
తిరగబడిన ట్రాక్టరు ట్రక్కు
ఆ ఇంట్లో పెళ్లి బాజా సందడి చేసింది ... వధూవరులు దంపతులుగా మారారు ... వివాహ వేడుకల నుంచి బయటపడి పెండ్లికుమారుడి ఇంటి వద్ద ‘పెద్దల భోజనం’ పేరుతో ప్రత్యేకవిందు ఏర్పాటు చేశారు. ఆ విందు ఆరగించి వధూవరులను ఆశీర్వదించి ట్రాక్టర్‌లో ఇంటికి తిరుగు పయనమయ్యారు.ఆ ట్రాక్టర్ అదుపు తప్పి పల్టీ కొట్టడంతో ఆర్తనాదాలు...పలువురికి గాయాలు...ఒకరి పరిస్థితి విషమంగా మారడంతో పలు కుటుంబాల్లో విషాదం అలుముకుంది.
పిఠాపురం:ఆ ఇంట్లో రెండు రోజుల క్రితమే పెళ్లయ్యింది. పెద్దలందరూ కలిసి పెళ్లికుమారుడి ఇంటికి భోజనాలకు వెళ్లి వధూవరులను ఆశీర్వదించి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే వారు ప్రయాణిస్తున్న వాహనం తిరగబడి.. వాహనంలో ఉన్నవారు క్షతగాత్రులుగా మారిన సంఘటన ఇది.గొల్లప్రోలు మండలం తాటిపర్తి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రాక్టరు తిరగబడి 34 మందికి గాయాలుకాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపల్లి మండలం శ్రీరాంపురానికి చెందిన కె.నాగేశ్వరరావు కుమార్తెకు గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామానికి చెందిన వ్యక్తితో రెండు రోజుల క్రితం వివాహమైంది. మగ పెళ్లివారు పెళ్లి రోజున శ్రీరాంపురంలో భోజనాలు చేయగా ఆడపెళ్లివారు మగ పెళ్లివారింట విందు భోజనాలు చేయడానికి ఆదివారం సాయంత్రం కొడవలి వెళ్లారు. మగ వారందరూ వివిధ వాహనాలపై వెళ్లగా మహిళలు ట్రాక్టరుపై వెళ్లారు. విందు భోజనాలు పూర్తి చేసుకుని నవవధూవరులను ఆశీర్వదించి రాత్రి 12 గంటల ప్రాంతంలో ట్రాక్టరుపై సుమారు 38 మంది మహిళలు శ్రీరాంపురం బయల్దేరారు.
గొల్లప్రోలు మండలం తాటిపర్తి సమీపంలోకి రాగానే ట్రాక్టరు అదుపుతప్పి వేగంగా దూసుకుపోయి ఒక్కసారిగా ట్రక్కు పైకి లేచి పోవడంతో ట్రక్కులో ఉన్న మహిళలు కిందకు పడిపోయారు. వీరిలో మడికి అప్పయ్యమ్మ, నాగళ్ల లక్ష్మి, ఎం.సుబ్బలక్ష్మి, నాగళ్ల లోవలక్ష్మి, పిర్ల రమణమ్మ, రాయుడు అప్పలకొండ, కె.సత్యవతి, టి. సుబ్బయ్యమ్మ, టి.లక్ష్మి, యాదాల గంగ, యాదాల సుబ్బలక్ష్మి, మడికి నాగమణి, యాదాల సత్యవతిలతో పాటు 34 మందికి గాయాలయ్యాయి. వీరిలో పిర్ల లక్ష్మి, మడికి వీర రాఘవ, యాదాల అప్పలకొండ, నాగళ్ల ముసలమ్మ తీవ్రంగా గాయపడ్డారు. పిర్ల లక్ష్మి అనే వివాహిత తలకు బలమైన గాయమై పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె కాకినాడలో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న గొల్లప్రోలు ఎస్సై శివకృష్ణ తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 ఇతర వాహనాలపై ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతున్నారు. గొల్లప్రోలు ఎస్సై కేసు నమోదు చేసి దార్యప్తు చేస్తున్నారు. ట్రాక్టరు డ్రైవరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ట్రాక్టరు ప్రమాదవశాత్తూ ట్రక్కు పైకిలేచి ఉండిపోయిందని, అదే బోల్తా కొట్టి ఉంటే దానికింద పడి చాలామంది ప్రాణాలు కోల్పోయి ఉండేవారని బాధితులు వాపోయారు.
వెంటిలేటర్ లేక ప్రైవేటు ఆసుపత్రికి..
కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో వెంటిలేటర్ ఖాళీగా లేదని వైద్య సిబ్బంది చెప్పడంతో పిర్ల లక్ష్మి అనే బాధితురాలిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టు బాధిత బంధువులు తెలిపారు.
క్షతగాత్రులను పరామర్శించిన పెండెం
సర్పవరం (కాకినాడ సిటీ): వన్నెపూడి ట్రాక్టర్ బోల్తా ప్రమాదంలో గాయపడి కాకినాడ ప్రభుత్వసామాన్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ పిఠాపురం కో–ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్‌తో మాట్లాడారు. పరామర్శించిన వారిలో వైఎస్సార్ సీపీ జిల్లా జాయింట్ సెక్రటరీ కర్రి దుర్గాప్రసాద్, నాయకులు రావి రమేష్, కడారి సతీష్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment