
మాట్లాడుతున్న మంత్రి అఖిలప్రియ
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వివిధ ఫెస్టివల్స్‌ను వచ్చే ఏడాది నుంచి పర్యాటకశాఖే నిర్వహిస్తుందని పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. ఆదాయం వచ్చే ఈవెంట్లు, పండగలను నిర్వహించడం ఎలా? అన్న దానిపై ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఈ నెల 28 నుంచి జరగనున్న యాటింగ్ ఫెస్టివల్ వివరాలను తెలిపేందుకు సోమవారం రాత్రి ఫిషింగ్ హార్బర్ జెట్టీ వద్ద ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడాది రాష్ట్రంలో 24 ఈవెంట్లకు గాను 18 మాత్రమే నిర్వహించామన్నారు.
వచ్చే సంవత్సరం ఏఏ కార్యక్రమాలు చేపట్టాలో కేలండర్ రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలో పర్యాటకరంగంపై అందరిలోనూ ఆసక్తి పెరుగుతోందన్నారు. విశాఖలో ఉన్న అందమైన పర్యాటక వనరులను బయట ప్రపంచానికి తెలియజేయడానికి, అంతర్జాతీయంగా పర్యాటకులను ఆకర్షించేందుకు యాటింగ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఫెస్టివల్‌కు వచ్చే ఆదరణను బట్టి భవిష్యత్‌లో ఇలాంటివి నిర్వహించాలా? వద్దా? అన్నది అధ్యయనానికి వీలుంటుందన్నారు. గోవాలో యాటింగ్ ద్వారా గంటకు రూ.90 వేల నుంచి లక్ష ఆదాయం వస్తుందని, విశాఖలోనూ అలాంటి ఆదరణ ఉంటుందో, లేదో చూస్తామన్నారు.
ఫెస్టివల్‌లో పాల్గొనున్న 9 బోట్లు
యాటింగ్ ఫెస్టివల్‌లో 9 బోట్లు పాల్గొంటున్నాయన్నారు. ఈ ఫెస్టివల్ పూర్తయ్యాక వీటిలో రెండు బోట్లను కొన్నాళ్లపాటు ఆసక్తి ఉన్న వారి కోసం ఇక్కడ ఉంచుతామని తెలిపారు. అనుమతి కోసం విశాఖ పోర్టు ట్రస్టు అధికారులతో చర్చిస్తామన్నారు. యాటింగ్‌లో పాల్గొనే బోట్లకు రక్షణగా గజ ఈతగాళ్లున్న స్థానిక మత్స్యకారుల బోట్లు ఉంటాయని, అత్యవసర సాయం అందించడానికి నేవీ అంగీకరించిందని చెప్పారు.
ఇప్పటివరకు 14 మంది రిజిస్ట్రేషన్
ఇప్పటిదాకా ఈ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు 14 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. యాటింగ్ క్రీడ ఖరీదు కూడుకున్నది కావడంతో ఉన్నత వర్గాల వారిని దృష్టిలో ఉంచుకునే టిక్కెట్టు ఖరీదు రూ.14,500గా నిర్ణయించామన్నారు. అన్ని పర్యాటక ఈవెంట్లను ఈ–ఫ్యాక్టర్ సంస్థకే ఎందుకు కట్టబెడుతున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ టూరిజం ఎంప్యానల్ అయినందును ఈ సంస్థకు అప్పగిస్తున్నామన్నారు.
ఈ యాటింగ్ ఫెస్టివల్ ద్వారా వచ్చిన సొమ్మును మత్స్యకారుల సంక్షేమానికి ఖర్చు చేస్తామని ఈ–ఫ్యాక్టర్ సంస్థ ప్రతినిధి సుమీత్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ సృజన మాట్లాడుతూ యాచింగ్ ఫెస్టివల్‌లో వివిధ అడ్వెంచర్ ఈవెంట్లతో పాటు ప్రతిరోజూ 20 మందిని ఎంపిక చేసి లక్కీ డ్రా తీస్తామన్నారు. విజేతలకు ఒకరోజు యాచ్‌ల్లో ఉచితంగా విహరించే అవకాశం కల్పిస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో పర్యాటకశాఖ ఈడీ డి.శ్రీనివాసన్, జిల్లా పర్యాటకాధికారి పూర్ణిమదేవి, ఈఫ్యాక్టర్ సంస్థ ప్రతినిధి ముఖర్జీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment