మావారికి చిన్న కిరాణా షాపు ఉంది. షాపు పెట్టుబడికి, అనారోగ్య కారణాలకి డైలీ ఫైనాన్స్ తీసుకుంటారు. పదివేలరూపాయల అప్పుకి తొమ్మిది వేల రూపాయలే చేతికిస్తారు. రోజుకి వంద రూపాయలు వాళ్లకి కట్టాలి. వంద రోజుల్లో అప్పు తీరిపోతుంది. కానీ... ఎప్పుడు చూసినా ఆ అప్పు అప్పుగానే ఉండిపోతోంది. బతుకంతా బ్యాంకు చుట్టే తిరుగుతోంది. దీని నుండి బయటపడటానికి నేను చేయగలిగింది ఏమైనా ఉందా?
- సురక్ష కంతేటి, నిజామాబాద్
జవాబు: శ్రీమతి అంటే సిరిని కల్పించే మతి ఉన్నవారని మిమ్మల్ని చూసి అనుకోవచ్చు. కేవలం ఇంటి పని, వంట పని చూసుకుని ఊరుకోకుండా... ఆర్థికభారం నుంచి మీ భర్తను తప్పించాలని చూడటం అభినందనీయం. మహిళలందరూ ఇలా ఆర్థిక అంశాల మీద దృష్టిపెట్టినప్పుడే, కుటుంబం పదికాలాల పాటు పచ్చగా ఉంటుందనడంలో సందేహం లేదు.
ఇక మీవారిని అప్పుల నుండి బయటపడవేసే మార్గం చెప్తాను. ముందుగా మీవారు కట్టే డైలీ ఫైనాన్స్ లో ఎంత వడ్డీ కడుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన అక్షరాలా నూటికి ఏడు రూపాయల వడ్డీ కడుతున్నారు. 84 శాతం వడ్డీ కట్టేవాళ్లు ఎప్పటికీ కోలుకోరు. అది ముమ్మాటికీ నిజం. ముందు మీరేం చేస్తారంటే... వెంటనే ఒక మట్టి ముంత (కిడ్డీ బ్యాంక్) కొనండి. డైలీ ఫైనాన్స్ తీరేవరకూ రోజూ 50 రూపాయలు అందులో వేసుకోండి. ప్రస్తుత ఫైనాన్స్ తీరాక, రోజూ వేసుకొనే మొత్తాన్ని పెంచండి. కొద్ది రోజుల్లోనే మీరే మీవారికి వేల రూపాయలు ఇవ్వవచ్చు. ఆ కిడ్డీ బ్యాంక్‌ను దేవుడి పటం ముందు పెట్టి రోజూ డబ్బు వేస్తూ వెళ్లండి. అలా ఎందుకంటే... ఆర్థిక భారానికి భక్తి తోడైతే, మీ సిరిసంపదలు త్వరగా పెరుగుతాయి.
- వంగా రాజేంద్రప్రసాద్, ఆర్థిక వ్యవహారాల నిపుణులు
భక్తితో ఆర్థిక విముక్తి!
Published Thu, Dec 5 2013 11:49 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement