ఇద్దరి ప్రాణం తీసిన ఈత సరదా
ఇబ్రహీంపట్నం : మండలంలోని గుంటుపల్లి కృష్ణానదిలో ఇద్దరు విద్యార్థులు ఈతకని దిగి మృతిచెందడం వారి కుటుంబ సభ్యులకు అంతులేని ఆవేదనను మిగిల్చింది. ఈత నేర్చుకోవాలన్న సరదా వారి ప్రాణాలను బలితీసుకుంది. గుంటుపల్లి జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుకుంటున్న పిన్నబోయిన తేజ (15), జంగాల వెంకయ్య(15), బోగ్యం గోపి (14), మునుగు సామ్యేలురాజు (13) బుధవారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చారు. అనంతరం గ్రామ సమీపంలోని కృష్ణానది వద్దకు వెళ్లారు. వీరిలో గోపి, సామ్యేలురాజులకు కొద్దిగా ఈత వచ్చు.
స్నానఘాట్ వద్ద కాకుండా కొద్ది దూరంలో ఈ నలుగురూ ఈతకు దిగారు. నది లోతుగా ఉన్న ప్రాంతంలోకి తేజ, వెంకయ్య వెళ్లారు. నీటి ఉధ్రుతికి కొట్టుకుపోతున్న వారిని గోపి, సామ్యేలురాజు కాపాడాలని చూశారు. అయితే తేజ, వెంకయ్య వీరిని గట్టిగా వాటేసుకుంటుండడంతో తమ ప్రాణాలు పోతాయన్న భయంతో వదలివేశారు. కొద్దిసేపటికే వారు నదిలో మునిగిపోయారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న గోపి, సామ్యేలురాజు కేకలు విని ఆ ప్రాంతంలో ఉన్న విజయవాడకు చెందిన టిప్పర్ డ్రైవర్ వాకా సోములు వెంటనే నదిలోకి దిగారు. పిల్లలిద్దరి చేతులు పట్టుకుని ఒడ్డుకు లాగడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
నది లోతు తెలియకే మృతి
గుంటుపల్లి వద్ద కృష్ణానదిలో ఇటీవలే డ్వాక్రా గ్రూప్ మహిళల పేరుతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. నది ఓడ్డునే ఇసుక తవ్వడంతో అక్కడ కూడా లోతుగా ఉంది. ఈ విషయం తెలియక విద్యార్థులు ఈతకని దిగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. మృతులిద్దరూ గుంటుపల్లి ఖాజీపేటకు చెందిన వారే. తేజ తండ్రి కోటేశ్వరరావు కూలి పనిచేస్తున్నాడు. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. తేజ అకాల మరణంతో కోటేశ్వరరావు, నాగమణి దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనలో జంగాల వెంకయ్య ప్రాణాలు కోల్పోవడంతో అతడి తండ్రి బడేమియా, తల్లి వేదమ్మ, సోదరి సౌభాగ్యలక్ష్మి బోరున విలపిస్తున్నారు. గుంటుపల్లి ఖాజీపేట వాసులు వచ్చి ఇద్దరి మృతదేహాలను చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
పరామర్శ
మృతుల కుటుంబ సభ్యులను స్థానిక మండల పరిషత్ అధ్యక్షురాలు చీద్రాల ప్రసూన, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు చెరుకూరి వెంకటకృష్ణ, జెడ్పీటీసీ సభ్యురాలు చెన్నుబోయిన రాధా, ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, తహశీల్దార్ హరిహర బ్రహ్మాజీ పరామర్శించారు. గోపి, సామ్యేలురాజును పరామర్శించారు. ఈ ఘటనపై ఎస్సై లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
గుంటుపల్లిలో విషాదం
Published Thu, Nov 6 2014 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM
Advertisement