పల్నాడులో కుండపోత వాన
Published Fri, Aug 16 2013 4:06 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
కారంపూడి,న్యూస్‌లైన్ : పల్నాడులో బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు కుండపోత వర్షం కురియడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కారంపూడి మండలంలో లోతట్టు నివాసప్రాంతాలు నీటమునిగాయి. వాహనాల రాకపోకలకు పలు చోట్ల అంతరాయం కలిగింది. పౌర జీవనం స్తంభించింది. మండలంలో 78 మిల్లీమీటర్ల వర్షం పడివుండవచ్చని అంచనా. నాగులేరు నిండుగా ప్రవహించింది. ఒప్పిచర్లలో కబోదివాగు,రాళ్ళవాగు పొంగి పరివాహ కప్రాంతంలోని పొలాలన్నీ జలమయమయ్యాయి. మిరియాలలో ఎర్రవాగు,ఊరి ముందలి చెరువు, చినగార్లపాడు,పెద కొదమగుండ్లలోని తుమ్మల వాగులు కూడా నిండుగా ప్రవహిస్తున్నాయి.
జల దిగ్బంధంలో దాచేపల్లి
దాచేపల్లి: మండల కేంద్రమైన దాచేపల్లి జలదిగ్భందంలో చిక్కుకుంది. వర్షంనీరు నాగులేరులో కలిసేందుకు సరైన మార్గంలేక లోతట్టు ప్రాంతాల్లోని నివాసగృహాల్లోకి నీరు ప్రవేశించింది. కారంపూడి రోడ్డు ఎదురుగా ఉన్న నివాసాలు, దుకాణాల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇళ్లను ఖాళీచేసి రోడ్లపైకి వచ్చారు. వస్తువులు నీటిలో కొట్టుకుపోయాయి. నారాయణపురంలోని కొన్ని ఇళ్లల్లోకి నీరు ప్రవేశించటంతో మోటర్‌ల ద్వారా బయటకు తోడించారు. కొట్లా బజారులోనూ పలు దుకాణాలు నీట మునిగాయి. నాలుగు గంటల పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎస్‌ఐ రమేష్‌బాబు వర్షం నీరు నాగులేరులో కలిసేలా పొక్లెయిన్‌తో గండికొట్టించారు. నాగులేరులో నీటి ప్రవహం అధికమైంది. నాగులేరు ఒడ్డున బహిర్భుమికి వెళ్లిన ఓ వ్యక్తి ప్రవహంలో కొట్టుకుపోతుండటంతో ఎస్‌ఐ, స్థానికులు రక్షించారు. వర్షానికి పత్తి, మిరపపంటలు నీటిమునిగాయి. దాచేపల్లి ఎస్టీకాలనీలో శ్రీరామం అంజమ్మ పెంకుటిల్లు కూలిపోయింది. వర్షంధాటికి నడికుడి రైల్వేస్టేషన్ సమీపంలో ట్రాక్ దెబ్బతింది. రైలుపట్టాల కింద ఉన్న కంకర నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. కీమెన్ విషయాన్ని రైల్వేస్టేషన్ మాస్టార్ భీమశంకర్‌కు తెలియజేయడంతో ఆయన సిబ్బందితో మరమ్మతులు చేయించారు. నడికుడి నుంచి మాచర్లకు వెళ్లాల్సిన ప్యాసింజర్‌ను గుంటూరుకు మళ్లించడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.
కొట్టుకుపోయిన సామగ్రి
గురజాల: మండలంలో భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. నీరు ఉప్పెనలా వచ్చి ఇంట్లో సామాన్లు కొట్టుకు పోతుండటంతో విలువైన వస్తువులు చేత పట్టుకొని జనం సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. పట్టణంలోని రెడ్డిబండ, చినమసీదు సెంటర్, బుడగజంగాల కాలనీ,జిఐసి కాలనీ, వికలాంగుల కాలనీ,పెదబావిసెంటర్,బాలాజి నగర్, శ్రీరాంపురం,మేదరకాలనీ,వెంకట్రావ్ నగర్,లక్ష్మీటాకీస్ సెంటర్ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అంతర్గత రహదారులు వాగులను తలపించాయి. ఇండ్లలోని వస్తువులు,బట్టలు నీట మునగటంతో,ప్రజలు కట్టు బట్టలతో మిగిలారు. రెవెన్యూ, పోలీస్ యంత్రాం గం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాగులు,వంకలు పొంగడంతో వందల ఎకరాల్లో పత్తి,మిరప పంటలు నీటిలో మునిగాయి.
రాళ్ళ బండి వాగు ఉధృతం
వేమవరం(మాచవరం): వేమవరంలో రాళ్ళ బండి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.
వేమవరం - మాచవరం రాకపోకలు స్తంభించాయి.
రెంటచింతల: రెంటచింతలలో గోలివాగు ఉధృతంగా ప్రవహించడంతో పలు రహదారులు జలమయమైయ్యాయి. సుమారు 12 గంటల పాటు రాకపోకలు నిలిచిపోవడంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఏడుమంగళం వాగు పొంగడంతో సుమారు 100 ఎకరాల వరి పంట నీట మునిగింది.
Advertisement
Advertisement