ఏలూరు : పట్టణాల్లో అనుమతులు లేని నిర్మాణాలను క్రమబద్ధీకరించే పనిలో టౌన్‌ప్లానింగ్ అధికారులు బద్ధకాన్ని వీడటం లేదు. దీంతో ప్రభుత్వ ఉద్దేశం నెరవేరకపోగా, స్థానిక సంస్థల ఆదాయం పెరగడానికి ప్రతిబంధకంగా మారిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నెల 27వ తేదీతో క్రమబద్ధీకరణ గడువు ముగియనున్నా అధికారుల్లో చలనం లేదు. ఈ కార్యక్రమంపై భవన యజమానులకు ఒక్కసారి కూడా అవగాహన సదస్సులను నిర్వహించలేదు. ప్లాట్లు, అపార్టుమెంట్ల నిర్మాణాలు జరిగే ప్రాంతాల్లో క్రమబద్ధీకరణపై కరపత్రాలు, ఇతర విధాలుగా ప్రచారం చేయాలన్న అంశాన్ని అధికారులు గాలికొదిలేశారు.
ఇప్పటికే పలుమార్లు అవకాశం
అనుమతులు లేని నిర్మాణాలను క్రమబద్ధీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. వంద చదరపు మీటర్లు, ఆపైబడి నిర్మించిన భవనాలు అర్హమైనవిగా పేర్కొంది. దీనికి సంబంధించి జీవో నెంబరు 128ని 2015 మేలో జారీచేసింది. గతంలో 1996 సంవత్సరంలో ఆ తరువాత 2008లోనూ ప్రభుత్వం క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. ఏడేళ్ల విరామం అనంతరం మరోసారి జీవో జారీచేసింది. 2008లో ప్రజల నుంచి స్పందన బాగా వచ్చింది. ఆరువేలకుపైగా దరఖాస్తులు రాగా వీటి ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ. 10 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఈసారి రూ.20 కోట్ల వరకు సమకూరుతుందని ఉన్నతాధికారులు అంచనా వేశారు. అయితే అంత ఆదాయం సమకూరుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
100లోపే దరఖాస్తులు
ఏలూరు కార్పొరేషన్, మిగిలిన మునిసిపాల్టీల్లో 100లోపే దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఏలూరులో అపార్ట్‌మెంట్లు, ఇతర నిర్మాణాలు క్రమబద్ధీకరించుకునేందుకు 25 దరఖాస్తులను భవన యజమానులు సమర్పించినట్టు తెలిసింది. ఇక్కడ గతంలోనే బీపీఎస్‌లో క్రమబద్ధీకరణకు డిపాజిట్లుగా వచ్చిన సొమ్మును పెద్ద మొత్తంలో ఓ ఉద్యోగిని పక్కదారి పట్టించారు. ఆ అంశం ఎటూ తేలలేదు. దీంతో అప్పుడు దరఖాస్తు చేసుకున్నవారిలో కొంతమంది ఇప్పుడు దరఖాస్తు చేయాలా? వద్దా అన్న మీమాంసలో ఉన్నారు.
అంతా ఆన్‌లైన్ విధానం
ఈసారి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అన్ని పత్రాలను స్కాన్ చేసి ఉంచుకోవాలి. నెట్ వెబ్‌సైట్‌లోకి వెళ్లిన అనంతరం అడిగిన దరఖాస్తుల వివరాలకు సమాధానాలిస్తూ స్కాన్ పత్రాలను అప్‌లోడ్ చేయాలి. నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ. 10 వేలు చెల్లించాలి. తదుపరి ప్రక్రియలు అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి.
ఎన్నో ఇబ్బందులు
దరఖాస్తు పత్రాలు చాలావరకు ఎ4 సైజుకు మించి ఉన్నాయి. అందుకు తగ్గట్లు స్కానర్లు లేవు. ఉన్నచోట్ల బోలెండత ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనికితోడు నెట్ బ్యాకింగ్ కావడంతో సాంకేతిక సమస్యలకు తోడు ఏదైనా పొరపాటు జరగొచ్చనే భయంతో జనం ముందుకు రావడం లేదు. అప్‌లోడ్ చేసిన దరఖాస్తులను చూసుకొనేందుకు పట్టణ ప్రణాళిక విభాగంలో పూర్తి స్థాయిలో సాంకేతిక పరికరాలు లేవు. కనీసం కంప్యూటరు, ఇంటర్నెట్ సౌకర్యం సైతం అందుబాటులో లేవు.
అందినకాడికి దోచుకున్నారు
ఎక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయో కింది స్థాయి సిబ్బంది విచారణ జరిపి, నిర్మాణదారులకు పురపాలక సంఘానికి అనుసంధానకర్తలుగా వ్యవహరించాలి. పురపాలక సంఘాలకు ఆదాయం పెంచేలా చూడాలి. క్షేత్రస్థాయిలో అది ఎక్కడా కానరావడం లేదు.
అనుమతులు లేని నిర్మాణాలు, విస్తరణ పనులు కనిపిస్తే చాలు. సిబ్బందికి పండగే. అందినకాడికి దోచుకొని ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. కొత్తగా వచ్చిన అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలపై ఆసక్తి చూపడం లేదు. కిందిస్థాయి సిబ్బంది పైనే ఆధారపడుతున్నారు. జిల్లాలో పుష్కరాల నేపథ్యంలో క్రమబద్ధీకరణపై అధికారులు దృష్టిపెట్టే అవకాశాలు కనిపించడం లేదు.
క్రమ‘బద్ధకం’
Published Tue, Jul 7 2015 2:20 AM | Last Updated on Sun, Sep 3 2017 5:01 AM
Advertisement