
నటిగా రాణిస్తానని అనుకోలేదు
అనుకోకుండా సినీ రంగంలో అడుగుపెట్టిన తనను తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతగానో ఆదరించిందని సినీ హీరోయిన్ ఇషాచావ్లా అన్నారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో షూటింగ్‌లో పాల్గొన్న ఆమె స్థానిక విలేకర్లతో కొద్దిసేపు ముచ్చటించారు. ''నేను ఢిల్లీలో పుట్టాను. అక్కడే పొలిటికల్ సైన్స్‌లో పీజీ పూర్తిచేశా. తండ్రి ఢిల్లీలో యూపీఎస్ సంస్థలో కన్సల్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. చదువుకుంటున్న సమయంలో నాకు తెలియకుండానే కెమెరామన్ చోటానాయుడుకు నా ఫొటోలు పంపించారు.
ఆయన నన్ను హీరోయిన్‌గా తీసుకుందామని దర్శకుడు విజయభాస్కర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే నాకు కబురు రావడంతో వెళ్లగా ఒక్క రోజులోనే నన్ను ఎంపిక చేశారు. 2010లో విజయభాస్కర్ దర్శకత్వం వహించిన 'ప్రేమకావాలి' నా మొదటి సినిమా. ఆ తర్వాత సునీల్ హీరోగా పూలరంగడు చిత్రంలో నటించా. ఆ సినిమా నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. శ్రీమన్నారాయణ, మిస్టర్ పెళ్లికొడుకు చిత్రాలు చేశాను. నాలుగు తెలుగు చిత్రాల్లో నటించడంతో తెలుగు పూర్తిగా నేర్చుకున్నాను. కన్నడంలో హీరో దర్శన్‌తో నటించిన విరాట్ చిత్రం త్వరలో విడుదలవుతుంది. హిందీలో సల్మాన్‌ఖాన్, తెలుగులో నాగార్జున నా అభిమాన హీరోలు. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే నా లక్ష్యం" అని ఇషాచావ్లా వెల్లడించారు.