న్యూఇయర్ సందర్భంగా జంట నగరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు
హైదరాబాద్: న్యూ ఇయర్ సందర్భంగా జంట నగరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 రాత్రి 10 నుంచి 2గంటల వరకు ప్లైఓవర్లను మూసివేయనున్నట్టు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. సైబారాబాద్‌లోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. పీవీ ఎక్స్‌ప్రెస్‌వే, ఔటర్‌రింగ్‌రోడ్డుపై ఎయిర్ టిక్కెట్ ఉన్నవారికే అనుమతిని ఇస్తున్నట్టు సీవీ ఆనంద్ చెప్పారు.
అలాగే ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నట్టు సిటీ పోలీస్ కమీషనర్ అనురాగ్‌శర్మ తెలిపారు. రాత్రి 12గంటల వరకే బార్, పబ్బుల్లో న్యూఇయర్ వేడుకలు జరుపుకోవడానికి అనుమతి ఇస్తున్నామని చెప్పారు. హోటల్లో వేడుకలకు ఒంటిగంట వరకు అనుమతిని ఇస్తున్నట్టు తెలిపారు. రోడ్లపై మితిమీరిన వేగంతో వాహనాలు నడిపేవారిపై ప్రత్యేక డ్రైవ్ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అంతేకాకుండా మందుబాబుల ఆకృత్యాలపై వీడియో కెమెరాల నిఘా పెట్టినట్టు కమీషనర్ అనురాగ్‌శర్మ పేర్కొన్నారు.