అమరావతికి అవస్థల ప్రయాణం! | Train Services Shortages Tirupati To Amaravati | Sakshi
Sakshi News home page

అమరావతికి అవస్థల ప్రయాణం!

Published Fri, Jun 1 2018 9:04 AM | Last Updated on Fri, Jun 1 2018 9:04 AM

Train Services Shortages Tirupati To Amaravati - Sakshi

తిరుపతి అర్బన్‌ : తిరుపతి నుంచి రాష్ట్ర రాజధాని నగరాలు విజయవాడ, గుంటూరుకు చాలినన్ని రైళ్లు లేవు. రైళ్ల కొరతతో నిత్యం లక్షలాది మంది యాత్రికులు, ఉద్యోగులు, ప్రయాణికులు రాకపోకలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగేళ్లుగా తిరుపతి నుంచి విజయవాడ, విశాఖపట్నం మార్గాల్లో ప్రయాణించే రైళ్లకు పదింతల రద్దీ పెరిగినా అందుకు అనుగుణంగా అదనపు రైళ్లు గానీ, బోగీలు గానీ ఏర్పాటు చేయడంలో రైల్వేశాఖ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దీంతో ఆ వైపు ప్రయాణం అంటేనే ప్రజలు నరకంగా భావించా ల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణ రోజు ల్లోనే రైల్వే ప్రయాణికులు రోజూ 70 నుంచి 85 వేల వరకు ఉంటారు. ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో లక్ష మందికిపైగా ప్రయాణిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి తిరుపతికి వచ్చి వెళ్లే యాత్రికుల కష్టాలు అటుంచితే... విజయవాడ, విశాఖ పరిసర జిల్లాల నుంచి వచ్చివెళ్లే యాత్రికుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి.

ప్రస్తుతం ఐదు రైళ్లే ..
తిరుపతి నుంచి విజయవాడ, గుంటూరు మార్గంలో ప్రస్తుతం రోజుకు నడుస్తున్న రైళ్ల సంఖ్య ఐదే. వాటిలోనూ రెండు రైళ్లు ఉదయం నడిచేవి కావడంతో ఎక్కువ మందికి సౌకర్యంగా ఉండడం లేదు. మధ్యాహ్నం పైన నడుస్తున్న రైళ్లలో నారాయణాద్రి, మచిలీపట్నం, తిరుమల ఎక్స్‌ప్రెస్‌లకైతే సాధారణ రోజుల్లోనే వందల్లో వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లు వస్తున్నాయి. ప్రస్తుత వేసవి రద్దీల్లో ఆ వెయిటింగ్‌ లిస్ట్‌కు అవధులే లేవు. నెల రోజుల వ్యవధిలో ప్రయాణాలు చేసుకోవాలన్నా టికెట్లు మంజూరు కాని పరిస్థితులు ఉన్నాయంటే రద్దీ, డిమాండ్‌ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

పట్టించుకోని అధికారులు
ఇక.. సాయంత్రం 6 గంటలకు బెంగళూరు నుంచి తిరుపతి మీదుగా కాకినాడకు నడిచే శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో అయితే జనరల్‌ బోగీల్లో కూడా సీట్లు దొరకవు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వారంలో రెండు రోజులు బుధ, శనివారాల్లో రాత్రి 10–30 గంటలకు తిరుపతిలో బయల్దేరి విజయవాడ మీదుగా కరీంనగర్‌ వరకు నడుస్తున్న ఎక్స్‌ప్రెస్‌ను రోజూ నడపాలన్న డిమాండ్‌కు అధికా రుల నుంచి స్పందన కరువవుతోంది. ఈ రైలు జిల్లా వాసులకే కాకుండా నెల్లూరు, ప్రకాశం పజలకు కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుంది. రైలును డైలీగా మార్పు చేయాలన్న ప్రతిపాదనలు ఢిల్లీకి వెళ్లినా స్పందన కరువైంది.

రాత్రి 8–30 దాటితే లేనే లేవు..
ప్రస్తుతం తిరుపతి నుంచి రాత్రి 8–30 గంటలు దాటితే మరుసటి రోజు వేకువజామున 3–30 గంటల వరకు విజయవాడకు రైళ్లే లేవు. గుంటూరుకు అర్ధరాత్రి 12–30 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌ ఉన్నప్పటికీ అది కేరళ నుంచి నడుస్తున్న కారణంగా బెర్తులు ఉండక మూడు జిల్లాల వాసులు నరకయాతన పడుతున్నారు. దీంతో వేలాది మంది ప్రజలు వివిధ అధికారిక పనుల నిమిత్తం రాష్ట్ర రాజధానికి వెళ్లేందుకు నానా తంటాలు పడుతున్నారు. వీటన్నింటినీ ఆసరాగా చేసుకుని తిరుపతిలోని ప్రైవేటు ట్రావెల్స్‌ సంస్థలు, టూర్‌ ఆపరేటింగ్‌ నిర్వాహకులు అయినకాడికి దోచుకుంటున్నారు. ఈ విషయంలో ‘సువిధ’ రైళ్ల టికెట్ల ధరలను మించి ధరలు నిర్ణయిస్తూ అవస్థల పాలు చేస్తున్నారు. వేసవి సెలవుల ముగింపు రద్దీకైనా అదనపు రైళ్లు, అదనపు బోగీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement