‘విద్యుత్’ సమ్మెతో రైళ్లకు బ్రేక్
డీజిల్ ఇంజిన్లతో కొన్ని రైళ్లను నడిపించిన అధికారులు
సాక్షి నెట్‌వర్క్: సీమాంధ్రలోని సమైక్య ఉద్యమం రైల్వే వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. విద్యుత్ జేఏసీ నిరవధిక సమ్మెతో రెండోరోజు సోమవారం కూడా గ్రిడ్ నుంచి రైల్వేకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విశాఖపట్నం నుంచి విజయనగరం వరకు విద్యుత్ సరఫరా పూర్తిగా షట్‌డౌన్ అవ్వడంతో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొన్ని రైళ్లను మాత్రం డీజిల్ లోకోమోటివ్‌లతో నడిపించారు. అవీ సరిపోను లేక పలు రైళ్లను రద్దు చేశారు. ఉదయం 10 గంటల నుంచి ఈస్ట్‌కోస్ట్ రైల్వేపై విద్యుత్ సరఫరాలోపం ప్రభావం పడడంతో ఉదయం విజయవాడ మీదుగా వెళ్లిన లింకు, బొకారో ఎక్స్‌ప్రెస్‌లను తాడి, అనకాపల్లిలో నిలిపివేశారు. అనంతరం విశాఖపట్నానికి చెందిన రెండు డీజిల్ ఇంజిన్లను ఏర్పాటు చేసి ఆ రైళ్లను నడిపించారు. దీని ప్రభావంతో ప్రశాంతి, రత్నాచల్, తిరుమల వంటి పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు 3 గంటల నుంచి 4 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. విజయవాడ నుంచి గూడూరు వైపు వెళ్లాల్సిన అన్ని రైళ్లను రైల్వే అధికారులు యథావిధిగా నడిపారు. ఆదివారం కొన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు ఇక్కట్లకు గురయ్యారు. ప్రయాణికుల నిరసనల నేపధ్యంలో ఐదు ప్యాసింజర్ రైళ్లను విజయవాడ-గూడూరు, విజయవాడ-గుంటూరు, విజయవాడ-మచిలీపట్నం, మచిలీపట్నం-విజయవాడ మధ్య నడిపారు. డీజిల్ ఇంజిన్లతో నడపడంతో తీవ్ర నష్టం వాటిల్లుతోందని, అయితే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పైనే దృష్టి కేంద్రీకరించినట్లు విజయవాడలో ఏడీఆర్‌ఎం ఎన్.సీతారామప్రసాద్ పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా వివిధ జోన్ల నుంచి 34 డీజిల్ ఇంజిన్లను రప్పించారు. వాటిని గూడూరు, బిట్రగుంట, విజయవాడ, రాజమండ్రి ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేశారు.
స్తంభించిన గూడ్సు రవాణా
విజయవాడ-విశాఖపట్నం మధ్య విద్యుత్ సరఫరాలో అంతరాయాలతో గూడ్సు రవాణాను నిలిపివేశారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గు, ఎరువులు, పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసరాల రవాణా స్తంభించిపోయింది.
కొనసాగిన ‘రద్దు’లు...
సోమవారం కూడా పలు రెళ్లు రద్దయ్యాయి. విజయవాడ-చెన్నై పినాకిని ఎక్స్‌ప్రెస్, విజయవాడ-చెన్నై జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్, గుంటూరు-కాచిగూడ, తిరుపతి-మచిలీపట్నం, తిరుపతి-నర్సాపూర్, చెన్నై-గూడూరు, విశాఖపట్నం- కోరాపుట్, విశాఖపట్నం-రాయగఢ్, విశాఖపట్నం- పలాస, విశాఖపట్నం - దుర్గ్, విశాఖపట్నం- రాయ్‌పూర్, విశాఖపట్నం- విజయనగరం ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి. భువనేశ్వర్ - విశాఖపట్నం రైలు సోంపేట వరకు, పూరి- గున్‌పూర్ ప్యాసింజర్‌ను రాంభా వరకు డీజిల్ ఇంజిన్లతో నడిపారు. విజయవాడ-విశాఖపట్నం ప్యాసింజర్, రాజమండ్రి-విశాఖపట్నం ప్యాసింజర్ లను అనకాపల్లి-విశాఖపట్నం మధ్య రద్దు చేశారు. విశాఖపట్నంలో మధ్యాహ్నం 1-30కి బయల్దేరిన విశాఖ- విజయవాడ రత్నాచల్ రైలు కొద్దిదూరం వెళ్లి సాయంత్రం 4-30కి మళ్లీ విశాఖ స్టేషన్‌కు వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలోనూ పలు రైళ్లు నిలిచిపోయాయి. సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లాల్సిన విశాఖ ఎక్స్‌ప్రెస్ దూసి రైల్వేస్టేషన్‌లో ఉదయం 9.30కి నిలిచిపోగా, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ నౌపడా దగ్గర, గువహతి వీక్లీ ఎక్స్‌ప్రెస్, మెయిల్, ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లు సోంపేట దగ్గర మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆగిపోయూరుు. తర్వాత ఒడిశా నుంచి డీజిల్ ఇంజిన్లు రప్పించి ఆ రైళ్లను గమ్యస్థానాలకు పంపారు.