ట్రాక్టర్-ఆర్టీసీ బస్సు ఢీ | tractor and bus met road accident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్-ఆర్టీసీ బస్సు ఢీ

Published Wed, Jan 22 2014 2:39 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

ట్రాక్టర్-ఆర్టీసీ బస్సు ఢీ - Sakshi

ట్రాక్టర్-ఆర్టీసీ బస్సు ఢీ

 కోటనందూరు(తూర్పుగోదావరి జిల్లా), న్యూస్‌లైన్ : తుని-నర్సీపట్నం ప్రధాన రహదారిపై తూర్పు గోదావరి జిల్లా కాకరాపల్లి శివారులో సోమవారం అర్ధరాత్రి ఇసుక ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. తుని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నర్సీపట్నం నుంచి తుని వస్తోంది. అదే సమయంలో కోటనందూరు నుంచి నర్సీపట్నం వైపు ఇసుక ట్రాక్టర్ వెళుతోంది. కాకరాపల్లి శివారులో ఒకే లైటు వేసి వస్తున్న ఈ ట్రాక్టర్‌ను బస్సు డ్రైవర్ ద్విచక్ర వాహనంగా భావించాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ ఇంజన్ పక్కనుంచి వెళ్లిన బస్సు నేరుగా తొట్టెని ఢీకొంది. డ్రైవర్ వైపు బస్సు భాగం నుజ్జయింది.
 
  విశాఖ జిల్లా గన్నవరం మెట్టకు చెందిన బస్సు డ్రైవర్ జీరెడ్డి అప్పలనాయుడు కాళ్లు చేతులకు తీవ్ర గాయాలు కావడంతో.. బస్సును అదుపు చేయలేకపోయాడు. బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న 33 కేవీ లైన్ స్తంభాన్ని ఢీకొంది. ఈ లైన్ ద్వారా విశాఖ జిల్లాకు విద్యుత్ సరఫరా అవుతుంది. దీని విద్యుత్ తీగలు బస్సుపై తెగిపడ్డాయి. స్తంభాన్ని బస్సు ఢీకొన్న వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్పలనాయుడుతో పాటు ప్రయాణికులు సుగల సత్య, వి.లోవలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని తుని ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొంది వేరే ఆస్పత్రులకు వెళ్లిపోయారు. గాయపడ్డ సత్య ఖమ్మం జిల్లా కొత్తగూడేనికి వెళ్తున్నట్టు తెలిసింది. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ను కోటనందూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 నిలిచిన విద్యుత్ సరఫరా
 ప్రమాదం కారణంగా విశాఖ జిల్లా నాతవరం మండలంలోని నాతవరం, చినగొలుగొండపేట గ్రామాల్లోని విద్యుత్ సబ్‌స్టేషన్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సోమవారం రాత్రంతా ఆయా సబ్‌స్టేషన్ల పరిధిలోని అనేక గ్రామాల్లో చీకటి రాజ్యమేలింది. మంగళవారం విశాఖ జిల్లాకు చెందిన ట్రాన్స్‌కో అధికారులు మరమ్మతులు చేపట్టారు.
 
 ఇసుక అక్రమ రవాణా.. అందుకే ఒకటే లైటు!
 తాండవ నది ఇసుక ర్యాంపుల నుంచి రాత్రివేళ జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ కూడా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్టు తెలిసింది. గుట్టుచప్పుడు కాకుండా ఉండేందుకే ట్రాక్టర్ డ్రైవర్లు సింగిల్ లైట్లు వినియోగిస్తున్నట్టు చెబుతున్నారు. తాండవ నది పరివాహక ప్రాంతాలైన కోటనందూరు, అల్లిపూడి, కేఓ అగ్రహారం, బొద్దవరం ఇసుక ర్యాంపుల్లో రాత్రివేళ పెద్దఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement