హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. లాల్ బహుదూర్ స్టేడియంలో జరుగనున్న సభ నేపథ్యంలో ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు.
నాంపల్లి, పీసీఆర్ నుంచి వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు అనుమతించరు. సుజాత స్కూల్, చర్మాస్ వైపు నుంచి వాహనాలను గన్ఫౌండ్రీ, ఎస్ బీఎచ్ వైపు మళ్లిస్తామన్నారు. సెమెట్రీ వద్ద నుంచి వచ్చే వాహనాలను బషీర్ బాగ్ వైపు నుంచి పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ మీదుగా హిమయత్ నగర్ వై జంక్షన్ వైపు మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. రాజమోహల్లా వైపు నెంచి వచ్చే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ మీదుగా సెమీట్రి జంక్షన్ వద్ద మళ్లించనున్నారు.
బొగ్గుల కుంట, తాజమహల్, ఈడెన్ గార్డెన్స్ మరియు కింగ్ కోఠి నుంచి వచ్చే వాహనాలను బషీర్ బాగ్ నుంచి కాకుండా కింగ్ కోఠి క్రాస్ రోడ్డు మీదుగా తాజమహల్, అబిడ్స్ వైపు మళ్లించనున్నారు. అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి వచ్చే వాహనాలను బషీర్ బాగ్ జంక్షన్ మీదుగా లిబర్టీ, హిమయత్ నగర్ ల వైపు దారి మళ్లించనున్నారు. రవీంద్రభారతి, నాంపల్లి వైపు నుంచి బషీర్ బాగ్ కు వెళ్లే వాహనాలను పూర్తిగా రద్దు చేశారు.