రేపు అర్ధరాత్రి బలమైన పెళ్లి ముహూర్తం!
Published Fri, Aug 23 2013 4:13 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
(న్యూస్‌లైన్, శ్రీకాకుళం ఫీచర్స్) : ఆగస్టు 24, శనివారం అర్ధరాత్రి 2.38 గంటలు. ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్‌లో బలమైన, మంచి ముహూర్తం కావటంతో జిల్లా వ్యాప్తంగా వేలాది జంటలు ఒక్కటవుతున్నాయి. దీంతో బ్యాండ్ మేళం నుంచి పురోహితుల వరకూ, సప్లయర్స్ నుంచి క్యాటరింగ్ వరకూ.. అందరికీ విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రతి కుటుంబానికి కనీసం ఓ శుభలేఖ అందే ఇలాంటి ‘హాట్’ ముహూర్తం ఒకటి ప్రతి సీజన్‌లోనూ వస్తూ ఉంటుంది. ఈ 24వ తేదీ మాత్రం.. ఇటు ఆడపిల్లల తల్లిదండ్రులు, అటు దూరప్రాంతాల నుంచి వచ్చే బంధుమిత్రులకు ఖర్చులను పెంచే స్తోంది.
ఆర్టీసీ సమ్మె దీనికి ప్రధాన కారణం. ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్న సందర్భంలోనూ పెళ్లిళ్ల సీజన్‌లో ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్‌కు చేతినిండా పని ఉండేది. బస్సులతోపాటు, వ్యాన్లు, జీపులు కూడా కిటకిటలాడేవి. ఇప్పుడు ప్రధాన రవాణా సర్వీసు సమ్మె సైరన్ మోగించడంతో ప్రైవేట్ వాహనాల యజమానులు పండుగ చేసుకుంటున్నారు. చార్జీలను రెండు నుంచి మూడు రెట్లు పెంచేస్తున్నారు. తప్పనిసరిగా పెళ్లికి హాజరు కావాలంటే ఈ ఖర్చుకు సిద్ధం కావల్సిందే! ఈ బాధంతా ఎందుకని ప్రయాణం రద్దు చేసుకుంటున్నవాళ్లూ లేకపోలేదు.
కూర‘గాయాలు’
కిలో ఉల్లి 50 నుంచి 60 రూపాయలు. వంకాయ, చిక్కుడు కాయ, క్యాబేజీ లాంటి కూరలు కిలో నలభై రూపాయలు. ఇవి గురువారం నాటికి మార్కెట్ ధరలు. శుక్ర, శనివారాల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్‌లో కూరగాయల ధరలు కొంతమేర పెరుగుతాయి. ఈసారి సమైక్యాంధ్ర ఉద్యమ ఫలితంగా 30నుంచి 40 శాతం వరకూ పెరిగాయి. దీంతో క్యాటరింగ్ నిర్వాహకులు కూడా ధరలు పెంచక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా అనుకున్న బడ్జెట్ తారుమారవుతోందని పెళ్లిపెద్దలు ఆందోళన చెందుతున్నారు.
నష్టాలొస్తున్నాయి..
గత కొద్దికాలంగా కూరగాయలు, పప్పు దినుసుల ధరలు పెరుగుతూ వస్తున్నాయని అయ్యప్ప క్యాటరింగ్ సర్వీసెస్ నిర్వాహకుడు కె.నగేష్ చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతంగా సాగుతుండటంతో ధరలు ఊిహ ంచిన దానికంటే ఎక్కువగా పెరిగాయని ఆయన వెల్లడించారు. దీనివల్ల తాము నష్టాలను ఎదుర్కొనాల్సి వస్తోందని వాపోయారు. ఈ పరిస్థితులెలా ఉన్నా పెళ్లిళ్లు ఆగవు. ఖర్చులూ తప్పవు. ఇంకెందుకాలస్యం. బయల్దేరండి.. పెళ్లి సందడికి!
Advertisement
Advertisement