ట్రాక్టర్‌ను ఆపబోయి డ్రైవర్ మృతి
Published Mon, Sep 30 2013 2:16 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
కేశిరెడ్డిపల్లి(బచ్చన్నపేట), న్యూస్‌లైన్ : దేవాదుల ఓపెన్ కాల్వ వద్ద పనులు చేసేందుకు వెళ్లి.. కదులుతున్న ట్రాక్టర్‌ను ఆపబోయి ఓ డ్రైవర్ మృతిచెందిన సంఘటన మండలంలోని కేశిరెడ్డిపల్లి - కొడవటూరు గ్రామాల సమీపంలో ఆదివారం జరిగిం ది. పోలీసుల కథనం ప్రకారం... కేశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మారబోయిన వెంకటయ్య, యాదమ్మ దంపతుల పెద్ద కుమారుడు శ్రీనివాస్(16) రెండు నెలలుగా దేవాదుల పనుల వద్ద పనిచేస్తున్నాడు. నిర్మాణం జరుగుతున్న ఓపెన్ కాల్వలకు క్యూరింగ్ చేయడమేగాక, ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఉదయమే కాల్వలకు క్యూరింగ్ చేసేందుకు ఇంట్లో నుంచి వెళ్లాడు. ట్రాక్టర్‌ను నిలిపి క్యూరింగ్ చేస్తుండగా ఆ స్థలం ఒంపుగా ఉండడంతో ఒక్కసారిగా ట్రాక్టర్ ముందుకు కదిలింది.
దీంతో ఆందోళన చెందిన శ్రీనివాస్ ట్రాక్టర్‌ను ఆపేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. చాతికి తీవ్ర గాయమవడంతో అక్కడికక్కడే మృతిచెం దాడు. అటుగా వెళుతున్న కొంతమంది శ్రీనివాస్‌ను చూసి గ్రామస్తులకు సమాచారం అందించారు. వారు వెళ్లి చూసేసరికే మృతిచెంది ఉన్నాడు. కాల్వవద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ‘కొడుకా ఇప్పుడే వస్తానని వెళ్లి.. కనిపించకుండా పోతివా’ అంటూ మృతుడి తల్లి తల్లడిల్లింది. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్నావని ఆశపడ్డాం.. మాకు తలకొరివి పెడతావనుకుంటే..మా కళ్లెదుటే మాయమయ్యావా బిడ్డా.. మేమెట్లా బతికేది అని విలపించారు.
బాలకార్మికుడితో కాంట్రాక్టర్ పనులు
దేవాదుల ఓపెన్‌కాల్వ సమీపంలో మైనర్ అయిన మృతుడు శ్రీనివాస్‌తో కాంట్రాక్టర్ పనులు చేయించడంపై గ్రామస్తులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మృతుడి సర్టిఫికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలుడిని పనిలో పెట్టుకోవడమేగాక డ్రైవర్‌గా, క్యూంరింగ్ రెండు పనులు చేయించడం ఏమిటని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పోలీసులు కేసునమోదు చేసేందకు సిద్ధమయ్యారు. పనిచేసే కార్మికులకు సరైన శిక్షణ ఇవ్వకపోవడంవల్లే ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
చేర్యాల సీఐ జితేందర్, బచ్చన్నపేట ట్రైనీ ఎస్సై వేణుగోపాల్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డగించారు. కాంట్రాక్టర్ వచ్చి బాధిత కుటుంబాన్ని ఆదుకునేవరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని నాయకుడు కంతి యాకూబ్, సర్పంచ్ శ్రావణబోయిన బాల్‌నర్సయ్య డిమాండ్ చే శారు.
Advertisement
Advertisement