాబు చేసే ధర్మపోరాటాలేవో ఢిల్లీలోనే చేయాలని సూచించారు. రాష్ట్రంలో రాజకీయాలు దిగజారిపోయాయని వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీనేతపై దాడి జరిగితే సీఎం కనీసం పరామర్శించలేదని గుర్తు చేశారు. మోదీ కంటే సీనియర్‌ని అని చెప్పుకునే బాబు పద్ధతి ఇదేనా అని సూటిగా అడిగారు.
ఉంటే మేము, లేదా మీరు అనే రాజకీయాలు ఇక నడవవు అని, కొత్త తరం రాజకీయాలు రావాలని వ్యాఖ్యానించారు. కేంద్రంలో మోదీ వ్యతిరేక కూటమిలో ఉంటామని తెలిపారు. ఏపీలో జనసేనతో కలిసి వెళ్తామని వెల్లడించారు. ప్రజాస్వామ్యవాదులు అంతా ఏపీలో మా కూటమికి మద్ధతు పలుకుతున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment