మరుగున..పడేశారు
♦ సుప్రీంకోర్టు బృందం సూచించినా మారని దుస్థితి
♦ విద్యార్థులను భయపెడుతున్న మరుగుదొడ్ల సమస్య
♦ నీరు లేక, నిర్వహణ కరువై పాడవుతున్న టాయిలెట్లు
ప్రభుత్వ పాఠశాలలను మరుగుదొడ్ల సమస్య పీడిస్తోంది. కొన్ని చోట్ల అసలు లేక, ఉన్నచోటేమో నీరుండక, ఇంకొన్నిచోట్లేమో..పర్యవేక్షణ లేక నిరుపయోగంగా మారుతున్నాయి. బడికొచ్చిన పిల్లలు ఆరుబయటికెళ్లి మల, మూత్ర విసర్జన చేసేందుకు అవస్థ పడుతున్నారు. చెట్లు, చేమల చాటుకు వెళ్లలేక భయపడుతున్నారు. ఎవరికీ చెప్పుకోలేక బాలికలు కుమిలిపోతున్నారు. టాయిలెట్ల సమస్య రానీయమని అధికారులు చెబుతున్నా ఆచరణలో మాత్రం షరామామూలే అన్న దుస్థితి నెలకొంది. - ఖమ్మం
ఖమ్మం: గతేడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు జిల్లాలో సుప్రీంకోర్టు బృందం పర్యటించి..మరుగుదొడ్ల సమస్య రానీయొద్దని జిల్లా అధికారులను ఆదేశించింది. లోపాలపై అధికారులను బృందం సభ్యులు మందలించారు కూడా. 40 రోజుల్లో విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు నిర్మించాలని, జిల్లా కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణ చేసి పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇటీవల ఆదేశాలు కూడా జారీ చేశారు. అయినా పురోగతి కనిపించడం లేదు.
వేధిస్తున్న సమస్యలు..
జిల్లాలో అన్ని రకాల 3,336 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 4, 20, 136 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి 40 మంది బాలికలకు ఒకటి, 80 మంది బాలురకు ఒకటి చొప్పున మరుగుదొడ్లు కావాలి. విద్యాహక్కు చట్టం ప్రకారం బాలురకు 3,025, బాలికలకు 3,960 మరుగుదొడ్లు అవసరం. గతేడాది స్వచ్ఛభారత్- స్వచ్ఛ విద్యాలయ పథకం ద్వారా 713 టాయిలెట్లు నిర్మించేందుకు రూ.8.91కోట్ల రూపాయలు విడుదల చేశారు.
నూతన మోడల్‌లో నిర్మించాల్సి ఉంది. ఈ నిర్మాణాలు పూర్తిస్థాయిలో ఆచరణకు నోచలేదు. ఇప్పటికీ జిల్లాలో బాలురకు 238, బాలికలకు 612 మరుగుదొడ్లు కట్టాల్సిన అవసరముంది. ప్రస్తుతం 1639 పాఠశాలల్లో నీటి వసతి లేక మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. దుర్వాసన, అపరిశుభ్రత నెలకొనడంతో విద్యార్థులు వీటిని ఉపయోగించడం లేదు. పాఠశాల సమీపంలోని ఆరుబయట ప్రాంతాల్లో బాలురు మల, మూత్ర విసర్జనకు వెళుతున్నారు. బాలికలు తీవ్ర అవస్థ పడుతున్నారు. ఆరుబయటకు వెళ్లలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కేవలం ఈ సమస్యపైనే బడిమానేసి, ప్రైవేట్ పాఠశాలల్లో చేరిన పిల్లలు అనేకమంది ఉన్నారు.