‘టాయ్’లెట్లు
Published Fri, Jan 31 2014 12:30 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
విద్యార్థులన్నా, వారి సమస్యలన్నా అధికారులకు ఎంతో చిన్నచూపన్న విషయం మరోసారి రుజువయింది. అన్ని పాఠశాలల్లోనూ మరుగుదొడ్లు నిర్మించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించినా, విద్యార్థులు పడుతున్న కష్టాలు కళ్లముందు కనిపిస్తున్నా ఈ సర్కారులో చలనం లేదు. ఇప్పటికీ నూటికి తొంభై పాఠశాలల్లో మాత్రమే మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం వాటి నిర్వహణను మాత్రం గాలికొదిలేసింది. ఫలితంగా విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా విద్యార్థినులు, ఉపాధ్యాయినులు నీళ్లురాని, తలుపుల్లేని మరుగుదొడ్లను ఉపయోగించుకోలేక, ఆరుబయటకు వెళ్లలేక సతమతమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ తీరును పరిశీలించేందుకు చేసిన ‘న్యూస్‌లైన్ విజిట్’లో దుర్భర పరిస్థితుల్లో విద్యాభ్యాసం సాగిస్తున్న భావిభారత పౌరుల అవస్థలు వెలుగుచూశాయి.
భానుగుడి (కాకినాడ), న్యూస్‌లైన్ : జిల్లాలో 3819 ప్రాథమిక, 964 ప్రాథమికోన్నత, 1088 ఉన్నత పాఠశాలలుండగా, మరో 13 హయ్యర్ సెకండరీ స్కూల్స్ ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో 2,91,887 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1,29,824, ఉన్నత పాఠశాలల్లో 3,33,241, హయ్యర్ సెకండరీ స్కూల్స్‌లో 5,147 మంది విద్యార్థులు చదువుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం రక్షిత మంచినీటిని పాఠశాలల్లో సరఫరా చేస్తున్నారు. ఇక మరుగుదొడ్ల విషయానికి వస్తే కామన్ టాయిలెట్స్/యూరినల్స్ సదుపాయం 7134 పాఠశాలల్లో ఉంటే.. మరో 8210 బాలికల పాఠశాలల్లో టాయిలెట్స్, 878 పాఠశాలల్లో చిల్డ్రన్స్ వైడ్ స్పెషల్ నీడ్ ఫ్రెండ్లీ టాయిలెట్స్ ఉన్నాయి. ఏజెన్సీలో మాత్రం సుమారు 150కు పైగా పాఠశాలల్లోనూ, మైదాన ప్రాంతాల్లో - మిగతా 2లోఠ
తుని
తుని, న్యూస్‌లైన్ : కోటనందూరు స్కూల్లో 521 మం ది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి కేవలం నాలుగు మరుగుదొడ్లే ఉన్నాయి. ఇవి కూడా పనిచేయడం లేదు. విద్యార్థులు మూత్రవిసర్జనకు అవస్థలు పడుతున్నారు. ఇదే పరిస్థితి తుని, తొండంగి మండలాల పరిధిలోని పలు స్కూళ్లలో నెలకొంది. తుని నియోజకవర్గం పరిధిలో 26 ఉన్నత పాఠశాలలు, 179 ప్రైమరీ, యూపీ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 33,400 మంది విద్యార్థులు చదువుతున్నారు. తొండంగి మండలంలో 50 శాతం పాఠశాలలకు మరుగుదొడ్లు లేవు. తుని మండలం పరిధిలో 12, కోటనందూరులో ఆరు పాఠశాలల్లో మరుగు సదుపాయం లేదు. కొన్ని పాఠశాలల్లో బోరు లేకపోవడం వల్ల మరుగుదొడ్లు ఉన్నా వినియోగించడానికి అవకాశం లేదు. ముఖ్యంగా బాలికల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది.
రాజోలు
మలికిపురం,న్యూస్‌లైన్: నియోజకవర్గంలో అనేక పాఠశాలల్లో మరుగుదొడ్ల సదుపాయం సరిగా లేదు. మలికిపురం మండలంలో 79 పాఠశాలలకు మరుగు దొడ్లు ఉన్నాయి. అయితే నీటి సరఫరా లేక నిరుపయోగంగా మారాయి. రాజోలు మండలంలో 40 పాఠశాలలకు సింగిల్ టాయ్‌లెట్స్ మాత్రమే ఉన్నాయి. సఖినేటిపల్లి మండలంలో 12 ప్రాథమిక, మూడు ఉన్నత పాఠశాలలకు టాయ్‌లెట్స్ సౌకర్యం లేదు. ఉన్న మరుగుదొడ్లకు తలుపులు సక్రమంగా లేక విద్యార్థులు నానా యాతన పడుతున్నారు.
కొత్తపేట
కొత్తపేట,న్యూస్‌లైన్ : కొత్తపేట నియోజకవర్గంలో 251 మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, జెడ్పీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిల్లో 25,025 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎక్కువ పాఠశాలల్లో మరుగుదొడ్ల సదుపాయం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తపేట మండలంలో 88 పాఠశాలల్లో 7,320 మంది, రావులపాలెం మండలంలో 58 పాఠశాలల్లో 5,155 మంది, ఆత్రేయపురం మండలంలో 55 పాఠశాలల్లో 5,050 మంది , ఆలమూరు మండలంలోని 50 పాఠశాలల్లో 7,500 మంది బాలలు చదువుతున్నారు. పలు పాఠశాలల్లో మరుగుదొడ్లు నిరుపయోగం కావడం వల్ల విద్యార్థులు మలమూత్ర విసర్జనకు వసతి గృహలకు, కాలువ గట్లకు వెళ్లవలసి వస్తోంది.
రంపచోడవరం
రంపచోడవరం, న్యూస్‌లైన్ : ఏజెన్సీ పాఠశాలల్లో మరుగు దొడ్ల సమస్య దారుణంగా ఉంది. డివిజన్‌లో ఎంపీపీ, యూపీ, జెడ్పీ, ప్రభుత్వ పాఠశాలలు 296 ఉన్నాయి. వీటిలో 40 శాతం పాఠశాలలకు మరగుదొడ్లు లేవు. 60 శాతం పాఠశాలలకు మరుగుదొడ్లు ఉన్న నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. విద్యార్థినుల పరిస్థితి మరింద దారునంగా ఉంది. దేవీపట్నం మండలంలో 69 పాఠశాలలు ఉంటే వాటిలో 3,400 మంది విద్యార్థులు ఉన్నారు. 40 పాఠశాలలకు మరుగుదొడ్లు ఉన్న నిర్వహణ లేక నిరుపయోగం మారాయి. 29 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. గంగవరం మండలంలో 35 పాఠశాలల్లో 31 పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నాయి. వీటిలో 12 మాత్రమే పనిచేస్తున్నాయి.
మండపేట
మండపేట, న్యూస్‌లైన్ : నియోజకవర్గంలో 271 పాఠశాలలు ఉన్నాయి. మండపేట అర్బన్, రూరల్ దాదాపు అన్ని పాఠశాలలకు మరుగుదొడ్లు సదుపాయం ఉన్నప్పటికీ నీటి సరఫరా లేదు. కపిలేశ్వరపురం మండలంలో మొత్తం 55 పాఠశాలలకు కేవలం 12 పాఠశాలలకు మాత్రమే విద్యుత్ మోటారు సదుపాయం ఉంది. మిగిలిన పాఠశాలల్లో చేతి పంపులే గతి. వల్లూరు, టేకి, కాలేరు, అంగర పాఠశాలల్లో రెండేసి బాత్‌రూమ్‌లు మాత్రమే ఉన్నా యి. పలు పాఠశాలల్లో బాలురకు, బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. రాయవరం మండలం సోమేశ్వరం ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాలకు మరుగుదొడ్డి సౌకర్యం లేదు. మాచవరం ప్రాథమిక పాఠశాలకు రెండు టాయిలెట్లు మాత్రమే ఉన్నాయి. కురకాళ్లపల్లి పాఠశాలలో ఒకే ఒక్క టాయిలెట్ ఉన్నా అది శిథిలస్థితికి చేరుకుంది.
Advertisement
Advertisement